4, మే 2026, సోమవారం

చిత్తూరు జిల్లాలో నిశ్శబ్ద సౌర విప్లవం…

 
చిత్తూరులో ఇళ్లపై సూర్యశక్తి వెలుగులు
స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రజలు 
జోరుగా కొనసాగుతున్న పీఎం సూర్యా ఘర్ పనులు
ప్రత్యేక దృష్టిని సారిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 


 (ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చిత్తూరు జిల్లాలో ఒక నిశ్శబ్ద సౌర విప్లవం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా ఈ కార్యక్రమంలో ముందంజలో నిలుస్తోంది. ప్రచారం పెద్దగా లేకపోయినా… ప్రజలకు లభిస్తున్న ప్రయోజనాలు ఈ పథకాన్ని గ్రామాల నుంచి పట్టణాల దాకా చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. ఈ పథకమాముల కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లను పరిశీలించి అధికారులు అనువైన ఇళ్లను ఎంపిక చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ట్రాన్స్కో ఎస్సీ అమర్ బాబు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

జిల్లాలో విద్యుత్ వినియోగం రోజు రోజుకీ పెరుగుతుండటంతో పాటు వేసవికాలంలో కరెంట్ డిమాండ్ గణనీయంగా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకొని ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన లక్ష్యాల మేరకు జిల్లాకు కేటాయించిన టార్గెట్లను సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి మండలానికి, ప్రతి సబ్‌స్టేషన్ పరిధికి ప్రత్యేక లక్ష్యాలు కేటాయించి వాటిని సమయానికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈ పథకం వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్న గ్రామాల్లో నివసించే కుటుంబాలు దీన్ని శాశ్వత పరిష్కారంగా భావిస్తున్నాయి. పలమనేరు, మదనపల్లె, పుత్తూరు, నగరి, చిత్తూరు నగర ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్ల ఏర్పాటు కోసం ప్రజలు ముందుకు వస్తుండటం విశేషం. అధికారులు గ్రామ సభలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు ఈ పథకం ప్రయోజనాలను వివరించడంతో స్పందన మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు ఈ సంవత్సరం 18,456 లక్ష్యంగా కేటాయించింది. ఇప్పటివరకు 900 కనెక్షన్లు పూర్తయ్యాయి. 2000 కనెక్షన్లకు సరిపడ మెటీరియల్ జిల్లాకు సరఫరా అయింది. లక్ష్యాలను సాధించడానికి ట్రాన్స్కో అధికారులు కృషి చేస్తున్నారు.

ఈ పథకం ద్వారా గృహాల పైకప్పులపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించే అవకాశం ఉంది. ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబ అవసరాలకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ బిల్లు దాదాపు జీరో అయ్యే అవకాశముంది. అంతేకాకుండా వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్తును డిస్కంలకు అమ్ముకునే అవకాశం కూడా ఉండటంతో అదనపు ఆదాయం పొందే వీలుంది. ఈ విధంగా ఒకే సమయంలో ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం పొందే అవకాశం ఉండటం ప్రజలను ఆకర్షిస్తోంది. సోలార్ ప్యానెల్ల ఏర్పాటు కోసం కొంతమేర పెట్టుబడి అవసరం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వల్ల ఆ భారం గణనీయంగా తగ్గుతోంది. 1 కిలోవాట్ సామర్థ్యానికి రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువకు గరిష్టంగా రూ.78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం 1 కిలోవాట్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు ఖర్చు సుమారు రూ.55,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుంది. ఈ లెక్కన 3 కిలోవాట్ల సిస్టమ్‌కు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, సబ్సిడీ తీసిన తర్వాత అది సుమారు రూ.1.20 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా పొందే అవకాశం కూడా ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలకు ఇది అందుబాటులోకి వస్తోంది. అధికారుల అంచనా ప్రకారం ఈ పెట్టుబడి ఐదు సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ లభించే అవకాశముంది. దీని వల్ల నెలకు సగటున రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇది కుటుంబ ఆర్థిక స్థితిపై మంచి ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.

పథకానికి అర్హతల విషయానికి వస్తే, గృహ వినియోగదారులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసేందుకు తగిన స్థలం ఉండాలి. సాధారణంగా 1 కిలోవాట్‌కు సుమారు 100 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండటం తప్పనిసరి. భారతీయ పౌరులే ఈ పథకానికి అర్హులు. ఇప్పటికే ఇతర సబ్సిడీలు పొందని వారికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రభుత్వం చాలా సులభతరం చేసింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, అవసరమైన వివరాలు నమోదు చేసి, విద్యుత్ కన్స్యూమర్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత అవసరమైన సామర్థ్యాన్ని ఎంచుకొని రిజిస్టర్డ్ వెండర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ పూర్తైన తర్వాత సబ్సిడీ నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తూ దరఖాస్తు ప్రక్రియలో సహాయం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఒకే చోట దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రచారం తక్కువగా ఉన్నప్పటికీ అమలు మాత్రం వేగంగా సాగుతున్న ఈ పథకం చిత్తూరు జిల్లాలో విద్యుత్ రంగంలో కొత్త దిశను చూపిస్తోంది. సౌరశక్తి వినియోగం పెరగడం వల్ల పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతోంది. భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకునే దిశగా ఈ పథకం కీలక పాత్ర పోషించనుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటే విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *