18, మే 2026, సోమవారం

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఎండిపోతున్న చిత్తూరు నేల

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఎండిపోతున్న చిత్తూరు నేల

ఐదేళ్లుగా వర్షాల వింత ధోరణి.. 

కుదేలవుతున్న వేరుశనగ రైతాంగం

 329 చెరువులు పూర్తిగా ఎండిపోయిన దుస్థితి

జలధార కార్యక్రమంపైనే రైతుల ఆశలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

రాయలసీమలో వ్యవసాయానికి గుండెకాయగా నిలిచిన చిత్తూరు జిల్లా ప్రస్తుతం తీవ్ర వాతావరణ మార్పుల ప్రభావంతో అల్లాడుతోంది. ఎల్‌నినో ప్రభావం, అస్థిర వర్షపాతం, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా వర్షాధార పంటగా పేరుగాంచిన వేరుశనగ సాగు గత ఐదారు సంవత్సరాలుగా వరుసగా దెబ్బతింటూ రావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక సంవత్సరం అధిక వర్షాలు కురిసి పంటలు మునిగిపోతే, మరొక సంవత్సరం పూర్తిగా వర్షాభావం నెలకొని పంటలు ఎండిపోతున్నాయి. ఈ అస్థిర వాతావరణ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో వేరుశనగ పంట విస్తారంగా వేస్తారు. గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలో వేరుశనగ పంట దైవాధీనంగా మారింది. ఏ సంవత్సరం పూర్తిస్థాయిలో వేరుశనగ పంట చేతికి రాలేదు. ఒక సంవత్సరం వర్షాభావ పరిస్థితుల్లో కారణంగా వేరుశనగ దెబ్బతింటే, మరో సంవత్సరం అధిక వర్షాల కారణంగా పాడవుతోంది.

చిత్తూరు జిల్లా సాధారణ వార్షిక వర్షపాతం దాదాపు 900 మిల్లీమీటర్లు. జిల్లాలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాలు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే ఈశాన్య రుతుపవనాలపై వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ రెండు రుతుపవనాల ప్రభావం అసమానంగా మారింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితంగా వర్షాలు ఆలస్యంగా రావడం, మధ్యలో నిలిచిపోవడం లేదా ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం జరుగుతోంది. గత ఐదేళ్ల వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే జిల్లాలో వాతావరణ అస్థిరత ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది. 2021 సంవత్సరంలో సాధారణం కంటే అధికంగా దాదాపు 1,020 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో వరదల పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. 2022లో వర్షపాతం తగ్గి సుమారు 780 మిల్లీమీటర్లకే పరిమితమైంది. 2023లో పరిస్థితి మరింత దారుణంగా మారి కేవలం 690 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అనావృష్టి తీవ్రంగా ప్రభావం చూపింది. 2024లో మళ్లీ అధిక వర్షాలు కురిసి దాదాపు 1,140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు పొంగిపొర్లినా, కొన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. 2025లో తిరిగి వర్షాభావం నెలకొని కేవలం 610 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ పరిస్థితుల వల్ల రైతులు ఏ పంట వేయాలో, ఎప్పుడు సాగు ప్రారంభించాలో అర్థంకాక అయోమయంలో పడుతున్నారు.

ముఖ్యంగా గత సంవత్సరం రైతులకు మరచిపోలేని కష్టకాలంగా మారింది. సకాలంలో వర్షాలు పడకపోవడంతో జిల్లాలో 10 శాతం కూడా వేరుశనగ సాగు జరగలేదని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. చాలామంది రైతులు విత్తనాలు కొనుగోలు చేసి పొలాలు సిద్ధం చేసుకున్నప్పటికీ వర్షాలు కురవక సాగును వాయిదా వేసుకున్నారు. కొందరు ధైర్యం చేసి విత్తనాలు వేసినా మొలక వచ్చిన తర్వాత వర్షాలు ఆగిపోవడంతో పంటలు ఎండిపోయాయి. వేరుశనగ పంట పూర్తిగా వర్షాలపైనే ఆధారపడటం వల్ల రైతులు భారీ నష్టాలను చవిచూశారు. పలమనేరు, కుప్పం, గుడుపల్లె, బైరెడ్డిపల్లె, గంగవరం, సోమల, రామకుప్పం, పుంగనూరు వంటి మెట్ట మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. బోర్లు ఎండిపోవడం, చెరువులు నీరు లేక బీటలు వారడం రైతుల్లో ఆందోళన పెంచుతోంది.

ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచార వ్యవస్థ గణాంకాల ప్రకారం చిత్తూరు జిల్లాలో మొత్తం 3,106 చిన్న నీటి పారుదల చెరువులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 1,358 చెరువులు మాత్రమే పూర్తిస్థాయిలో నిండాయి. మరో 567 చెరువుల్లో 75 శాతం వరకు నీరు ఉంది. 443 చెరువుల్లో సగం మేర మాత్రమే నీటి నిల్వ ఉంది. 409 చెరువుల్లో కేవలం పావుభాగం మాత్రమే నీరు మిగిలి ఉంది. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే 329 చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ముఖ్యంగా పలమనేరు, కుప్పం ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. గత ఏడాది కొంతమేర వర్షాలు కురిసినా చెరువులకు నీరు చేరాల్సిన కాలువలు, వాగులు, ఫీడర్ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల దాదాపు 1,200 చెరువులకు 70 శాతం కంటే తక్కువ నీరే చేరిందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు కూడా రీచార్జ్ కాలేకపోయాయి. చెరువులు నిండకపోవడంతో రైతులు సాగునీటి కోసం పూర్తిగా బోర్లపై ఆధారపడాల్సి వస్తోంది.

జిల్లాలో ప్రధాన వర్షాధార పంట వేరుశనగ. వేలాది రైతుల జీవనాధారం ఈ పంటపైనే ఆధారపడి ఉంది. కానీ గత ఐదేళ్లుగా వాతావరణ అస్థిరత కారణంగా వేరుశనగ రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. అధిక వర్షాలు వచ్చినప్పుడు పంట కుళ్లిపోతుండగా, వర్షాభావం వచ్చినప్పుడు మొక్కలు ఎండిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులు, కూలీలకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. కొందరు రైతులు పంటను పశువుల మేతకు వదిలేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం జలధార పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం నిధులతో చెరువుల పూడికతీత, నీరు వచ్చే కాలువల శుభ్రపరిచే పనులు వేగంగా చేపడుతున్నారు. రాబోయే వర్షాకాలానికి ముందే చెరువుల నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చెరువులు పూర్తిస్థాయిలో నిండితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయానికి కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.

వ్యవసాయ నిపుణులు మాత్రం ఇకపై వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, సూక్ష్మ నీటిపారుదల విధానాలు, వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ వంటి చర్యలు అత్యవసరమని చెబుతున్నారు. లేకపోతే ఎల్‌నినో ప్రభావం రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మారి రైతాంగాన్ని ఇంకా కష్టాల్లోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తోంది. ఈ ఏడాది అయినా సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నిండాలని, వేరుశనగ పంటలు పండాలని రైతులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *