12, జనవరి 2026, సోమవారం

చిత్తూరు విద్యార్థుల పెదవులపై కూల్ లిప్ విషం!

కూల్ లిప్ మత్తులో చిత్తవుతున్న బడి పిల్లలు.. 
చిత్తూరులో ఆందోళనకర పరిస్థితులు
పుస్తకం పట్టాల్సిన చేతుల్లో విషపు పొట్లాలు.. 
విద్యార్థుల భవిష్యత్తును కబళిస్తున్న కూల్ లిప్


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు విద్యార్థుల పెదవులపై కూల్ లిప్ విషం విలయతాండవం చేస్తోంది. చదువుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యార్థులు కూల్ లిప్ మత్తులో చిత్తవుతున్నారు. చిత్తూరు పట్టణంలోని ఒక మున్సిపల్ ఉన్నత పాఠశాలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేయగా ఆందోళనకర పరిస్థితులు వేలుగులోకి వచ్చాయి. పుస్తకం పట్టాల్సిన చేతుల్లో విషపు పొట్లాలు దర్శనమీయడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. విద్యార్థుల భవిష్యత్తును నిశ్శబ్దంగా కబళిస్తున్న కూల్ లిప్ జిల్లావ్యాప్తంగా పెనుభూతంగా మారింది. సరిహద్దు ప్రాంతం కావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులు పాఠశాలల చుట్టూ విచ్చలవిడిగా అమ్ముడవుతుండటం, చిన్న వయసులోనే పిల్లలు మత్తుకు బానిసలవడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. చదువు దశలోనే ఆరోగ్యం, భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుండటంతో చిత్తూరులో పరిస్థితి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ విషయమై చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు స్వయంగా పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

కూల్ లిప్ ప్యాకెట్లలో తంబాకూ పొడి, నికోటిన్, రసాయన సువాసన ద్రవ్యాలు, రంగు పదార్థాలు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి హానికరం, మత్తుకు అలవాటు చేసే ప్రమాదం ఉంది. లిప్ బామ్‌లా కనిపించినా, వాస్తవానికి ఇది విషపూరిత పదార్థాల మిశ్రమం. ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులు పాఠశాల విద్యార్థుల జీవితాలను నిశ్శబ్దంగా నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా ‘కూల్ లిప్’ అనే పొగలేని ఫిల్టర్ పొగాకు ఇప్పుడు స్కూల్ పిల్లల్లో మత్తుకు అలవాటు చేసే ప్రమాదకర పదార్థంగా మారింది. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్లో విషపు పొట్లాలు దర్శనమిస్తున్నాయి. చదువుపై దృష్టి పెట్టాల్సిన వయసులో మత్తులో జోగుతున్న విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉండటం ఈ మాఫియాకు వరంగా మారింది. బెంగళూరు, కోలార్, తమిళనాడు ప్రాంతాల నుంచి లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, గూడ్స్ వాహనాల ద్వారా ‘కూల్ లిప్’ రహస్యంగా చిత్తూరుకు చేరుతోంది. మొదట గోడౌన్లలో నిల్వ చేసి, అక్కడి నుంచి చిన్న డీలర్ల ద్వారా పట్టణాలు, మండల కేంద్రాలు, ముఖ్యంగా పాఠశాలల సమీపంలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అధికారుల కళ్లకు చిక్కకుండా ఈ సరఫరా వ్యవస్థ చాలా కాలంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలకు వంద గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల చుట్టూ ఉన్న చిన్న కిరాణా షాపులు, పాన్ షాపులు, స్టేషనరీ దుకాణాల్లో ఈ నిషేధిత ఉత్పత్తి రహస్యంగా అమ్ముతున్నారు. విద్యార్థులు నేరుగా కూల్ లిప్ ఇవ్వండని అడగరు. కూల్, స్టఫ్, ప్యాకెట్ వంటి కోడ్ మాటలు ఉపయోగిస్తారు. దుకాణదారులు కూడా బయటకు కనిపించకుండా జేబుల నుంచి, డ్రాయర్‌ల నుంచి పొట్లాలను అందిస్తున్నారు. కేవలం రూ.10 నుంచి రూ.20 ధర ఉండటంతో పిల్లలు తమ పాకెట్ మనీతోనే సులభంగా కొనుగోలు చేస్తున్నారు. హైస్కూల్ స్థాయి పిల్లల్లో ఇది సరదాగా మొదలై, క్రమంగా వ్యసనంగా మారుతోంది. కొన్ని పాఠశాలల్లో సీనియర్ విద్యార్థులే జూనియర్లకు దీనిని పరిచయం చేస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు ఏజెంట్లుగా మారి స్నేహితులకు అమ్ముతూ కమీషన్ కూడా సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్ పిల్లల మధ్య ఏర్పడింది.

