1, జనవరి 2026, గురువారం

కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం

ఆఫర్లతో ముంచేత్తుతున్న బార్లు, హోటళ్లు

ముస్తాబైన ప్రధాన ఆలయాలు 

జిల్లా వ్యాప్తంగా పోలీసుల భారీ బందోబస్తు 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి జిల్లా ప్రజలు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఏడాది పొడవునా ఎదురైన కష్టాలు, నష్టాలు, నిరాశలను వెనక్కి నెట్టి, రాబోయే రోజులు సుఖశాంతులతో ఉండాలనే ఆశతో ప్రజలు కొత్త ఏడాదిని ఆహ్వానిస్తున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులకు శుభాకాంక్షలు చెప్పేందుకు కుటుంబాలన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా పోస్ట్‌లతో అర్ధరాత్రి వేళ శుభాకాంక్షల సందడి నెలకొననుంది.

నూతన సంవత్సర వేడుకల్లో వినోదానికి పెద్దపీట వేస్తున్నారు. సంగీత కచేరీలు, డాన్స్ కార్యక్రమాలు, లైవ్ బ్యాండ్స్, డీజే షోలు వంటి కార్యక్రమాలతో హోటళ్లు, రిసార్టులు, ఈవెంట్ హాల్లు కళకళలాడనున్నాయి. యువతతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపుతున్నారు. కొన్ని హోటళ్లు ప్రత్యేకంగా నూతన సంవత్సర ఈవెంట్లను నిర్వహిస్తూ ముందస్తు బుకింగ్‌లతో నిండిపోయాయి. రాత్రి 12 గంటలు కాగానే కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునే దృశ్యాలు ప్రతి చోటా కనిపించనున్నాయి.

నూతన సంవత్సర సందర్భంగా వ్యాపార రంగంలోనూ సందడి నెలకొంది. బార్లు, వైన్ షాపులు, హోటళ్లు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ముఖ్యంగా మాంసాహార హోటళ్లలో ‘వన్ ప్లస్ వన్’ ఆఫర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. చికెన్, మటన్, చేపల వంటకాలపై ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతో హోటళ్ల వద్ద రద్దీ పెరుగుతోంది. అలాగే శాకాహార హోటళ్లు కూడా ప్రత్యేక మెనూలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

మిఠాయిలు, చాక్లెట్లు, కేకుల కొనుగోళ్లలోనూ భారీగా పెరుగుదల కనిపిస్తోంది. జిల్లాలోని బేకరీలు నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాయి. నూతన డిజైన్లతో కేకులు, చాక్లెట్ బాస్కెట్లు, స్వీట్స్ అందుబాటులో ఉంచాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా కొత్త రుచులు, కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టడంతో బేకరీలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బేకరీలు ముందస్తు ఆర్డర్లతోనే బిజీగా మారాయి.

నూతన సంవత్సర వేడుకల్లో భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం వికట్టుదిడ్డమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచే వాహనాల తనిఖీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన కూడళ్లలో, రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించి, పెట్రోలింగ్‌ను కూడా పెంచారు.

ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలకు వెళ్లడం జిల్లా ప్రజల్లో ఆనవాయితీగా కొనసాగుతోంది. కొత్త ఏడాది తొలి రోజున దేవుడి దర్శనంతో జీవితాన్ని ప్రారంభించాలనే భావనతో భక్తులు ఆలయాల వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో జిల్లాలోని ప్రధాన ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ప్రాంగణాలను శుభ్రపరిచి, పూల అలంకరణలు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాట, ఇబ్బందులు కలగకుండా దేవస్థానాల సిబ్బంది, పోలీసుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

నూతన సంవత్సర వేడుకలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ ఏడాదిలో ఎదురైన కష్టాలను మరిచిపోయి, రాబోయే రోజులు ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖశాంతులతో గడవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కుటుంబాల మధ్య ఐక్యత, స్నేహితుల మధ్య అనుబంధం, సమాజంలో శాంతి, సామరస్యం పెరగాలనే ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి, జిల్లా అంతటా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వాతావరణం నెలకొంది. ఉత్సాహం, ఆనందం, భద్రతా ఏర్పాట్లతో కొత్త ఏడాదిని ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. 2026 సంవత్సరం జిల్లా ప్రజలందరికీ శుభప్రదంగా, సంతోషంగా ఉండాలన్న ఆశతో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *