సంజీవిని ప్రాజెక్ట్‌తో వైద్య రంగంలో డిజిటల్ విప్లవం
సంజీవిని ప్రాజెక్ట్‌తో వైద్య రంగంలో డిజిటల్ విప్లవం
గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే నిపుణ వైద్య సేవలు
టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు
నేడు జిల్లా అంతటా లాంచనంగా ప్రారంభించనున్న సీఎం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్న సంజీవిని టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రాజెక్ట్ కుప్పం నియోజకవర్గంలో వైద్య రంగానికి కొత్త దిశను చూపిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఆరోగ్య సేవలకు అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సమగ్ర వైద్య సేవలను అందించేందుకు ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు కుప్పం నియోజకవర్గంలో విజయవంతమైంది. దీంతో శనివారం జిల్లా వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును యాదమరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంచనంగా ప్రారంభించనున్నారు. అలాగే వచ్చే సంవత్సరం ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల వైద్య శాఖ అధికారులు, ఇతర వైద్యాధికారులకు ఇటీవల చిత్తూరు జిల్లాలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంజీవని ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది అనే విషయం అధికారులు వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 2024 నవంబరులో టాటా గ్రూప్ చైర్మన్‌తో సమావేశమై రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులపై చర్చించారు. అనంతరం 2025 జనవరి 7న చిత్తూరు జిల్లా ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఈ డిజిటల్ నర్వ్ సెంటర్ నమూనాను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, 3.3 లక్షల జనాభా పరిధిలో ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అమలవుతోంది. 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక ఏరియా ఆసుపత్రి, 92 ఆరోగ్య ఉప కేంద్రాలను డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక డిజిటల్ నర్వ్ సెంటర్ అరేనాలను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి వైద్య సేవలను సమన్వయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ప్రజలు వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. 40 శాతం మంది రోగులు కనీసం 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి వైద్యం పొందాల్సి వచ్చేదని నివేదిక వెల్లడించింది. మరోవైపు 15 శాతం మంది అర్హతలేని వైద్యులను ఆశ్రయించేవారని పేర్కొన్నారు. డాక్టర్ల అందుబాటు, రోగి వివరాల లేమి, ఫాలోఅప్ లోపాలు, పరీక్షల పునరావృతం వంటి సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా టాటా సంస్థ డిజిటల్ నర్వ్ సెంటర్ వ్యవస్థను రూపొందించింది. ఈ ప్రాజెక్ట్‌లో అన్ని ఆరోగ్య కేంద్రాలు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తాయి. రోగి ఆరోగ్య చరిత్ర, పరీక్షల నివేదికలు, మందుల వివరాలు, ఫాలోఅప్ షెడ్యూల్ అన్నీ డిజిటల్ రికార్డుల రూపంలో భద్రపరుస్తారు. రోగి ఎక్కడ చికిత్స పొందినా వైద్యులు ఆ వివరాలను వెంటనే పరిశీలించి సరైన వైద్యం అందించగలుగుతారు.
కుప్పంలో ఏర్పాటు చేసిన తొలి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న సేవలను పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. ప్రత్యేక వైద్య సేవలను కూడా ప్రారంభించారు. సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 12 రకాల సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీల సంరక్షణ, ప్రసూతి సేవలు, శిశు ఆరోగ్యం, బాలల ఆరోగ్యం, యువత ఆరోగ్య సేవలు, అంటు వ్యాధుల నియంత్రణ, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధుల పర్యవేక్షణ, మానసిక ఆరోగ్య సేవలు, వృద్ధుల సంరక్షణ, అత్యవసర వైద్య సేవలు, కంటి, చెవి, ముక్కు సంబంధిత సమస్యల చికిత్స వంటి సేవలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో టెలీ మెడిసిన్ సేవలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. కుప్పం డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిల్లల వైద్యం, సైకాలజీ, ఆడియాలజీ, ఎండోక్రినాలజీ వంటి విభాగాల్లో నిపుణ వైద్యులతో వీడియో కాల్ ద్వారా సంప్రదింపులు అందిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు ప్రజల సమయం, ఖర్చు కూడా ఆదా అవుతోంది. సంజీవిని ప్రాజెక్ట్‌లో కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలను కూడా ప్రవేశపెట్టారు. డాక్టర్ రోగి సంభాషణలను విశ్లేషించి క్లినికల్ నోట్స్ తయారు చేసే అంబియంట్ లిసనింగ్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 6 వేలకుపైగా సంప్రదింపులు ఈ విధానంలో పూర్తయ్యాయి. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కేర్ ప్లానోగ్రామ్, ట్రూ వెల్‌నెస్ మీటర్ వ్యవస్థలను అభివృద్ధి చేశారు. 30 వేల మంది రోగుల డేటా విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ విధానం ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సూచనలు ఇవ్వనున్నారు. ప్రజల కోసం ప్రత్యేకంగా సంజీవిని సిటిజన్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో అపాయింట్‌మెంట్ బుకింగ్, ఆరోగ్య రికార్డులు, కుటుంబ ఆరోగ్య నిర్వహణ, వాయిస్ ఆధారిత వైద్య ప్రశ్నలు, డిజిటల్ కన్సల్టేషన్ వంటి సేవలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ యాప్‌ను కుప్పం ప్రజలు వినియోగిస్తున్నారు.
కుప్పంలో విజయవంతంగా అమలవుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు మొత్తం చిత్తూరు జిల్లాకు విస్తరించారు. జిల్లాలోని 628 గ్రామ ఆరోగ్య కేంద్రాలు, 65 ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రిని ఈ డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తున్నారు. సుమారు 21 లక్షల మంది ప్రజలకు ఈ సేవలు అందనున్నాయి. మానవ వనరుల ఎంపిక, శిక్షణ, ఐటీ మౌలిక వసతుల అభివృద్ధి, కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ వంటి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నారావారిపల్లెలో కూడా ఈ సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. 2027 నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ డిజిటల్ నర్వ్ సెంటర్ మోడల్‌ను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రజలకు తక్కువ ఖర్చుతో, వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో సంజీవిని ప్రాజెక్ట్ కీలక మలుపుగా నిలుస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

