చిత్తూరు జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన ఎన్టీఆర్
చిత్తూరు జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన ఎన్టీఆర్
గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులతో చిత్తూరు జిల్లాకు జీవనాడి
ద్రవిడ యూనివర్సిటీతో విద్యా, సాంస్కృతిక రంగాలకు కొత్త దిశ
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు
నేడు నందమూరి తారక రమారావు జయంతి
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
రాయలసీమ అంటే కరవు, నీటి ఎద్దడి, వలసలు అనే పరిస్థితులు ఒకప్పుడు సహజంగా కనిపించేవి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రతి వేసవిలో తాగునీటి సమస్యతో అల్లాడేది. సాగునీరు లేక వేలాది ఎకరాలు బీడుభూములుగా మారిపోయేవి. అలాంటి పరిస్థితుల్లో రాయలసీమ భవిష్యత్తును మార్చాలని సంకల్పించిన మహానేత నందమూరి తారకరామారావు. ఆయన దూరదృష్టితో గాలేరు నగరి, హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు చిత్తూరు జిల్లాకు సాగునీరు, తాగునీటి భద్రత కల్పించే మహాయజ్ఞాలుగా గుర్తింపు పొందాయి. రాయలసీమలో కృష్ణా జలాలను మళ్లించి ఎండబారిన ప్రాంతాలకు నీరు అందించాలన్న ఆలోచన అప్పట్లో విప్లవాత్మకంగా భావించబడింది. సాగునీరు అందితే రైతు ఆర్థికంగా నిలబడతాడని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎన్టీఆర్ విశ్వసించారు. అదే ఆలోచనతో గాలేరు నగరి ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లాలో పలమనేరు, నగరి, పూతలపట్టు, సత్యవేడు, కుప్పం ప్రాంతాలకు నీరు అందించాలన్న లక్ష్యం నిర్దేశించారు. అలాగే ద్రవిడ భాషలపైన అధ్యయనం చేయడానికి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీకి రూపకల్పన చేశారు.
ప్రస్తుతం గాలేరు నగరి ప్రాజెక్టు పలు దశల్లో కొనసాగుతోంది. కొన్ని కాలువల నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని ప్రాంతాల్లో భూసేకరణ, కాలువల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంత మేరకు నీటి విడుదల జరిగి రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లు నిలకడగా పనిచేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. పంటల సాగు విస్తీర్ణం కూడా క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అమలైతే చిత్తూరు జిల్లా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా రాయలసీమకు కీలక జీవనాడిగా నిలుస్తోంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు కృష్ణా నీటిని ఎత్తిపోసి అందించే ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సమస్యకు కొంతమేర ఉపశమనం లభించింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి వంటి ఎండబారిన మండలాలకు నీరు అందించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా అనేక చెరువులను నింపుతున్నారు. రైతులకు సాగునీరు అందడంతో పంటల విస్తీర్ణం పెరుగుతోంది. భూగర్భ జలాల మట్టం పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా కొంతవరకు తగ్గింది. అయితే పూర్తి స్థాయిలో అన్ని పంపింగ్ స్టేషన్లు, కాలువలు పూర్తికావాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు చివరి అంచుల వరకు నీరు చేరితే రాయలసీమలో కరువు పరిస్థితులు గణనీయంగా తగ్గుతాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు ఎన్టీఆర్ వేసిన పునాదులను ఆయన రాజకీయ వారసుడు అయిన నారా చంద్రబాబు నాయుడి మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాయలసీమకు నీటి భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కాలువల నిర్మాణం, పంపింగ్ వ్యవస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నీటి ప్రాజెక్టులతో పాటు విద్యా, సాంస్కృతిక రంగాల అభివృద్ధిపైనా ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు.
అదే దూరదృష్టితో చిత్తూరు జిల్లా కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ ఏర్పాటుకు పునాది పడింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ద్రవిడ భాషలపై పరిశోధనలు జరగాలని, దక్షిణ భారత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలని ఆయన ఆకాంక్షించారు. ద్రవిడ యూనివర్సిటీ ఏర్పాటుతో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. సరిహద్దు ప్రాంతమైన కుప్పంలో ఈ విశ్వవిద్యాలయం ఉండడం వల్ల భాషా, సాంస్కృతిక సమన్వయానికి కేంద్రంగా మారింది. ద్రవిడ భాషల మూలాలు, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, జానపద కళలపై పరిశోధనలు జరిగే వేదికగా ఇది నిలిచింది. ప్రస్తుతం ద్రవిడ యూనివర్సిటీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ద్రవిడ భాషలపై ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు, డిజిటల్ గ్రంథాలయాలు, అంతర్జాతీయ స్థాయి అకాడమిక్ భాగస్వామ్యాలు ఏర్పాటు చేస్తే విశ్వవిద్యాలయానికి మరింత గుర్తింపు వస్తుందని సూచిస్తున్నారు. తెలుగు భాషతో పాటు దక్షిణ భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే శక్తి ఈ విశ్వవిద్యాలయానికి ఉందని చెబుతున్నారు.
రాయలసీమలో కరవును జయించాలన్న లక్ష్యంతో నీటి ప్రాజెక్టులు, భాషా సంస్కృతిని కాపాడాలన్న ఆశయంతో ద్రవిడ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ దూరదృష్టిని చిత్తూరు జిల్లా ప్రజలు నేటికీ స్మరించుకుంటున్నారు. ఆయన ప్రారంభించిన అభివృద్ధి పథాలను కొనసాగిస్తూ రాయలసీమ భవిష్యత్తును మార్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

