చిత్తూరు కార్పొరేషన్‌పై మరోమారు టీడీపీ జెండా ఎగరేయడమే లక్ష్యం
చిత్తూరు కార్పొరేషన్‌పై మరోమారు టీడీపీ జెండా ఎగరేయడమే లక్ష్యం
నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ఫోకస్
అభివృద్ధి, సమన్వయం, సామాజిక సమీకరణతో ముందుకు అధికార పార్టీ
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాత్మక సన్నాహాలు
నేడే చిత్తూరు నియోజకవర్గ మహానాడు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని చిత్తూరు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ పటిష్ట వ్యూహంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు కార్పొరేషన్‌పై మరోమారు పార్టీ జెండా ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి బహుముఖ కార్యాచరణను అమలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ సమన్వయం, సామాజిక వర్గాల సమీకరణ, మిత్రపక్షాలతో అనుసంధానం, కార్యకర్తల చైతన్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్‌లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 50 డివిజన్లలో 47 స్థానాలను వైసీపీ అభ్యర్థులు గెలుచుకోగా, కేవలం మూడు స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ ఎన్నికల ఫలితాలతో చిత్తూరు కార్పొరేషన్‌పై వైసీపీ పూర్తి ఆధిపత్యం నెలకొంది. అయితే అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చిత్తూరు ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్ నాయుడు విజయం సాధించడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.
ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురజాల జగన్మోహన్ నాయుడు నియోజకవర్గంలో పార్టీని పునర్వ్యవస్థీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా వైసీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకోవడంలో ఆయన రాజకీయ చాతుర్యం ప్రదర్శించారు. చిత్తూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ఆముదతో పాటు వైస్ చైర్‌పర్సన్ ఆముద, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డితో సహా 25 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరడంతో కార్పొరేషన్‌లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. ఇదివరకు ఉన్న ముగ్గురు కార్పొరేటర్లతో కలిపి పార్టీ బలం 28కు చేరడంతో చిత్తూరు కార్పొరేషన్‌పై తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం నెలకొంది. వైసీపీ నుంచి భారీ సంఖ్యలో కార్పొరేటర్లు టీడీపీలో చేరినా పార్టీ సీనియర్ నాయకత్వం సమన్వయంతో ముందుకు సాగడంతో పెద్దగా విభేదాలు బయటపడలేదు. మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ, చూడ చైర్మన్ హేమలత, వన్నెకుల క్షత్రియ రాష్ట్ర నాయకుడు సీఆర్ రాజన్ తదితరులను కలుపుకుని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు పార్టీని సమన్వయంతో నడిపిస్తున్నారు. ఒకప్పుడు వర్గాలుగా కనిపించిన నాయకత్వం ప్రస్తుతం స్థానిక ఎన్నికల లక్ష్యంతో ఒకే వేదికపైకి రావడం పార్టీకి బలంగా మారింది. ఇదిలా ఉండగా అభివృద్ధినే ప్రధాన అజెండాగా తీసుకుని అధికార పార్టీ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అడవిపల్లె నుంచి చిత్తూరు కార్పొరేషన్‌కు కృష్ణా జలాలను తీసుకురావడానికి చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు పట్టణ ప్రజలకు దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో కూడా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే రోడ్ల విస్తరణ కార్యక్రమం చిత్తూరులో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. తనకు ఓట్ల కంటే రోడ్లే ముఖ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు బహిరంగంగానే ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు కొండారెడ్డిపల్లి, కట్టమంచి, గిరింపేట, పలమనేరు రోడ్ల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆక్రమణలను తొలగిస్తూ రోడ్లను వెడల్పు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రణాళిక అమలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. రోడ్ల విస్తరణ కారణంగా కొంత అసంతృప్తి వ్యక్తమైనా, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విశాల రహదారులు రూపుదిద్దుకోవడంతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో చిత్తూరు ఆధునిక నగరంగా అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. విద్య, వాణిజ్య రంగాల అభివృద్ధిపైనా అధికార పార్టీ దృష్టి పెట్టింది. చిత్తూరులో విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు కొనసాగుతుండగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభమైంది. పాత బస్టాండ్ ప్రాంతంలో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, వ్యాపార అవకాశాల విస్తరణ, విద్యాసంస్థల పెరుగుదల వంటి అంశాలు యువతకు ఉపాధి అవకాశాలను కూడా పెంచనున్నాయని భావిస్తున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. ప్రతి డివిజన్‌లో బలమైన అభ్యర్థుల ఎంపిక, అసంతృప్త వర్గాల సమన్వయం, బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, మహిళా మరియు యువజన విభాగాల చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి డివిజన్‌లో స్థానిక పరిస్థితులను అంచనా వేసి ప్రత్యేక ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో సమన్వయం పెంచుకుంటూ కూటమి బలాన్ని స్థానిక ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని అధికార పార్టీ వ్యూహం రచిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి పనులు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ వంటి అంశాలను ఎన్నికల ప్రధాన అజెండాగా తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ముందుకు సాగుతున్న తీరు చిత్తూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసి చిత్తూరు కార్పొరేషన్‌పై మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని అధికార పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.

