5, మే 2026, మంగళవారం

ఈదురు గాలులు, అకాల వర్షంతో మామిడి రైతులకు అపార నష్టం


నేలరాలిన 15 వేల టన్నుల మామిడికాయలు

కిలో రెండు రూపాయల వంతున కొంటున్న వర్తకులు

కూలి, రవాణా కూడా గిట్టుబాటు గాని రైతులు

ఐరాల మండలంలో 18 గంటలు విద్యుత్ సరఫరా బంద్

దెబ్బతిన్న 28 విద్యుత్ స్తంభాలు, 15 ట్రాన్స్ఫార్మర్లు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

చిత్తూరు జిల్లా మామిడి రైతులపై ప్రకృతి మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం, దానికి తోడు ఉధృతంగా వీచిన ఈదురు గాలులు రైతుల కష్టార్జిత పంటను క్షణాల్లో నేలమట్టం చేశాయి. పంట కోతకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో వచ్చిన ఈ విపత్తు రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఒక అంచనా ప్రకారం జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల టన్నుల మామిడికాయలు నేలరాలినట్లు సమాచారం. అధికారిక లెక్కలు ఇంకా పూర్తి కాలేదనే దృష్ట్యా ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని రైతు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరో నెల రోజుల్లో పక్వానికి రానున్న కాయలు ఈదురు గాలుల దెబ్బకు చెట్ల నుంచి నేలకూలిపోవడంతో సుమారు 10 శాతం పంట నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరయం కలిగింది.

నేలరాలిన మామిడికాయలను కొనుగోలు చేయడానికి వర్తకులు ముందుకు రావడం లేదు. బంగారుపాళెం మార్కెట్ యార్డులో మాత్రం కిలోకు రెండు రూపాయల చొప్పున కొంతమేర కొనుగోలు జరుగుతోంది. అయితే పెద్ద సైజు కాయలకే పరిమితం కావడంతో చిన్న కాయలు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. కూలీల ఖర్చు, రవాణా వ్యయం కూడా తిరిగి రాకపోవడంతో రైతులు కాయలను తోటల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం ధరలు లేకపోవడంతో ఇప్పటికే నష్టపోయిన రైతులు ఈ ఏడాది అయినా గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఆశించారు. గతంలో ఆరు లక్షల టన్నుల వరకు దిగుబడి వచ్చిన చోట ఈసారి నాలుగు లక్షల టన్నులకే పరిమితమవుతుందని అంచనా. దీంతో సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయని భావించిన రైతులకు ప్రకృతి భారీ దెబ్బతీసింది. పండ్లు పక్వానికి చేరకముందే నేలకూలిపోవడంతో పెట్టుబడులు పూర్తిగా వృథా అయ్యాయి. అకాల వర్షం, ఈదురు గాలుల ప్రభావం జిల్లాలోని అనేక మండలాల్లో తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా యాదమర్రి, గుడిపాల, రామకుప్పం, పెదపంజాని, పుత్తలపట్టు, బంగారుపాళెం మండలాల్లో గణనీయమైన వర్షపాతం నమోదవడంతో మామిడి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. తవణంపల్లె, వెంకటగిరికోట, కుప్పం, బైరెడ్డిపల్లె ప్రాంతాల్లో కూడా తోటలు నేలమట్టమయ్యాయి. మామిడి మాత్రమే కాకుండా అరటి, బీన్స్, కాకర, బీర, బొప్పాయి, గుమ్మడి వంటి పంటలు కూడా భారీగా నాశనం అయ్యాయి. మామిడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నేలరాలిన కాయలకు మార్కెట్ లేకపోవడం, ఉన్న చోట కూడా తక్కువ ధరలు ఉండడం రైతులను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. కిలోకు రెండు రూపాయల ధరతో కూలి, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మగ్గిపోతున్నారు.

