26, మే 2026, మంగళవారం

చల్లబడ్డ చిత్తూరు జిల్లా - ఉపశమనం పొందిన ప్రజలు






చల్లబడ్డ చిత్తూరు జిల్లా - ఉపశమనం పొందిన ప్రజలు 

చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం

నిప్పుల కొలిమిని తలపించిన ఎండలు, వేడిగాలులు 

అల్లాడిపోయిన పిల్లలు, వృద్ధులు, రోగులు

వడగండ్ల వానతో మామిడి రైతులకు తీవ్ర నష్టం

(చిత్తూరు బ్యూరో ,ఆంధ్రప్రభ)

గత కొన్ని వారాలుగా నిప్పులు కక్కిన ఎండలతో అల్లాడిపోయిన చిత్తూరు జిల్లా ప్రజలకు మంగళవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షాలు భారీ ఊరటనిచ్చాయి. ఉదయం వరకు మండిపడిన ఎండలతో ఉక్కపోత అనుభవించిన ప్రజలు, సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఉపశమనం పొందారు. చిత్తూరు, పలమనేరు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కూడా పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది..గత పది రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగి మధ్యాహ్నం సమయానికి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయే పరిస్థితి నెలకొంది. వేడి గాలులతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కూలీ పనులకు వెళ్లే కార్మికులు మధ్యాహ్నం వేళ బయట నిలబడలేని పరిస్థితి ఎదుర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై బలమైన ఈదురు గాలులు వీచాయి. అనంతరం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 7 నుంచి 10 డిగ్రీల వరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. వేడి నుంచి ఉపశమనం లభించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చాలా రోజుల తర్వాత చల్లని గాలులు వీచడంతో ప్రజలు ఇళ్ల బయటకు వచ్చి వర్షాన్ని ఆస్వాదించారు. చిన్నారులు వర్షంలో తడుస్తూ సందడి చేయగా, పెద్దలు కూడా ఉపశమనంతో కనిపించారు. అయితే ఈ వర్షాలు కొంత నష్టాన్ని కూడా మిగిల్చాయి. చిత్తూరు నగరంతో పాటు పలమనేరు, గంగవరం, శాంతిపురం, రామకుప్పం, గుడిపాల, యాదమరి, సోమల తదితర మండలాల్లో ఈదురు గాలుల ధాటికి అనేక చెట్లు విరిగిపడ్డాయి. చిత్తూరు–పలమనేరు రహదారిపై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు నగరంలోని వేపమాను వీధిలో భారీ చెట్టు విరిగి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిత్తూరు ధర్మరాజుల వీధిలో విద్యుత్ వైర్లు తెగిపడటంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి దెబ్బతిన్న లైన్లను మరమ్మతు చేసి సరఫరాను పునరుద్ధరించారు. ప్రజలకు ఉపశమనం ఇచ్చిన ఈ వర్షాలు రైతులకు మాత్రం ఆందోళన మిగిల్చాయి. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట అయిన మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు ఈదురు గాలుల కారణంగా పెద్దఎత్తున నేలరాలాయి. పలమనేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, కుప్పం ప్రాంతాల్లో మామిడి తోటల్లో వేలాది కాయలు నేలకొరిగినట్లు రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల వడగండ్ల వాన కారణంగా కాయలు దెబ్బతిన్నాయి. చెట్ల కొమ్మలు విరగడంతో భవిష్యత్తు దిగుబడిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి తీవ్రత, మార్కెట్‌లో ధరల అనిశ్చితి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ అకాల వర్షాలు మరింత నష్టాన్ని మిగిల్చాయని వారు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరో రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *