30, మే 2026, శనివారం

జిల్లాలో ఉద్యమంలా జల ధార జల హారతి కార్యక్రమం

జిల్లాలో ఉద్యమంలా జల ధార జల హారతి కార్యక్రమం
1,167 పనులకు పరిపాలనా అనుమతులు
 1,350 చెరువులకు 1,500 ఫీడర్ ఛానళ్లలో పనులు
చెరువుల తూములు, కట్టల బలోపేతం దిశగా చర్యలు
జిల్లాలో పెరుగుతున్న భూగర్భ జలాలు 
కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా 1,80 చెరువులను నీళ్లు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కాలువలు, జలవనరులను పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంపొందించడం, రైతులకు సాగునీటి భద్రత కల్పించడం, గ్రామీణ ఉపాధిని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. చెరువుల పూడికతీత నుంచి ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ వరకు విస్తృత స్థాయిలో పనులు చేపట్టడంతో జిల్లాలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుండగా, వేలాది మంది కూలీలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,371 పనులను గుర్తించగా, వాటిలో 1,167 పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి. ఇప్పటికే 49 పనులు పూర్తయ్యాయి. మరో 561 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయడానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు.

జిల్లాలోని 1,350 మైనర్ ఇరిగేషన్ చెరువులకు అనుసంధానంగా సుమారు 1,500 ఫీడర్ ఛానళ్లలో పనులు చేపట్టారు. పూడికతీత, అడవి మొక్కల తొలగింపు, కాలువల విస్తరణ, నీటి ప్రవాహ మార్గాల శుద్ధి వంటి చర్యల ద్వారా వర్షపు నీరు చెరువుల్లోకి సమర్థంగా చేరేలా చేస్తున్నారు. ఈ పనులు గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీజీ రామ్ జీ తదితర పథకాల సమన్వయంతో అమలవుతున్నాయి. చెరువుల స్లూయిస్‌లు, మిగులు నీటి వాగులు, కట్టల బలోపేతం వంటి పనులను కూడా గుర్తించారు. భారీ వర్షాల సమయంలో చెరువుల కట్టలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మౌలిక వసతుల మెరుగుదల ద్వారా భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. జలధార జలహారతి పనుల కారణంగా జిల్లాలో రోజూ సుమారు 20 వేల మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో వలసలు తగ్గడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తోంది. కాలువలలో మానవ శ్రమతో చేయలేని పనుల కోసం యంత్రాల వినియోగాన్ని కూడా అనుమతించారు. ప్రస్తుతం 127 ప్రాంతాల్లో యంత్రాలతో ప్రత్యేక పునరుద్ధరణ పనులు చేపట్టే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

అగ్రస్థానంలో పూతలపట్టు నియోజకవర్గం

పూతలపట్టు నియోజకవర్గంలో మొత్తం 204 పనులను గుర్తించగా, 167 పనులకు అనుమతులు లభించాయి. ప్రస్తుతం 101 పనులు పురోగతిలో ఉన్నాయి. 120 చెరువులకు అనుసంధానంగా 200 ఫీడర్ ఛానళ్లలో పనులు చేపడుతున్నారు. రోజూ సుమారు 1,700 మంది కూలీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదనంగా 51 ప్రాంతాల్లో యంత్రాల ద్వారా పునరుద్ధరణ పనులు చేపట్టే ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే గణనీయంగా అధికంగా నమోదైంది. జూన్ 2025 నుంచి ఇప్పటివరకు 1,030.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, సాధారణ వర్షపాతంతో పోలిస్తే 19.70 శాతం అధికంగా ఉంది. 27 మండలాల్లో 13 మండలాలు అధిక వర్షపాతం నమోదు చేయగా, మిగిలిన 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పూతలపట్టు నియోజకవర్గంలో 43.05 శాతం అధిక వర్షపాతం నమోదవగా, ఐదు మండలాలన్నింటిలోనూ అధిక వర్షాలు కురిశాయి. వర్షాలు అనుకూలంగా ఉండటంతో చెరువులు, కుంటలు, జలాశయాలు వేగంగా నిండుతున్నాయి.

పెరుగుతున్న భూగర్భ జలాలు

జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. గత ఏడాదితో పోలిస్తే సగటున 1.97 మీటర్ల మేర నీటి మట్టం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వలు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,106 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 12.988 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.994 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే 76.95 శాతం సామర్థ్యం మేర నీరు నిండింది. వాటిలో 1,362 చెరువులు పూర్తిగా నిండగా, 567 చెరువులు 75 శాతానికి పైగా, 443 చెరువులు 50 శాతానికి పైగా, 409 చెరువులు 25 శాతానికి పైగా నిండాయి. కేవలం 329 చెరువుల్లో మాత్రమే 25 శాతం కంటే తక్కువ నీరు ఉంది.

180 చెరువులకు కృష్ణ జలాలు 

కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా మొదట 110 చెరువులను నింపే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. అనంతరం సైఫన్ పైపుల వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా మరో 70 చెరువులను చేర్చడంతో లక్ష్య చెరువుల సంఖ్య 180కి పెరిగింది. ఇప్పటికే 131 చెరువులు పూర్తిగా నిండగా, 29 చెరువులు పాక్షికంగా నిండాయి. మరో 20 చెరువులను నింపేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దపంజాణి, రొంపిచెర్ల, బైరెడ్డిపల్లె, గంగవరం, కర్వేటినగరం, పులిచెర్ల, వెంకటగిరికోట, గుడిపాల, యాదమరి, పూతలపట్టు తదితర మండలాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. అనేక మండలాల్లో దశాబ్దాలుగా పూడికతో నిండిపోయిన కాలువలు మళ్లీ జీవం పొందుతున్నాయి.

నీటి భద్రతకు దీర్ఘకాలిక ప్రణాళిక

జలధార జలహారతి కార్యక్రమం కేవలం చెరువుల పునరుద్ధరణకే పరిమితం కాకుండా భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించే దీర్ఘకాలిక ప్రణాళికగా మారుతోంది. వర్షపు నీటిని గ్రామాల వద్దే నిల్వ చేయడం, భూగర్భ జలాలను పునరుత్తేజం చేయడం, సాగునీటి వనరులను బలోపేతం చేయడం, గ్రామీణ ఉపాధిని పెంపొందించడం వంటి బహుముఖ ప్రయోజనాలతో ఈ కార్యక్రమం జిల్లాలో ఒక జల విప్లవంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు కూడా చెరువులు నిండిపోవడం, బావుల్లో నీటి మట్టాలు పెరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెరువులు నిండితేనే వ్యవసాయం నిలదొక్కుకుంటుందని, గ్రామీణ జీవన విధానానికి నీరే ప్రాణమని మరోసారి చాటిచెబుతూ జలధార జలహారతి కార్యక్రమం చిత్తూరు జిల్లాలో నీటి సంరక్షణకు, రైతాంగ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *