24, జనవరి 2026, శనివారం

దశాబ్దాల దాహం… గాలేరు-నగరి ఎక్కడ?

వేల కోట్లు ఖర్చు… చిత్తూరుకు చుక్క నీరు లేదు!
కాల్వలు ఉన్నాయి… నీరు మాత్రం కనబడట్లేదు
కాగితాల్లో ప్రాజెక్టు… బీడు వారుతున్న పంట భూములు
నీటి కోసం రైతుల కన్నీటి గాథ

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లా వాసుల దశాబ్దాల కల, తూర్పు ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాల్సిన జీవనాడిగా భావించిన గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఇప్పటికీ ఆశలకే పరిమితమైంది. కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ బృహత్తర పథకం, ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా, చిత్తూరు జిల్లాకు మాత్రం నీటిని అందించలేకపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోవడంతో రైతుల ఆశలు, ప్రజల కలలు అడియాశలుగా మారాయి. ఎప్పుడో తవ్విన కాలువలకు నీరు రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. సాగునీరు అందక సారవంతమైన రైతుల భూములు బీడు భూములుగా మారుతున్నాయి. రైతులు కూటమి ప్రభుత్వం పట్ల కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో 2005లో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా గాలేరు–నగరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించి, కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్, వామికొండ సాగర్, సర్వరాయ సాగర్ మీదుగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. మొత్తం 38 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకుని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కలిపి 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రణాళిక రూపొందించారు. ఇందులో చిత్తూరు జిల్లాకే సుమారు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. తిరుపతి వంటి నగరాలకు, శేషాచలం పరిసర ప్రాంతాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యమూ ఈ ప్రాజెక్టులో ఉంది. కడప జిల్లా వరకు ఫేజ్-1 పనులు చాలా వరకు పూర్తయ్యాయి. కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఫేజ్-2 పనులు మాత్రం దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రధాన కాలువను సుమారు 120 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 70 నుంచి 80 కిలోమీటర్ల మేర మాత్రమే కాల్వల రూపురేఖలు కనిపిస్తున్నాయి. రైల్వే కోడూరు నుంచి రేణిగుంట వరకు రావాల్సిన కాలువ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో నిర్మించ తలపెట్టిన బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్, వేణుగోపాల సాగర్ వంటి కీలక రిజర్వాయర్లు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. వీటి నిర్మాణం మొదలుకాకపోవడంతో ప్రాజెక్టు నీరు చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టలేకపోయింది.

*జగన్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం* 

2019లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గాలేరు–నగరి ప్రాజెక్టుపై పెద్దగా దృష్టి సారించలేదన్న విమర్శలు బలంగా వినిపించాయి. సంక్షేమ పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులకు ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు చేసినా, అవి క్షేత్రస్థాయిలో పనులకు విడుదల కాలేదు. రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయడంతో ఉన్న కాంట్రాక్టులు రద్దయ్యాయి. కొత్త కాంట్రాక్టర్లు రావడానికి, పనులు తిరిగి ప్రారంభించడానికి దాదాపు రెండేళ్లు వృధా అయ్యాయి. ఈ కాలంలో చిత్తూరు జిల్లాలో కొత్తగా తవ్విన కాల్వల పొడవు చాలా తక్కువగానే ఉంది. ప్రభుత్వం ప్రధానంగా కడప జిల్లాలోని గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లించడం, అక్కడ నీటి నిల్వ పెంపుపైనే దృష్టి సారించింది తప్ప, చిత్తూరుకు నీరు తీసుకొచ్చే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను విస్మరించిందన్న అభిప్రాయం రైతుల్లో ఉంది. 2019 నాటికి ఎక్కడైతే పనులు ఆగాయో, 2024 నాటికి కూడా దాదాపు అక్కడే ఉన్నాయి. కొన్ని చోట్ల తవ్విన కాల్వలు నిర్వహణ లేక పూడిపోయాయి. నీరు రావాల్సిన మార్గాలు మట్టితో నిండిపోయాయి. రైతులకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో తూర్పు చిత్తూరు ప్రాంత రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

*పెరుగుతున్న ప్రాజెక్టు అంచనా వ్యయం* 

ప్రాజెక్టు ప్రారంభంలో 2005లో మొత్తం అంచనా వ్యయం రూ. 4,500 కోట్లుగా నిర్ణయించారు. కానీ కాల్వల రీడిజైనింగ్, భూసేకరణ ఖర్చులు, మెటీరియల్ ధరల పెంపుతో ఈ అంచనా ఇప్పుడు రూ. 14,000 కోట్లకు పైగా చేరింది. ఇప్పటివరకు రెండు దశలకు కలిపి సుమారు రూ. 8,000 నుంచి రూ. 9,000 కోట్ల వరకు ఖర్చయింది. ఈ వ్యయంలో ఎక్కువ భాగం కడప జిల్లాలోనే ఖర్చయింది. చిత్తూరు జిల్లాకు సంబంధించిన కీలక పనులు మాత్రం పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల కూడా పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు సుమారు రూ. 500 నుంచి రూ. 700 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి, యంత్రాలను వెనక్కి తీసుకెళ్లారు. దీంతో ఇప్పటికే మందగించిన ప్రాజెక్టు మరింత వెనుకబడ్డది.

*ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ* 

భూసేకరణ సమస్య కూడా ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి ప్రధాన అవరోధంగా మారింది. ప్రధాన కాలువ వెళ్లే మార్గంలో రైతులు తమ భూములను ఇవ్వడానికి నిరాకరించారు. కోర్టు కేసులు వేయడంతో పనులు ఆగిపోయాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో చెల్లించలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల పరిహారం ప్రకటించినా, నిధులు లేక రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు పూర్తిగా అమలు కాలేదు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించకపోవడంతో వారు పనులను అడ్డుకున్నారు. అటవీ అనుమతులు మరో పెద్ద సమస్యగా మారాయి. కడప నుంచి చిత్తూరుకు నీరు రావాలంటే శేషాచలం అటవీ ప్రాంతం గుండా కాలువ రావాలి. దీనికి సంబంధించిన పర్యావరణ, వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ రావడంలో తీవ్ర జాప్యం జరిగింది. అవుకు టన్నెల్ పనులు సాంకేతిక కారణాలతో ఆలస్యం కావడం వల్ల దిగువన ఉన్న చిత్తూరుకు నీరు రాలేదు. రాజకీయ చిత్తశుద్ధి లోపం కూడా ఈ ప్రాజెక్టు నెమ్మదికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. గాలేరు నగరి నీరు రాకపోవడంతో చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో బోరుబావుల్లో నీరు అడుగంటిపోయింది. 1200 అడుగులు వేసినా చుక్క నీరు రావడం లేదు. మామిడి తోటలు ఎండిపోతున్నాయి. వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది. రైతులు ప్రత్యామ్నాయం లేక భూములను బీడుగా వదిలేస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక కూలీలు, చిన్న రైతులు చెన్నై, తిరుపతి వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. “నీరు వస్తే మా బతుకులు మారతాయి” అన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతుల కళ్లలో ఇప్పుడు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి.

*దృష్టి సారించిన కూటమి సర్కార్*

2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గాలేరు నగరి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 2026లో నిర్వహించిన సమీక్షల్లో ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. 2027 నాటికి చిత్తూరు జిల్లాలోని బాలాజీ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను పరిష్కరించి, అటవీ అనుమతులు తెప్పించి, యుద్ధ ప్రాతిపదికన కాలువ పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, నాబార్డు రుణాల ద్వారా నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గత అనుభవాలను చూసిన రైతులు ఈ హామీలపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దశాబ్దాలుగా విన్న మాటలే ఇవి. ప్రతిసారి కొత్త ప్రభుత్వం వస్తే కొత్త హామీలు ఇస్తుంది. కానీ నేలమీద కనిపించే పనులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. రూ. 16 వేల కోట్లకు చేరిన అంచనాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పనులుగా మారితేనే గాలేరు నగరి కల సాకారమవుతుంది. కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాకు వస్తే తూర్పు ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. సాగునీరు అందితే పంటల దిగుబడి పెరుగుతుంది. భూగర్భ జలాలు మెరుగవుతాయి. రైతుల ఆదాయం పెరుగుతుంది. వలసలు ఆగుతాయి. కానీ ఈ మార్పు రావాలంటే రాజకీయ చిత్తశుద్ధి, నిధుల కేటాయింపు, భూసేకరణ సమస్యల పరిష్కారం, కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపు అన్నీ సమాంతరంగా జరగాలి.

జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన జాప్యం, నిర్లక్ష్యం వల్ల గాలేరు నగరి ప్రాజెక్టు చిత్తూరు జిల్లాకు దూరంగానే మిగిలింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిజంగా పరుగులెత్తిస్తుందా? లేక మరోసారి రైతుల ఆశలను మాత్రమే పెంచి, పనులను ఆలస్యం చేస్తుందా? అన్నది కాలమే తేల్చాలి. కానీ ఒకటి మాత్రం స్పష్టం  గాలేరు నగరి నీరు చిత్తూరు జిల్లాకు చేరే వరకు ఈ ప్రాంత రైతుల కన్నీటి గాథ కొనసాగుతూనే ఉంటుంది.

(రేపటి సంచికలో ...
హంద్రీ–నీవా కాల్వలు ఉన్నాయ్… కానీ నీరు ఎక్కడ?)

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *