17, మే 2026, ఆదివారం

ఖాకీలే ఖతర్నాక్ ముఠా..!

ఖాకీలే ఖతర్నాక్ ముఠా..!

ఫేక్ రైడ్‌తో రూ.10 లక్షలు దోచేసిన ఏఎస్ఐ, కానిస్టేబుల్

దొంగనోట్ల పేరుతో తమిళనాడు వ్యాపారులకు భారీ మోసం

గంగాధర నెల్లూరులో బట్టబయలైన పోలీసుల అక్రమాలు

పోలీసుల అదుపులో ఇద్దరు పోలీసులు, ఇద్దరు రౌడీ షీటర్లు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కలకలం.. పోలీసు శాఖలో తీవ్ర చర్చ

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే నేరస్తులతో చేతులు కలిపి దోపిడీకి పాల్పడిన సంచలన ఘటన చిత్తూరు జిల్లాను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దొంగనోట్ల మార్పిడి పేరుతో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారులను గంగాధర నెల్లూరుకు రప్పించి, చివరకు పోలీసులమంటూ ఫేక్ రైడ్ నిర్వహించి రూ.10 లక్షల అసలు నగదును కాజేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో చిత్తూరు ట్రాఫిక్ విభాగానికి చెందిన ఏఎస్ఐ లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవి ప్రత్యక్ష ప్రమేయం బయటపడటంతో పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేగింది. గంగాధర నెల్లూరు మండలంలోని బట్టుకండిగ డంపింగ్ యార్డు వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఈ వ్యవహారం మొదట సాధారణ మోసం అనుకున్న పోలీసులు, విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చిన నిజాలతో షాక్‌కు గురయ్యారు. దొంగనోట్ల ముఠాతో కలిసి ఇద్దరు పోలీసులే పక్కా స్కెచ్ వేసి దోపిడీకి పాల్పడినట్లు తేలడంతో జిల్లా వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. గంగాధర నెల్లూరు మండలంలోని మిట్ట వేల్కూరు గ్రామానికి చెందిన రౌడీషీటర్ సెల్వం, లక్ష్మణ్ కుమార్ అలియాస్ దేవా, తమిళనాడులోని వేలూరుకు చెందిన ఇళంగోవన్ కలిసి దొంగనోట్ల దందా పేరుతో ముఠాగా ఏర్పడ్డారు. వీరితో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐ లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవి చేతులు కలిపినట్లు విచారణలో బయటపడింది. ఈ ముఠా తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మంజునాథ్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులను టార్గెట్ చేసింది. రూ.10 లక్షల అసలు నగదు ఇస్తే.. దానికి బదులుగా రూ.1 కోటి విలువైన దొంగనోట్లు ఇస్తాం అంటూ వారిని నమ్మించింది. భారీ లాభం వస్తుందని ఆశపడ్డ బాధితులు ఒప్పందానికి సిద్ధమయ్యారు. నిర్ణయించిన ప్రకారం శనివారం సాయంత్రం రూ.10 లక్షల నగదుతో గంగాధర నెల్లూరు మండలంలోని బట్టుకండిగ డంపింగ్ యార్డు వద్దకు చేరుకున్నారు. అక్కడ సెల్వం, దేవా, ఇళంగోవన్ బాధితులతో డీల్ మాట్లాడుతుండగా ముందుగానే రచించిన పథకం ప్రకారం ఏఎస్ఐ లోకనాథం, హెడ్ కానిస్టేబుల్ రవి ఖాకీ యూనిఫాంలో అక్కడికి చేరుకున్నారు. దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారా.. మీపై కేసులు పెడతాం అంటూ హడావుడి సృష్టించారు. పోలీసులు వచ్చారనే భయంతో తమిళనాడు వ్యాపారులు తెచ్చిన నగదును అక్కడే వదిలేసి ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు.

అయితే అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఫేక్ రైడ్ నిర్వహించిన వారు నిజంగానే పోలీసులు అయినప్పటికీ.. వారు విధి నిర్వహణ కోసం రాలేదు. ముందుగానే సెల్వంతో కలిసి డబ్బులు దోచుకునేందుకు స్కెచ్ వేసిన ముఠా సభ్యులేనని తేలింది. బాధితులు వెళ్లిపోయిన తర్వాత ముఠా సభ్యులు డబ్బులు పంచుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తమ వద్ద నుంచి రూ.10 లక్షలు దోచుకెళ్లారని మంజునాథ్, విజయ్ జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సీఐ ప్రసాద్ వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఫోన్ కాల్స్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేశారు. సెల్వం మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బట్టుకండిగ సమీపంలోని మామిడి తోట వద్ద ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డబ్బులు పంచుకుంటున్న సెల్వం, ఏఎస్ఐ లోకనాథం, హెడ్ కానిస్టేబుల్ రవితో పాటు ఇతరులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఖాకీల అసలు బండారం బయటపడింది. ఈ కేసులో సెల్వం ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. అతనిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు సమాచారం. అరెస్టు చేసిన వారిలో సెల్వం, దేవా, ఇళంగోవన్‌తో పాటు ఏఎస్ఐ లోకనాథం, హెడ్ కానిస్టేబుల్ రవి ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు  సీఐ ప్రసాద్ తెలిపారు. అయితే విశ్వసనీయంగా నిల సమాచారం మేరకు ఇద్దరు పోలీసులను మరో ఇద్దరు రౌడీ షీటర్ లను గంగాధర నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఈ ఘటనతో పోలీసు శాఖలో తీవ్ర కలకలం నెలకొంది. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే నేరాలకు పాల్పడటం, ఖాకీ యూనిఫాం వేసుకుని ఫేక్ రైడ్ నిర్వహించడం జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ప్రజల్లో పోలీసులపై ఉన్న నమ్మకానికి ఈ ఘటన భారీ దెబ్బగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దొంగనోట్ల ముఠాలతో పోలీసులకు ఇంకా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? గతంలో కూడా ఇలాంటి అక్రమాల్లో ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వెనుక మరికొందరు ఉన్నారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగలతో చేతులు కలపడం దారుణం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజల భద్రత కోసం ఉన్న ఖాకీలు అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఎవరిని నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసు ప్రస్తుతం పోలీసు శాఖలోనే కాకుండా రాజకీయ, సామాజిక వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *