పెన్షనర్లను వదలని సైబర్ మోసగాళ్లు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
సామాన్య ప్రజలే లక్ష్యంగా దూసుకెళ్తున్న సైబర్ మోసగాళ్లు ఇప్పుడు వృద్ధులు, పెన్షనర్లను కూడా వదలడం లేదు. ప్రభుత్వ పెన్షన్ పేరుతో ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా మోసాలకు పాల్పడుతూ అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్న ఘటనలు జిల్లాలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు పొందుతున్న వారే వీరి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు.
పెన్షన్ నిలిచిపోతుంది, ఆధార్ లింక్ కాలేదు, బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి, ఓటీపీ చెప్పాలి అంటూ భయపెట్టి వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. కొందరు తమను ప్రభుత్వ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, పెన్షన్ వాలంటీర్లమని చెప్పుకుంటూ పెన్షనర్లకు కాల్స్ చేసి ఆధార్ నంబర్లు, మొబైల్‌కు వచ్చిన ఓటీపీలను అడుగుతున్నారు. ఈ వివరాలు ఇచ్చిన వెంటనే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కొన్ని మండలాల్లో పెన్షనర్ల ఖాతాల నుంచి వేల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెన్షన్ సంబంధిత ఏ పనికైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ద్వారా ఓటీపీలు, బ్యాంకు వివరాలు అడగదని స్పష్టం చేశారు. పెన్షన్ ధృవీకరణ ప్రక్రియ పూర్తిగా అధికారిక విధానంలో, ప్రభుత్వ సిబ్బంది సమక్షంలో మాత్రమే జరుగుతుందని తెలిపారు. పెన్షనర్లు తమ ఆధార్, బ్యాంకు ఖాతా, ఓటీపీ వివరాలను ఎవరికీ చెప్పకూడదని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేసి, స్థానిక వాలంటీర్ లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అలాగే సైబర్ మోసాలకు గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం పెన్షన్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు బయోమెట్రిక్, ఓటీపీ ఆధారిత ధృవీకరణలను తీసుకువచ్చినా, అదే అవకాశంగా తీసుకుని మోసగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్ల అవగాహన పెరిగితేనే ఈ మోసాలకు అడ్డుకట్ట వేయగలమని తెలిపారు. వృద్ధులు, పెన్షనర్లు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ఆశలు లేదా భయాలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్నే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే జీవితాధారమైన పెన్షన్ సొమ్ము క్షణాల్లో చేతులారా పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