ఇటీవల చిత్తూరు, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆకస్మికంగా బ్యాగ్ చెకింగ్ చేపట్టారు. ఆ తనిఖీల్లో విద్యార్థుల బ్యాగుల్లో, జేబుల్లో కూల్ లిప్ ప్యాకెట్లు కుప్పలుగా బయటపడ్డాయి. కొంతమంది విద్యార్థులు మత్తులోనే తరగతికి వస్తున్నారని, క్లాస్‌లో నిద్రపోతున్నారని, పాఠాలపై ఏకాగ్రత లేకుండా ప్రవర్తిస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు, కోపం, చిరాకు, చదువుపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. వైద్య నిపుణుల మాటల్లో, కూల్ లిప్‌లో ఉండే నికోటిన్, ఇతర రసాయనాలు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, చిగుళ్ల వ్యాధులు, పళ్ళు ఊడిపోవడం, జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తాయి. అంతేకాదు, ఇది మెదడుపై ప్రభావం చూపి మత్తును కలిగిస్తుంది. దీన్ని వాడకపోతే చేతులు వణకడం, కోపం, ఆందోళన వంటి ఉపసంహరణ లక్షణాలు వస్తాయి. అంటే ఇది కేవలం అలవాటు కాదు, పూర్తిస్థాయి వ్యసనం. వైద్యులు దీనిని “గేట్‌వే డ్రగ్”గా అభివర్ణిస్తున్నారు. కూల్ లిప్‌తో మొదలైన వ్యసనం క్రమంగా సిగరెట్, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల వైపు నడిపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

కొంతమంది విద్యార్థులు ఈ వ్యసనానికి డబ్బులు లేకపోతే ఇంట్లో అబద్ధాలు చెప్పడం, చిన్న దొంగతనాలకు పాల్పడడం, బయట తప్పుదారిలోకి వెళ్లడం మొదలుపెడుతున్నారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. చదువుపై దృష్టి తగ్గడం వల్ల విద్యానష్టం జరుగుతోంది. చిన్న వయసులోనే భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతోంది. ఆహార భద్రత నిబంధనల ప్రకారం నికోటిన్ కలిసిన పొగాకు ఉత్పత్తుల అమ్మకం, పంపిణీ పలు రాష్ట్రాల్లో నిషేధం. అయినప్పటికీ చిత్తూరు జిల్లాలో అక్రమ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారుల తనిఖీలు అరుదుగా ఉండటం, దుకాణాలపై కఠిన చర్యలు లేకపోవడం వల్ల ఈ దందా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు అధికార యంత్రాంగం విఫలమైందని ఆరోపిస్తున్నాయి. విద్యార్థులను చైతన్యపరిచేలా కరపత్రాలు విడుదల చేస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, సరఫరా గొలుసు మాత్రం ఆగడం లేదని చెబుతున్నాయి.

కొన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈగల్ టీమ్, పోలీసులు రంగంలోకి దిగారు. తిరుపతిలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కూల్ లిప్ వాడుతున్నట్టు గుర్తించిన పోలీసులు, అమ్మకాలు జరుగుతున్న దుకాణాలపై నిఘా పెంచారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తూనే, సరఫరా చేసే వ్యక్తులపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా పోలీసుల సహకారంతో ఈ మత్తు పదార్థాల దందాను అరికడతామని చెబుతున్నారు. అయితే ఇది కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాదు. ఇది సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సామాజిక సమస్య. పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాల్సిన చోట పొగాకు పొట్లాలు దర్శనమిస్తే, రేపటి తరం ఎలా ఉండబోతోందన్న ప్రశ్న తలెత్తుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలి. నోటి దుర్వాసన, పెదవుల కింద ఎర్రగా కందిపోవడం, ఎక్కువగా కోపం, చదువుపై నిర్లక్ష్యం వంటి లక్షణాలను గమనించాలి. ఉపాధ్యాయులు కేవలం శిక్షలకే పరిమితం కాకుండా కౌన్సిలింగ్ ద్వారా పిల్లలను సరైన దారిలోకి తీసుకురావాలి. చట్టాలు, పోలీసు చర్యలు, స్కూల్ తనిఖీలు అవసరమే. కానీ అంతకన్నా ముఖ్యం సమాజం మొత్తం అప్రమత్తం కావాలి. చిన్న వయసులోనే మత్తుకు బానిసయ్యే ప్రమాదం నుంచి పిల్లలను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. లేకపోతే ‘కూల్ లిప్’ అనే చిన్న పొట్లమే చిత్తూరు జిల్లా విద్యార్థుల పెద్ద భవిష్యత్తును మింగేస్తుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *