10, మే 2026, ఆదివారం

చిత్తూరు మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి


ప్రతి శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో గ్రీవెన్స్ డే

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పనితీరుకు సీఎం ప్రశంసలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)


ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తూరు జిల్లా అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండవ రోజు సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కార విధానంపై సమీక్ష నిర్వహించిన సీఎం, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక విధానాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తూనే, నెలలో మిగిలిన మూడు సోమవారాల్లో మండల కేంద్రాలకు వెళ్లి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్తున్న విధానాన్ని సీఎం కొనియాడారు. ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావడం అభినందనీయమన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అమలు చేస్తున్న ఈ విధానం వల్ల గ్రామీణ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని సీఎం పేర్కొన్నారు. గంగాధర్ నెల్లూరు, వెదురుకుప్పం, నిండ్ర వంటి మండలాల్లో కలెక్టర్ స్వయంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు విశేష స్పందన రావడం ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందన్నారు. చిత్తూరు జిల్లా మోడల్‌ను రాష్ట్రంలోని మిగతా జిల్లాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి సమస్యలు వినడం, అక్కడికక్కడే పరిష్కారం చూపించడం మంచి పరిపాలనకు నిదర్శనం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో ఫీల్డ్ గ్రీవెన్స్ డే నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించి వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఎంపీడీవో కార్యాలయాల్లోనే అనేక సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజలు చిత్తూరు వరకు రావాల్సిన అవసరం తగ్గిందని వివరించారు. నాలుగు వారాలకే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించామని, క్షేత్రస్థాయి అధికారులు కూడా సమస్యల పరిష్కారంపై మరింత బాధ్యతతో స్పందిస్తున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో అమలవుతున్న ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. సీఎం చంద్రబాబు స్వయంగా చిత్తూరు జిల్లా పనితీరును ప్రశంసించడం జిల్లా అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అధికారులు భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *