29, మే 2026, శుక్రవారం

తోతాపురి మామిడి ప్రారంభపు ధర రూ. 7.50


తోతాపురి మామిడి ప్రారంభపు ధర రూ. 7.50
జిల్లాలో తోతాపురి కొనుగోలు ప్రారంభం
డిమాండ్, సప్లై ఆధారంగా ధరలు పెరిగే అవకాశం
సోమవారం నుంచి అన్ని ఫ్యాక్టరీలు తోతాపూరి కొనుగోలుకు సిద్ధం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

 చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తోతాపురి మామిడి కొనుగోలు ధరపై రైతులు, మామిడి గుజ్జు పరిశ్రమలు, జిల్లా యంత్రాంగం మధ్య ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఈసారి ప్రారంభ ధర ఎంత ఉంటుందనే అంశంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా చర్చలు జరిపారు. తోతాపూరి రకం ప్రారంభపు ధరగా కిలోకు 7.50 రూపాయలు ఇవ్వడానికి ఫ్యాక్టరీ యజమానులు అంగీకారం తెలిపారు. భవిష్యత్తులో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రైతులు సోమవారం నుంచి ఫ్యాక్టరీలకు తోతాపురి మామిడికాయలను సరఫరా చేయవచ్చని తెలిపారు.

 చిత్తూరు జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగు జరుగుతోంది. ఇందులో ప్రధానంగా తోతాపురి రకం అధికంగా సాగవుతోంది. గత సంవత్సరం జిల్లాలో సుమారు 6.5 లక్షల టన్నుల మామిడి దిగుబడి నమోదైంది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కిలో మామిడికి రూ.12 మద్దతు ధర ప్రకటించింది. ఇందులో పరిశ్రమలు రూ.8 చెల్లించాలని, మిగిలిన రూ.4ను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైతులకు అందజేస్తుందని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా చాలా ఫ్యాక్టరీలు రైతులకు రూ.8 కూడా చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. చాలాచోట్ల రూ.4 నుంచి రూ.5 వరకు మాత్రమే రైతులకు చెల్లించారని, ఇంకా రెండు మూడు ఫ్యాక్టరీలు గత ఏడాది బిల్లులను కూడా పూర్తిగా చెల్లించలేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మామిడి దిగుబడి తగ్గే అవకాశముందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది 6.5 లక్షల టన్నుల దిగుబడి రాగా, ఈసారి నాలుగు నుంచి ఐదు లక్షల టన్నుల మధ్య మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూత దశలో వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు ప్రభావం చూపడంతో దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు.

జిల్లాలో మొత్తం 47 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉండగా ఇప్పటివరకు 14 పరిశ్రమలు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించాయి. మిగిలిన ఫ్యాక్టరీలు కూడా సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పూర్తిస్థాయిలో తోతాపురి దిగుబడి ప్రారంభం కాకపోవడంతో కొన్ని పరిశ్రమలు విజయవాడ ప్రాంతాల నుంచి మామిడికాయలను దిగుమతి చేసుకుంటున్నాయి. విజయవాడ ప్రాంతం నుంచి మామిడికాయలను రవాణా చేసి జిల్లాకు తీసుకురావడానికి కిలోకు సుమారు రూ.7 వ్యయం అవుతుందని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. అదే సమయంలో కడప జిల్లా కోడూరు ప్రాంతం నుంచి మామిడికాయలు కిలోకు సుమారు రూ.6కే జిల్లాకు చేరుతున్నాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలోని కొన్ని పరిశ్రమలు కోడూరు ప్రాంత మామిడికాయలతోనే ప్రాసెసింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన రైతుల మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ పరిశ్రమల యజమానులతో పలుమార్లు చర్చలు జరిపారు.

జిల్లా కలెక్టర్ వివరణ

ఈ విషయమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. విజయవాడ ప్రాంతం నుంచి కిలో మామిడి రూ.7కు వస్తోందని పరిశ్రమల యజమానులు వివరించారని చెప్పారు. అయినప్పటికీ చిత్తూరు జిల్లా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీసం రూ.9 చెల్లించాలని తాను పట్టుబట్టినట్లు పేర్కొన్నారు. అయితే పరిశ్రమల యాజమాన్యాలు డిమాండ్, సప్లై పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రారంభ దశలో రూ.7.50 చెల్లించేందుకు అంగీకరించాయని వెల్లడించారు. ప్రస్తుతం తవణంపల్లి మండలంలోని సిద్ధార్థ ఫ్యాక్టరీ కిలో రూ.7.50 చొప్పున తోతాపురి మామిడికాయలను కొనుగోలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో దిగుబడి, డిమాండ్ పరిస్థితులను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు మరింత గిట్టుబాటు ధర లభించేలా మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో మరోసారి సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

రఘురాం చౌదరి వివరణ

మామిడి కొనుగోలు ధరపై చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు ఫ్యాక్టరీల అసోసియేషన్ అధ్యక్షుడు, సిద్ధార్థ ఫ్యాక్టరీ ఎండీ రఘురాం చౌదరి స్పందిస్తూ తాము ఇప్పటికే జిల్లాకు చెందిన తోతాపురి మామిడికాయల కొనుగోలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌తో విస్తృత చర్చలు జరిగాయని చెప్పారు. కలెక్టర్ రూ.9 చెల్లించాలని కోరినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ధరకు కొనుగోలు చేస్తే పరిశ్రమలకు కోట్ల రూపాయల నష్టం వస్తుందని వివరించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రారంభ ధరగా రూ.7.50 ప్రకటించినట్లు రఘురాం చౌదరి వెల్లడించారు. ఈ నిర్ణయంతో తన ఫ్యాక్టరీకి కొన్ని లక్షల రూపాయల అదనపు భారం పడుతున్నప్పటికీ రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే ధర కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఇప్పటికే జిల్లాలో మామిడి సీజన్ ఊపందుకుంటుండగా రైతుల దృష్టి ఇప్పుడు పూర్తిగా ధరలపైనే కేంద్రీకృతమైంది. గత ఏడాది మద్దతు ధర ప్రకటన పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ఈసారి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పరిశ్రమలు ప్రకటించిన ధరలను పూర్తిగా రైతులకు చెల్లించేలా పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి జిల్లాలోని మిగిలిన మామిడి గుజ్జు పరిశ్రమలు కూడా కొనుగోళ్లు ప్రారంభించనున్న నేపథ్యంలో ధరలు మరింత పెరుగుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. డిమాండ్, సరఫరా పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో తోతాపురి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *