ఉపాధి హామీలో ఐదేళ్లలో రూ.784 లక్షలు స్వాహా
రికవరీ అయిన నిధులు రూ. 134 లక్షలు మాత్రమే
రూ. 535 లక్షల రికవరీని రద్దు చేసిన పిడి
జిల్లా వ్యాప్తంగా 44 మంది సిబ్బంది సస్పెన్షన్…
రామకుప్పంలో మాత్రమే 11 మంది సస్పెన్షన్
రామకుప్పం అత్యధికంగా రూ. 119.48 లక్షలు స్వాహా
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాలో గ్రామీణ పేదలకు భరోసాగా ఉండాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు అధికారిక సామాజిక తనిఖీ నివేదికలతో నిజమవుతున్నాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద మొత్తం రూ.783.88 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీల్లో తేలింది. ఇందులో ఇప్పటివరకు కేవలం రూ.134.28 లక్షల మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇంకా రూ.15.52 లక్షల రికవరీ పెండింగ్‌లో ఉండగా, మరోవైపు రూ.534.89 లక్షల విషయంలో రికవరీ అవసరం లేదంటూ నిలుపుదల చేయడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఇంజనీరింగ్ సిబ్బంది వరకు మొత్తం 44 మందిని అధికారులు సస్పెండ్ చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
ఉపాధి పనులు కూలీలతో చేయించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, చిత్తూరు జిల్లాలో యంత్రాలే కూలీలుగా మారిన దృశ్యాలు సామాజిక తనిఖీల్లో బయటపడ్డాయి. జేసీబీలు, ప్రోక్లెయినర్లతో రాత్రికి రాత్రే పనులు పూర్తి చేసి, పగటిపూట మస్టర్ రోల్స్‌లో కూలీల పేర్లు నమోదు చేసి వేతనాలు డ్రా చేసిన ఘటనలు కోకొల్లలు. గ్రామాల్లో అసలు నివసించని వ్యక్తులు, చనిపోయిన వారు, వలస వెళ్లిన వారి పేర్లతో జాబ్ కార్డులు సృష్టించి హాజరు వేసినట్లు చూపడం ద్వారా నిధులు స్వాహా చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కూలీల దగ్గర ఉండాల్సిన జాబ్ కార్డులు, ఏటీఎం కార్డులు ఫీల్డ్ అసిస్టెంట్లు లేదా మేట్ల చేతుల్లో ఉండటం మరో పెద్ద అక్రమంగా మారింది. ఖాతాల్లో డబ్బులు పడగానే వీరే డ్రా చేసుకుని, కూలీలకు కొంత మొత్తమే ఇచ్చి మిగతా డబ్బును వాటాలుగా పంచుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబం చేసిన పనిని వేర్వేరు గ్రూపులుగా చూపి, కొలతలను పెంచి బిల్లులు వేసిన విధానాలు కూడా సామాజిక తనిఖీల్లో నమోదయ్యాయి. మెటీరియల్ పనుల పేరుతో జరిగిన అక్రమాలు మరింత ఘోరంగా ఉన్నట్లు తేలింది. గతంలో నిర్మించిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పశువుల పాకలను కొత్తగా నిర్మించినట్లు చూపుతూ ఫోటోలు మార్ఫింగ్ చేయడం, వేరే యాంగిల్స్‌లో తీసిన చిత్రాలతో బిల్లులు పెట్టడం సాధారణంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా నాసిరకం మెటీరియల్ వాడినా, కొలత పుస్తకాలలో మాత్రం నాణ్యమైన సిమెంట్, ఇటుకలు వాడినట్లు నమోదు చేసి నిధులు కాజేశారు. చిత్తూరు జిల్లా భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ప్రధానంగా సాగు చేసే పంటలను కూడా అక్రమాలకు అనుకూలంగా మలిచారు. మామిడి తోటల పెంపకం పేరుతో గుంతలను యంత్రాలతో తవ్వి, కూలీలతో తవ్వినట్లు రికార్డులు సృష్టించారు. మొక్కలకు నీళ్లు పోయకపోయినా పోసినట్లు చూపి మస్టర్లు వేసి బిల్లులు క్లెయిమ్ చేశారు. చనిపోయిన మొక్కలను కూడా బతికున్నట్లు చూపి మూడు సంవత్సరాల నిర్వహణ ఖర్చుల పేరుతో నిధులు డ్రా చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ చిత్తూరు ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని పశువుల పాకలు, గొర్రెల షెడ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున మోసాలు జరిగాయి. ఒక రైతుకు మంజూరైన షెడ్డును నిర్మించకుండానే పక్కవారి పాత షెడ్డును చూపించి బిల్లులు డ్రా చేయడం, ఒకే షెడ్డును ఇద్దరు ముగ్గురు లబ్ధిదారులకు చూపించి నిధులు కాజేసిన ఘటనలు కూడా నమోదయ్యాయి. పంట కుంటల పేరుతో వాస్తవంగా గొయ్యి లేకపోయినా కాగితాల్లో కుంటలు తవ్వినట్లు చూపడం, సహజ గుంతలను పంట కుంటలుగా చిత్రీకరించడం వంటి అక్రమాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో శాతం పద్ధతి నడుస్తోందన్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఏపీఓల వరకు అందరికీ వాటాలు వెళ్లాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొలత పుస్తకాలలో కొలతలు పెంచి రాయడానికి ఇంజనీరింగ్ సిబ్బంది లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా సామాజిక తనిఖీ నివేదికల్లో నమోదయ్యాయి.
*రామకుప్పంలో అత్యధికంగా నిధులు స్వాహా*
మండలాల వారీగా నిధుల దుర్వినియోగాన్ని పరిశీలిస్తే రామకుప్పం మండలం రూ.119.48 లక్షలతో అగ్రస్థానంలో నిలిచింది. శాంతిపురం మండలంలో రూ.73.30 లక్షలు, నిండ్రలో రూ.60.19 లక్షలు, కుప్పంలో రూ.58.74 లక్షలు, పూతలపట్టులో రూ.57.42 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలింది. బైరెడ్డిపల్లిలో రూ.44.42 లక్షలు, నగరిలో రూ.38.18 లక్షలు, పెద్దపంజాణిలో రూ.32.06 లక్షలు, కార్వేటి నగరంలో రూ.26.51 లక్షలు, పుంగనూరులో రూ.25.97 లక్షలు, ఐరాలలో రూ.23.14 లక్షలు, బంగారుపాళ్యంలో రూ.22.53 లక్షలు, తవణంపల్లిలో రూ.21.72 లక్షలు, గంగవరంలో రూ.21.58 లక్షలు, పలమనేరు మండలంలో రూ.19.14 లక్షలు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. అలాగే గుడిపల్లి, ఎస్ఆర్ పురం, పాలసముద్రం, యాదమరి, మీకోట మండలాల్లో కూడా లక్షల రూపాయల మేర నిధులు స్వాహా అయినట్లు నమోదైంది.
*44 మంది సిబ్బందిపై వేటు*
ఈ వ్యవహారానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. రామకుప్పం మండలంలోనే అత్యధికంగా 11 మంది సస్పెన్షన్‌కు గురికాగా, నిండ్రలో ఐదుగురు, గంగవరం మరియు కుప్పం మండలాల్లో నలుగురు చొప్పున, శాంతిపురంలో ముగ్గురు, గుడిపల్లి, నగరి, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి తదితర మండలాల్లో పలువురు సిబ్బంది సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాల్సిన పథకం ఇలా అక్రమాల ముఠాల చేతుల్లో బలైపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కఠిన చర్యలు తీసుకోకపోతే ఉపాధి హామీ పథకంపై ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

