16, జనవరి 2026, శుక్రవారం

తలహీనమవుతున్న ప్రాచీన పండుగలు

కనిపించని గంగిరెద్దుల హడావిడి 
కనుమరుగైన హరిదాసులు 
జాడ లేని జంగమయ్యలు 
మాయమైన కాడెద్దులు, కోడెదూడలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఒకప్పుడు సంక్రాంతి వస్తోందంటే చాలు… పల్లె తల్లి పులకించిపోయేది. నెల రోజుల ముందే ఊరంతా పండుగ వాతావరణం నెలకొనేది. పొలాల్లో పంట కోతలు, గాదెల్లో ధాన్యం, ఇంటింటా గొబ్బిళ్లు, రంగవల్లులు, వీధుల నిండా హరిదాసుల పాటలు, జంగమయ్యల శంఖనాదాలు, గంటారావాలు, గంగిరెద్దుల ఆటలు… ఇవన్నీ కలిసి సంక్రాంతిని ఒక మహా గ్రామీణ ఉత్సవంగా నిలిపేవి. కానీ నేడు ఆ దృశ్యాలు అరుదయ్యాయి. ఆధునికత ముసుగులో సాంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతుంటే, పంటలు పండక రైతుల ఇంట సిరులు మాయమవుతున్నాయి. ఫలితంగా కళకళలాడాల్సిన సంక్రాంతి నేడు పల్లెసీమల్లో వెలవెలబోతున్నది.



సంక్రాంతి అంటేనే రైతు పండుగ. వరి, చెరకు, వేరుశనగ వంటి సంప్రదాయ పంటలు విస్తారంగా సాగయ్యేవి. పొలాల నుంచి కొత్త ధాన్యం ఇంటికి చేరితేనే ఆ ఇంట పండుగ శోభ వచ్చేది. రైతు అప్పుల నుంచి కొంత ఊరట పొందేవాడు. పండుగను ధూమ్ ధామ్‌గా జరుపుకునే స్థితిలో ఉండేవాడు. కానీ ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా పరిస్థితి భిన్నంగా ఉంది. నీటి ఎద్దడి, సాగునీటి ప్రాజెక్టుల జాప్యం, పెట్టుబడి భారాలు, పెరిగిన సాగు ఖర్చులు రైతును సాగు నుంచి దూరం చేస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 10 శాతం కూడా పంటలు సాగు కాలేదన్న అంచనాలు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గాదెల్లో ధాన్యం లేదు… చేతిలో డబ్బు లేదు… ఫలితంగా పండుగ కూడా నామమాత్రంగా మారుతోంది.

మూగబోయిన హరినామం… వినిపించని శంఖనాదం

గతంలో ధనుర్మాసం మొదలైందంటే చాలు… తెల్లవారుజామున వీధుల నిండా భక్తి భావం వెల్లివిరిసేది. నెత్తిన అక్షయ పాత్ర, చేతిలో తంబురతో హరిలోరంగ హరి అంటూ హరిదాసులు ఇంటింటికీ తిరిగేవారు. వారి గానం గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించేది. అలాగే జంగమయ్యల రాక కూడా సంక్రాంతికి ఒక ప్రత్యేక గుర్తు. వేకువజామున శంఖానాదం, గంటానాదంతో హర హర మహదేవ, శంభో శంకర… జయము నీకు వీరభద్ర, జయము నీకు లోక రుద్ర అంటూ జంగమయ్యలు ఇల్లు తిరిగేవారు. ప్రజలు వారికి ధాన్యాలు, వస్త్రాలు, నగదు సమర్పించేవారు. ఇది కేవలం దానం కాదు… శైవ సంప్రదాయానికి, గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక. నేడు ఈ దృశ్యాలు అరుదయ్యాయి. చాలా గ్రామాల్లో జంగమయ్యల శంఖారావం వినిపించడం లేదు. జీవనోపాధి సమస్యలు, ఆదరణ లేకపోవడం వల్ల ఈ సంప్రదాయం మెల్లగా కనుమరుగవుతోంది. ఇవి ప్రస్తుతం విఐపిల కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయి.


గంగిరెద్దుల ఆటలు మాయం ..గొబ్బిళ్ళ సందడి
కట్

ఒకప్పుడు సంక్రాంతి అంటే గంగిరెద్దుల హడావిడి తప్పనిసరి. అయ్యవారికి దండం పెట్టు… అమ్మవారికి దండం పెట్టు అంటూ సన్నాయి మేళాల మధ్య బసవన్నల ఆటలు పిల్లలను, పెద్దలను అలరించేవి. ప్రజలు వారికి ధాన్యం, పాత వస్త్రాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ జానపద కళలు చాలా చోట్ల కనిపించడం లేదు. నగరాల వైపు వలసలు, ఆధునిక వినోద సాధనాలు, ఆర్థిక ఇబ్బందులు గంగిరెద్దుల సంప్రదాయాన్ని కూడా అంచులకు నెట్టేశాయి. సంక్రాంతి అనుబంధాల పండుగ. ఒకప్పుడు మహిళలు ఆవుపేడతో గొబ్బిళ్లు చేసి, పూలతో అలంకరించి పాటలు పాడేవారు. కొత్త అల్లుడు ఇంటికి వస్తే మామ వచ్చినాడమ్మ… మన మామ వచ్చినాడు అంటూ గ్రామంలోకి కొత్తగా వచ్చిన అల్లుళ్లను సరదాగా ఆటపట్టించేవారు. ఈ దృశ్యాలు కుటుంబ బంధాలను మరింత బలపరిచేవి. నేడు ఈ సంప్రదాయాలు చాలా గ్రామాల్లో కనిపించడం లేదు. పండుగ అంటే టీవీ, మొబైల్ ఫోన్లకే పరిమితమవుతోంది. బంధువుల రాక తగ్గిపోయింది. పల్లెల్లో ఉన్న ఆప్యాయత, ఉత్సాహం మెల్లగా తగ్గిపోతోంది.

ఎద్దులు, కోడెదూడలు మాయం

ఒకప్పుడు గ్రామీణ వ్యవసాయం అంటే ఎద్దులు, కోడెదూడలే ప్రాణం. పంట పొలాల్లో ఎద్దుల జతలు, పశువుల పందాలు, కోడెదూడల పందేలు సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. రైతుకు గౌరవం, బలం అన్నీ ఎద్దుల ద్వారానే కొలవబడేవి. కానీ నేడు గ్రామాల్లో ఎద్దులు, కోడెదూడలు కనిపించడం అరుదుగా మారింది. యాంత్రీకరణ, ట్రాక్టర్ల వినియోగం పెరగడంతో ఎద్దుల అవసరం తగ్గింది. పెంపకం ఖర్చులు పెరగడం వల్ల రైతులు ఎద్దుల పెంపకానికి దూరమవుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో పశువులంటే ఆవులకే పరిమితం అవుతున్నాయి. ఇది కేవలం వ్యవసాయ మార్పు మాత్రమే కాదు… గ్రామీణ సంస్కృతిలో ఒక కీలక భాగం కనుమరుగవుతున్న సంకేతం అని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

 ప్రాచీన సాంప్రదాయాలు కనుమరుగు

మన సంస్కృతికి అద్దం పట్టే సంక్రాంతి నేడు క్రమంగా మొక్కుబడి పండుగగా మారుతోంది. పంటలు తగ్గాయి, జానపద కళలు కనుమరుగవుతున్నాయి, పశువుల ప్రాధాన్యం తగ్గుతోంది, అనుబంధాలు సడలుతున్నాయి. భావితరాలకు మన మూలాలు తెలియాలంటే హరిదాసులు, జంగమయ్యలు, గంగిరెద్దుల కళలు, ఎద్దుల సంస్కృతి, వ్యవసాయం అన్నీ  బతికించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. లేదంటే రాబోయే రోజుల్లో సంక్రాంతి కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *