10, మే 2026, ఆదివారం

రేపటి నుండి చిత్తూరు గంగ జాతర

రేపటి నుండి చిత్తూరు గంగ జాతర 

సీకే బాబు ఆధ్వర్యంలో రెండు రోజుల పండుగ

రాయలసీమ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక

ఓం శక్తి భక్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ

 కర్ణాటక, తమిళనాడు నుంచీ భారీగా భక్తులు 

 (ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

రాయలసీమలోనే అతిపెద్ద గంగ జాతరగా పేరొందిన చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర మరోసారి భక్తి పరవశంతో కళకళలాడేందుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ మహోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. చిత్తూరు పట్టణం మొత్తం ఈ రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోనుంది. చిత్తూరు ప్రజలకు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులకు కూడా ఈ గంగ జాతర ఒక మహా పండుగగా మారింది. ముఖ్యంగా రెండో రోజు జరిగే ఓం శక్తి భక్తుల విన్యాసాలు ఈ జాతరకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. నాలుకలకు, దవడలకు, శరీరానికి చూలాలు గుచ్చుకుని, నిమ్మకాయలను వేలాడదీసుకుంటూ భక్తులు చేసే విన్యాసాలు భక్తి పరాకాష్ఠను తలపిస్తాయి. వీపు వెనుక భాగంలో కొక్కిళ్లు తగిలించుకుని ఆటోలు, జీపులు, కార్లు, లారీలు లాగడం చూసేందుకు లక్షలాది మంది భక్తులు, సందర్శకులు తరలివస్తారు. భక్తి, ఆచారం, సంప్రదాయం, జానపద సంస్కృతి అన్నీ కలిసి కనిపించే ఈ గంగ జాతర రాయలసీమ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

చిత్తూరు గంగ జాతరకు సుమారు 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు పెద్దలు చెబుతారు. ఒకప్పుడు ప్లేగు వంటి ప్రాణాంతక వ్యాధులు విస్తరించిన సమయంలో గ్రామాన్ని వేపాకులు, పసుపు నీటితో శుద్ధి చేస్తూ అమ్మవారిని ప్రార్థించడం ప్రారంభమైందని, అదే నేటి గంగ జాతరగా రూపుదిద్దుకుందని స్థానికుల విశ్వాసం. ఈ జాతరలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే గంగమ్మకు ప్రత్యేక ఆలయం ఉండదు. ప్రతి ఏడాది బజారు వీధిలోనే మట్టి, పసుపుతో గంగమ్మ విగ్రహాన్ని తయారుచేసి ప్రతిష్టిస్తారు. రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేస్తారు. మళ్లీ అమ్మవారిని దర్శించుకోవాలంటే మరో ఏడాది వేచి చూడాల్సిందే. గంగ జాతర నిర్వహణ మొత్తం వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో జరుగుతుంది. తొలి రోజు తెల్లవారుజామున సీకే బాబు తన సతీమణి సీకే లావణ్యతో కలిసి గంగమ్మ తెర తొలగించి తొలి పూజ నిర్వహిస్తారు. ఆ క్షణం నుంచే బజారు వీధి భక్తులతో కిక్కిరిసిపోతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తుంది. జాతరకు వారం రోజుల ముందే చాటింపు వేయడం సంప్రదాయం. చాటింపు వేసిన తర్వాత చిత్తూరు ప్రజలు రాత్రివేళ బయట ఊర్లలో నిద్ర చేయరని, ఎక్కడికి వెళ్లినా తిరిగి చిత్తూరుకు చేరుకోవాలని పెద్దలు చెప్పే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. జాతర సందర్భంగా గంగమ్మ బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది. విద్యుత్ కాంతుల్లో అమ్మవారి రూపం భక్తులను భక్తి భావంలో ముంచెత్తుతుంది. ప్రధాన గంగమ్మతో పాటు సంతపేట, గిరింపేట, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లి, మురకంబట్టు, మంగసముద్రం, ఓబనపల్లి తదితర ప్రాంతాల్లో కూడా గంగమ్మలను ప్రతిష్టించి రెండు రోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహిస్తారు. దీంతో చిత్తూరు పట్టణం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది.

మొదటి రోజు ఉదయం నుంచే భక్తులు అమ్మవారికి ఆంబలి సమర్పిస్తారు. ఇందుకోసం భారీ పెనాలను సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం మాంసాహార నైవేద్యం సమర్పించడం ప్రత్యేక ఆచారం. ఈ నైవేద్యంలో మునగాకు తప్పనిసరిగా ఉంటుంది. సాయంత్రం నేతి దీపాలతో అమ్మవారికి మహా హారతులు ఇస్తారు. బజారు వీధి వర్తకుల సంఘం ప్రతి ఏడాది అమ్మవారికి కొత్త ఆభరణాన్ని సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అలాగే చిత్తూరు వాసవి క్లబ్ తరఫున భక్తులకు మజ్జిగ, శీతల పానీయాలు పంపిణీ చేస్తారు. జాతరలో మరో ప్రధాన ఆకర్షణ భక్తుల వేషధారణ. కొందరు శరీరానికి రంగులు పూసుకుని, మరికొందరు అమ్మవారి సేవకుల్లా అలంకరించుకుని మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు అమ్మవారికి కానుకలు, నైవేద్యాలు సమర్పిస్తూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. బుధవారం సాయంత్రం పన్నెమ్మ గుడి నుంచి సీకే బాబు అమ్మవారికి సారె తీసుకువెళ్లడం జాతరలో అత్యంత ముఖ్య ఘట్టంగా భావిస్తారు. అనంతరం అమ్మవారికి చివరి హారతి ఇచ్చి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. బజారు వీధి నుంచి బయలుదేరిన గంగమ్మకు భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పిస్తారు. కర్పూర హారతులు, పూల వర్షం మధ్య అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగుతుంది. భక్తులకు అన్నప్రసాదాలు, శీతల పానీయాలు అందజేస్తారు. అదే సమయంలో చర్చి వీధిలో ఓం శక్తి భక్తుల విన్యాసాలు ప్రారంభమవుతాయి. వేలాది మంది భక్తులు, సందర్శకులు ఈ విన్యాసాలను చూసేందుకు తరలివస్తారు. నాలుకలకు, శరీరానికి చూలాలు గుచ్చుకుని, కొక్కిళ్లతో వాహనాలు లాగుతూ భక్తులు చేసే విన్యాసాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. భక్తి శ్రద్ధలతో జరిగే ఈ విన్యాసాలు చిత్తూరు గంగ జాతరకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. గంగమ్మ ఊరేగింపు గాంధీ విగ్రహం మీదుగా చందన రమేష్ కార్నర్ చేరుకుంటుంది. అక్కడ సీకే బాబు అమ్మవారికి హారతి ఇచ్చి భక్తులకు వీడ్కోలు పలుకుతారు. అనంతరం గంగమ్మను కట్టమంచి చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా భారీగా బాణసంచా కాలుస్తారు. చందన రమేష్ కార్నర్ వద్ద ఆర్కెస్ట్రా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అడుగడుగునా నిఘా, ప్రత్యేక కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో భద్రతను పటిష్టం చేస్తున్నారు. చిన్నారులు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ కూడా చేపడుతున్నారు. మరోవైపు చిత్తూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శుభ్రత పనులు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భక్తి, విశ్వాసం, సంప్రదాయం, జానపద సంస్కృతి అన్నీ కలిసి కనిపించే చిత్తూరు గంగ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు… చిత్తూరు ప్రజల జీవన విధానంలో భాగమైన మహా ఆధ్యాత్మిక వేడుక. తరతరాలుగా కొనసాగుతున్న ఈ గంగ జాతర రాయలసీమ సంస్కృతికి అద్దం పడుతూ, లక్షలాది మంది భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *