ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యలతో స్వాగతం
కోటి ఆశలతో చంద్రబాబుకు స్వాగతం పలకనున్న నగరి ప్రజలు
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పర్యటనకు రానున్న వేళ, ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో ఆశతో పాటు ఆవేదన కూడా కలగలిసిన భావన కనిపిస్తోంది. అభివృద్ధికి నోచుకోని మౌలిక వసతులు, ఏళ్ల తరబడి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రైతు, కార్మిక సమస్యలు, యువతను వలస దారుల్లోకి నెట్టేస్తున్న నిరుద్యోగం ఇవన్నీ కలిసి నగరి నియోజకవర్గాన్ని ప్రశ్నల గూటిగా మార్చాయి. ముఖ్యమంత్రి పర్యటన ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాక, ప్రజల బాధలను నేరుగా వినిపించే అవకాశంగా మారుతుందన్న ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు.
*టెక్స్టైల్ పార్క్ కోసం నగరి ఎదురుచూపులు*
నగరి నియోజకవర్గం సంప్రదాయంగా పరిశ్రమలు, వ్యవసాయం, హస్తకళలపై ఆధారపడిన ప్రాంతం. ముఖ్యంగా పవర్ లూమ్, చేనేత రంగం వేలాది కుటుంబాలకు జీవనాధారం. అయితే ఇటీవలి కాలంలో ఈ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పవర్ లూమ్ పరిశ్రమలకు విధిస్తున్న అధిక విద్యుత్ చార్జీలు కార్మికులను కుదేలుచేస్తున్నాయి. యూనిట్ రేట్లు పెరగడం వల్ల లాభాలు పూర్తిగా కరిగిపోయాయి. విద్యుత్ సబ్సిడీని పెంచాలని, కనీసం ప్రత్యేక రాయితీ రేట్లు అమలు చేయాలని నేతన్నలు కోరుతున్నారు. మరోవైపు నూలు, పట్టు వంటి ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగి, ఉత్పత్తి వ్యయం అదుపు తప్పింది. ప్రభుత్వం ముడి సరుకులపై రాయితీలు కల్పిస్తేనే ఈ రంగం నిలదొక్కుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, నగరిలో ఒక సమగ్ర టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే మార్కెటింగ్ సౌకర్యాలు పెరిగి, మధ్యవర్తుల దోపిడీ తగ్గి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
*చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ*
నగరి ప్రాంత రైతుల మరో ప్రధాన వేదన చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం మూతపడటం. ఒకప్పుడు వేలాది చెరకు రైతులకు అండగా నిలిచిన ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏళ్లుగా డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు తమ చెరకు పంటకు సరైన మార్కెట్ లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పాత బకాయిలు ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. సాగు వ్యయం పెరిగిన నేపథ్యంలో చెరకు టన్నుకు గిట్టుబాటు మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యంకాకపోతే, ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ భాగస్వామ్యంతోనైనా చెరకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
నత్తనడకన గాలేరు నగరి సుజల స్రవంతి
చిత్తూరు జిల్లాకు కరువు నివారణలో కీలకమైన గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాలు నగరి నియోజకవర్గంలోని చెరువులకు చేరి, సాగునీటి కొరత తీరుతుందన్న ఆశ ఉంది. కానీ కాలువల నిర్మాణ పనులు నత్తనడకన సాగడం వల్ల రైతులు నిరాశలో ఉన్నారు. వేసవిలో తీవ్రంగా మారుతున్న తాగునీటి సమస్యకు ఈ ప్రాజెక్టే శాశ్వత పరిష్కారమని ప్రజలు భావిస్తున్నారు. అందుకే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
*ఇబ్బంది పెడుతున్న డ్రైనేజీ సమస్య*
నగరి పట్టణం విస్తరిస్తున్న కొద్దీ మున్సిపల్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగునీరు వీధుల్లోనే నిలిచిపోతోంది. దీంతో దోమల బెడద, సీజనల్ వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయి. శాశ్వత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలన్న డిమాండ్ ఎన్నాళ్లుగానో ఉంది. అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రధాన రహదారుల విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వ్యాపారులు, వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
*నిరుద్యోగుల వలస బాట*
యువతకు ఉపాధి అవకాశాల కల్పన నగరి నియోజకవర్గంలో అత్యంత కీలక అంశంగా మారింది. చెన్నై, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు దగ్గరగా ఉన్నప్పటికీ, ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఫలితంగా యువత వలస బాట పడుతోంది. ఈ పరిస్థితిని మార్చాలంటే ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అవసరమని స్థానికులు సూచిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే పెట్టుబడులు ఆకర్షించవచ్చు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, జాబ్ మేళాలు నిర్వహిస్తే యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందన్న ఆశ వ్యక్తమవుతోంది.
*మామిడి రైతులకు దక్కని మద్దతు ధర*
ఇవన్నీ ఒక ఎత్తైతే, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి మరో ఎత్తు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు 12 రూపాయల మద్దతు ధర పూర్తిస్థాయిలో రైతులకు అందడం లేదు. నాలుగు రూపాయలను మాత్రమే ప్రోత్సాహక ధరగా చెల్లించగా, ఫ్యాక్టరీలు కూడా 8 రూపాయలకు బదులు నాలుగు నుంచి ఐదు రూపాయలకే కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల ఇప్పటివరకు మామిడికాయల బిల్లులే చెల్లించలేదు. దీంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినా, ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది.
ఈ అన్ని సమస్యల మధ్య ముఖ్యమంత్రి నగరి పర్యటన ప్రజలకు ఒక కీలక అవకాశం. ఇది కేవలం స్వాగత కార్యక్రమం మాత్రమే కాక, సమస్యలతో స్వాగతం పలికే సందర్భంగా మారుతోంది. నేతన్నల నుంచి రైతుల వరకు, పట్టణ వాసుల నుంచి యువత వరకు ప్రతి వర్గం తమ బాధలు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎదురుచూస్తోంది. ఈ పర్యటనలో సమస్యలపై స్పష్టమైన హామీలు, కార్యాచరణ ప్రణాళికలు ప్రకటిస్తేనే నగరి నియోజకవర్గానికి నిజమైన అభివృద్ధి దిశ కనిపిస్తుందన్న ఆశతో ప్రజలు నిలుస్తున్నారు. సంప్రదాయంగా కష్టపడే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే రోజు త్వరలోనే రావాలని వారు కోరుకుంటున్నారు.
గంగ 1 ముఖ్యమంత్రి చంద్రబాబు

