15, మే 2026, శుక్రవారం

రాష్ట్రంలో 258 గ్రామాలలో బోర్ల తవ్వకంపై నిషేధం

రాష్ట్రంలో 258  గ్రామాలలో బోర్ల తవ్వకంపై నిషేధం
ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ గ్రామాలుగా ప్రకటించిన ప్రభుత్వం


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన జి.ఓ.ఎంఎస్ నెం.70 ప్రకారం రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఉన్న 258 గ్రామాలను ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్ గా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ చట్టం–2002  ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. భూగర్భ జలాల అధిక వినియోగం కారణంగా భవిష్యత్తులో తీవ్రమైన నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్న గ్రామాలను గుర్తించి ఈ జాబితాలో చేర్చారు. రాష్ట్ర స్థాయి కమిటీ  మరియు కేంద్ర స్థాయి నిపుణుల బృందం నివేదికల ఆధారంగా ఈ గ్రామాలను గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. తాడేపల్లి, గుంటూరులోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఆ గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగంపై కఠిన నియంత్రణలు అమల్లోకి వస్తాయి. ముఖ్యంగా కొత్త బోర్‌వెల్లు త్రవ్వడం, అధికంగా నీటిని వినియోగించే వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం వంటి అంశాలపై ఆంక్షలు ఉంటాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆ గ్రామాల్లో ఇకపై తాగునీటి అవసరాల కోసం మాత్రమే కొత్త బావులు లేదా బోర్‌వెల్లు అనుమతించబడతాయి. ప్రజల తాగునీటి అవసరాల కోసం చేతి పంపులు లేదా ప్రైవేట్ తాగునీటి అవసరాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అదేవిధంగా, ఆ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై కూడా నిషేధం విధించారు. భూగర్భ జలాల నిల్వలు మరింత దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ శాఖ గుర్తించిన గ్రామాల జాబితా ఈ ఉత్తర్వులకు అనుబంధంగా జత చేశారు. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రత్యేక సంచికలో ప్రచురించారు. ఈ ఉత్తర్వులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ జారీ చేశారు. పంచాయతీరాజ్, నీటివనరులు, రెవెన్యూ, మైన్స్, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్లు తదితర శాఖలకు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ప్రతులను పంపింది. రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం క్రమంగా పడిపోతుండటం, వర్షాభావ పరిస్థితులు, అధిక బోర్‌వెల్ల వినియోగం కారణంగా ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో నీటి వనరులను సంరక్షించేందుకు ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *