24, మే 2026, ఆదివారం

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

జిల్లాలో 37 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి 

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

15,887 మంది విద్యార్థులు హాజరు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, పోస్టల్, ఆర్టీసీ శాఖల సమన్వయంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈ ఏడాది అడ్వాన్స్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలకు జిల్లాలోని 166 కళాశాలల నుంచి మొత్తం 15,887 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 8,861 మంది, వొకేషనల్ విద్యార్థులు 628 మంది ఉన్నారు. సెకండ్ ఇయర్‌లో జనరల్ విద్యార్థులు 5,874 మంది, వొకేషనల్ విద్యార్థులు 524 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం ఫస్ట్ ఇయర్‌కు 9,489 మంది, సెకండ్ ఇయర్‌కు 6,398 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

పరీక్షలు ప్రతిరోజూ రెండు విడతలుగా నిర్వహించబడనున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రూమర్లు, మాల్‌ప్రాక్టీస్ చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. ఉదయం సెషన్‌కు ఉదయం 6 గంటల నుంచే, మధ్యాహ్నం సెషన్ అనంతరం సాయంత్రం 5.30 గంటల తర్వాత కూడా బస్సులు అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సిద్ధం చేశారు. తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాలు, వైద్య సదుపాయాలు, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షల కాలంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పోస్టల్ శాఖ ద్వారా ఆన్సర్ స్క్రిప్ట్ బండిల్స్ తరలింపుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు కస్టోడియన్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు నియమించబడ్డాయి. ప్రతి కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగనుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే సమన్వయ సమావేశం నిర్వహించి అన్ని శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర స్థాయి మార్గదర్శకాల ప్రకారం పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎ. రఘుపతి మాట్లాడుతూ జిల్లాలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బంది, తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్ శాఖతో కలిసి భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *