రూ. 1.90 లక్షల కోట్లతో బెంగళూరు అమరావతి రైల్వే కారిడార్
సర్వే పూర్తి; డీపీఆర్ ఆమోదం, నిధుల కేటాయింపు దశ
864 కిలో మీటర్లు; కుప్పం, పలమనేరు, చిత్తూరు మీదుగా
రైల్వే కారిడార్ నుంచి ఓడరేవులకు కనెక్టివిటీ
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లక్ష్యం
చంద్రబాబు కృషితో రూపుదిద్దుకున్న భారీ ప్రాజెక్టు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
దక్షిణ భారతదేశ రైల్వే చరిత్రలో మలుపుతిప్పే ప్రాజెక్టుగా నిలిచే బెంగళూరు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిను ఐటీ మహానగరం బెంగళూరుతో నేరుగా అనుసంధానించే ఈ మెగా ప్రాజెక్టు రాయలసీమ నుంచి కోస్తా వరకూ ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్చే సామర్థ్యం కలిగి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సుమారు 864 కిలోమీటర్ల పొడవుతో రూపుదిద్దుకుంటున్న ఈ కారిడార్ అంచనా వ్యయం దాదాపు రూ.1.90 లక్షల కోట్లు. క్షేత్రస్థాయి ప్రాథమిక ఇంజినీరింగ్-కమ్-ట్రాఫిక్ సర్వే పూర్తై, ఇప్పుడు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఆమోదం, నిధుల కేటాయింపు దశల్లో ప్రాజెక్టు ఉంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ముఖ్యంగా పోర్ట్ లింక్ రైల్వే మార్గాలు, ఉద్యాన ఉత్పత్తుల వేగవంతమైన రవాణా, పారిశ్రామిక సరుకు రవాణా ఖర్చులు తగ్గించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. రాష్ట్రంలోని ఓడరేవులను వెనుకబడిన అంతర్గత ప్రాంతాలతో బలమైన రైలు అనుసంధానం కల్పిస్తే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల సరుకూ ఆంధ్రప్రదేశ్ పోర్టుల ద్వారా రవాణా అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. బెంగళూరు నుంచి ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్ కారిడార్ కుప్పం, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మీదుగా అమరావతికి చేరేలా రూపకల్పన చేశారు. ఈ మార్గం అమలులోకి వస్తే రాయలసీమ నుంచి రాజధానికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి 3 4 గంటల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇది ఉద్యోగాలు, విద్య, వైద్యం కోసం తరచుగా ప్రయాణించే ప్రజలకు పెద్ద ఉపశమనం కానుంది. అదే సమయంలో ఈ మార్గం పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే బలమైన మౌలిక సదుపాయంగా మారనుంది. పోర్ట్ కనెక్టివిటీ పరంగా రాష్ట్రం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్ట్ వంటి ప్రధాన ఓడరేవులకు ప్రధాన రైల్వే మార్గాల నుంచి నేరుగా కనెక్షన్లు కల్పించే పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఎగుమతులు పెరగడంతో పాటు రవాణా ఖర్చులు తగ్గి పరిశ్రమలకు పోటీ సామర్థ్యం పెరుగుతుంది.
*రైతులకు మార్కెటింగ్ లింకేజీ*
రాష్ట్రంలో ఏటా సుమారు 22.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు పండుతున్న నేపథ్యంలో రైతులకు మార్కెట్ లింకేజీలు కీలకం. చిత్తూరు మామిడి, టమాటా, కూరగాయలు, పూలు వంటి ఉత్పత్తులను తక్కువ సమయంలో మెట్రో నగరాలకు చేరవేయడానికి రైల్వే కీలక పాత్ర పోషించనుంది. కిసాన్ రైల్ సేవలకు ఈ కొత్త కారిడార్ బలమైన మద్దతు ఇవ్వనుంది. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఇది గేమ్ చేంజర్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. తిరుపతి రేణిగుంట పారిశ్రామిక బెల్ట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఆ ప్రాంతాన్ని ప్రధాన రైల్వే కారిడార్లతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మొబైల్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, బ్యాటరీ తయారీ యూనిట్లు వంటి పరిశ్రమలకు వేగవంతమైన రైలు రవాణా అందితే లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి పెట్టుబడులు మరింతగా వస్తాయని భావిస్తున్నారు. అమరావతికి మెరుగైన యాక్సెస్ కోసం ఎర్రుపాలెం నంబూరు కొత్త రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. రాజధాని కోర్ ప్రాంతాన్ని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాలతో బలమైన రైలు అనుసంధానం కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధమవుతోంది. కడప–బెంగళూరు బ్రాడ్ గేజ్ లైన్‌పైనా వేగం పెంచాలని సూచనలు జారీ అయ్యాయి.
*రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ*
రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని 73 స్టేషన్లను 2027 నాటికి అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. వీటిలో చిత్తూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. ఆధునిక టెర్మినల్స్, మల్టీ లెవల్ పార్కింగ్, కమర్షియల్ స్పేస్‌లు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 39 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, మొత్తం 2,318 కిలోమీటర్ల పనులు రూ.34,310 కోట్ల పెట్టుబడితో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 201 కిలోమీటర్ల కొత్త లైన్లు పూర్తయ్యే అవకాశముంది. పండుగలు, యాత్రికుల రద్దీ దృష్ట్యా అదనంగా 1,012 ప్రత్యేక రైళ్లు, 2,370 కోచ్‌లు సిద్ధం చేస్తున్నట్టు వివరించారు.
*అమరావతికి జాతీయ కనెక్టివిటీ*
బెంగళూరు అమరావతి హైస్పీడ్ కారిడార్, పోర్ట్ లింకేజీలు, స్టేషన్ ఆధునీకరణ, కొత్త లైన్ల నిర్మాణం ఈ మొత్తం ప్యాకేజ్ అమలు అయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత బలమైన రైల్వే మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాయలసీమకు కొత్త ఊపు, కోస్తాకు ఎగుమతి శక్తి, రాజధానికి జాతీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ ఈ మూడు లక్ష్యాలను ఒకేసారి సాధించే మహత్తర ప్రణాళికగా ఈ రైల్వే విప్లవాన్ని అభివర్ణిస్తున్నారు.