*ఐరాల మండలంలో భారీ నష్టం*

ఐరాల మండలంలో పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఈ మండలంలో సుమారు 6 టన్నుల మామిడికాయలు నేలరాలినట్లు సమాచారం. 1200 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా, 700 మంది రైతులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇదే సమయంలో విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటం, స్తంభాలు కూలిపోవడంతో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు సుమారు 18 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఐరాల, చిన్నవెంకటపల్లి, మద్దిపట్లపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. రాత్రంతా చీకటిలో గ్రామాలు మగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నంకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

*విరిగిన విద్యుత్ స్తంభాలు* 

భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల కారణంగా 8 మీటర్ల విద్యుత్ స్తంభాలు 18, 9 మీటర్ల స్తంభాలు 20 దెబ్బతిన్నాయి. అదనంగా 15 ట్రాన్స్ఫార్మర్లు నష్టం చెందాయి. పలుచోట్ల విద్యుత్ లైన్లు తెగిపోవడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం వరకు నిరంతరం శ్రమించి సరఫరాను పునరుద్ధరించారు. ఉద్యానవన శాఖ అధికారులు నష్టం అంచనాల కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా, ఇప్పటివరకు పూర్తి లెక్కలు వెల్లడించలేదు. ప్రాథమికంగా కొన్ని ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు చెబుతున్నా, వాస్తవ పరిస్థితి మరింత తీవ్రమైందని రైతులు పేర్కొంటున్నారు. తోటలలో కాయలతో పాటు కొమ్మలు విరిగిపోవడం వల్ల వచ్చే సంవత్సరపు దిగుబడిపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*మామిడికి నష్టపరిహారం లేదు*

 ఒక పెద్ద సమస్య నష్టపరిహారం. అకాల వర్షం, ఈదురు గాలుల వల్ల జరిగిన నష్టానికి సాధారణంగా ప్రభుత్వ సహాయం లభించదని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు పంట నష్టం, మరోవైపు అప్పుల భారం రైతుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తోంది. జిల్లాలో రైతు నాయకులు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా మే నెలలో అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల మామిడి రైతులు నష్టపోతున్నారని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అయినా ప్రభుత్వం స్పందించి మామిడి, ఇతర ఉద్యాన పంటల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

*జిల్లా అంతటా వర్షం నమోదు*

చిత్తూరు జిల్లాలో మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే, అత్యధిక వర్షపాతం యాదమర్రి మండలంలో 53.2 మిల్లీమీటర్లు నమోదైంది. ఆ తర్వాత గుడిపాల మండలంలో 48.4 మిల్లీమీటర్లు, రామకుప్పం మండలంలో 42.2 మిల్లీమీటర్లు నమోదయ్యాయి. పెద్దపెంజాని మండలంలో 31.2 మిల్లీమీటర్లు, పూతలపట్టు మండలంలో 30.4 మిల్లీమీటర్లు, బంగారుపాళెం మండలంలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తవణంపల్లె మండలంలో 23.4 మిల్లీమీటర్లు, వెంకటగిరికోట మండలంలో 20.0 మిల్లీమీటర్లు, కుప్పం మండలంలో 19.6 మిల్లీమీటర్లు, బైరెడ్డిపల్లె మండలంలో 18.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. గంగవరం మండలంలో 16.4 మిల్లీమీటర్లు, పలమనేరు మండలంలో 15.4 మిల్లీమీటర్లు నమోదయ్యాయి. శాంతిపురం మండలంలో 10.4 మిల్లీమీటర్లు, పెనుమూరు మండలంలో 10.0 మిల్లీమీటర్లు కురిసాయి. గుడుపల్లె మండలంలో 6.4 మిల్లీమీటర్లు, గంగాధర నెల్లూరు మండలంలో 5.8 మిల్లీమీటర్లు, ఐరాల మండలంలో 5.4 మిల్లీమీటర్లు నమోదయ్యాయి. చిత్తూరు అర్బన్‌లో 3.0 మిల్లీమీటర్లు, పులిచెర్ల మండలంలో 1.6 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. ఇక రొంపిచర్ల, వెదురు కుప్పం, నింద్ర, విజయపురం, నగరి, కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, చిత్తూరు రూరల్, పాలసముద్రం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.మొత్తానికి, అకాల వర్షాలు, ఈదురు గాలులు చిత్తూరు జిల్లా మామిడి రైతులపై తీవ్ర ప్రభావం చూపించాయి. సంవత్సరాల కష్టం క్షణాల్లో నష్టమవుతుండగా, రైతులకు తక్షణ సాయం, సరైన మార్కెట్ వ్యవస్థ, కనీస మద్దతు ధర వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. లేకపోతే, మామిడి సాగు రైతులకు భారంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *