31, జనవరి 2026, శనివారం

చిత్తూరు జిల్లాలో పరిశ్రమ అభివృద్ధి జోరు

జిల్లాలో మొత్తం 9,861 పరిశ్రమలు కార్యకలాపాలు
173 మెగా ప్రాజెక్టులు, 9,688 ఎంఎస్ఎంఈ యూనిట్లు
వీటి ద్వారా సుమారు రూ.30,843 కోట్ల పెట్టుబడులు
దాదాపు 19,600 మందికి ప్రత్యక్ష ఉపాధి 
గ్రామీణ శక్తి, పరిశ్రమలు కలిసి సరికొత్త ఆర్థిక వెలుగు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

 చిత్తూరు జిల్లా మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి ఒక సానుకూల దిశలో కదులుతోంది. సంప్రదాయ వృత్తులు, గ్రామీణ నైపుణ్యాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విస్తరణ కలిసి జిల్లాను స్థిరమైన పారిశ్రామిక కేంద్రంగా మలుస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత వనరులను పరిశ్రమలతో అనుసంధానం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులు విస్తరిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 9,861 పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, వాటిలో 173 మెగా ప్రాజెక్టులు, 9,688 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల ద్వారా సుమారు రూ.30,843 కోట్ల పెట్టుబడులు సమకూరగా, దాదాపు 19,600 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. పరోక్షంగా మరింత మంది జీవనోపాధి పొందుతున్నారు. చిన్న పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ స్థానిక ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగం జిల్లాలో ముందంజలో ఉంది. మామిడి, టమాటా, చింతపండు వంటి పంటలను పల్ప్, పికిల్స్, డ్రై ప్రోడక్ట్స్‌గా మార్చే యూనిట్లు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నాయి. గ్రానైట్ ప్రాసెసింగ్, బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ, టెక్స్టైల్స్, అగ్రో-బేస్డ్ యూనిట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. ప్రింటింగ్, ఆటోమొబైల్ సర్వీసులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఫార్మా వంటి విభాగాలు జిల్లా పరిశ్రమలకు వైవిధ్యం తెచ్చాయి. పెద్ద పరిశ్రమల పరంగా ఆటోమొబైల్ భాగాలు, ఇంజినీరింగ్ యూనిట్లు, ప్లాస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ ప్యానెల్ తయారీ, ప్యాకేజింగ్ యూనిట్లు స్థిరపడ్డాయి. ఇవి ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా అనుబంధ చిన్న పరిశ్రమలకు కూడా డిమాండ్ సృష్టిస్తున్నాయి. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించడం వల్ల వలసలు తగ్గుతున్నాయి. గ్రానైట్ కటింగ్, ఫ్రూట్ ప్రాసెసింగ్, చింతపండు ప్రాసెసింగ్, హ్యాండ్‌లూమ్స్, సిల్క్ రీలింగ్, ఆటోమొబైల్ బాడీ బిల్డింగ్ వంటి రంగాలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. నగరి, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు గ్రామీణ కుటుంబాలకు ఆదాయ వనరులుగా మారాయి.

హస్తకళల రంగంలో మెటల్ క్రాఫ్ట్స్, టెర్రాకోటా, అప్లిక్ ఎంబ్రాయిడరీ, జరీ-జర్దోసీ వంటి కళలు గ్రామీణ మహిళలకు ఉపాధి మార్గంగా నిలుస్తున్నాయి. ఈ కళల ఉత్పత్తులు స్థానిక మార్కెట్లతో పాటు ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయి. వ్యవసాయ రంగం పరిశ్రమలకు బలమైన మద్దతు ఇస్తోంది. మామిడి, టమాటా, చింతపండు, మిరప, బంగాళదుంప, అరటి, పూల పంటలు విస్తృతంగా పండుతున్నాయి. ఈ పంటలు ప్రాసెసింగ్ యూనిట్లకు ముడి సరుకుగా చేరి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుతున్నాయి. రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశాలు పెరుగుతున్నాయి.

పశుసంవర్ధక రంగంలో కూడా జిల్లా ముందంజలో ఉంది. పాల ఉత్పత్తి, పౌల్ట్రీ యూనిట్లు గ్రామీణ ఉపాధికి ఆధారం. వేలాది కుటుంబాలు పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం పొందుతున్నాయి. మొత్తంగా చూస్తే, సంప్రదాయం మరియు ఆధునిక పరిశ్రమల సమన్వయంతో చిత్తూరు జిల్లా మిగతా ప్రాంతాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. మౌలిక సదుపాయాల విస్తరణ, రవాణా అనుసంధానం మెరుగుదలతో ఈ అభివృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *