ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు
బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు
మొబైల్ ఉంటే చాలు ఇంటి నుంచే లావాదేవీలు
మన డబ్బులు మన లెక్కలు పేరుతో ఏఐ యాప్
తొలుత 21 మండలాల్లో అమలు
(అర్థ ప్రభ బ్యూరో, చిత్తూరు.)
డ్వాక్రా మహిళల ఆర్థిక వ్యవస్థకు సరికొత్త దిశ చూపించే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. డ్వాక్రా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచడం, నిధుల గోల్‌మాల్‌కు అడ్డుకట్ట వేయడం, మహిళలకు తమ డబ్బుపై పూర్తి నియంత్రణ కల్పించడమే లక్ష్యంగా మన డబ్బులు మన లెక్కలు అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో ఇకపై డ్వాక్రా మహిళలు బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ పొదుపు, రుణాలు, వాయిదాలు, వడ్డీ వివరాలన్నింటినీ ఇంటి నుంచే మొబైల్‌లో తెలుసుకునే అవకాశం లభించనుంది. రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. జనవరి నుంచి మరో 19 మండలాల్లో అమలు చేయనున్నారు. మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని సమాఖ్యలను ఈ యాప్ పరిధిలోకి తీసుకొని వస్తారు.
ప్రస్తుతం ఈ యాప్‌ను యాదమరి, తవణంపల్లి మండలాల్లోని 10 గ్రామ సమాఖ్యలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. పైలట్ దశలో వచ్చిన అనుభవాల ఆధారంగా యాప్‌ను మరింత మెరుగుపరిచి, జనవరి నుండి జిల్లా వ్యాప్తంగా మరో 19 మండలాల్లోని డ్వాక్రా మహిళలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. డ్వాక్రా సంఘాల పనితీరులో ఇది ఒక చారిత్రక మలుపుగా ప్రభుత్వం భావిస్తోంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,247 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. వీటి పరిధిలో 34,923 స్వయం సహాయక సంఘాలు పనిచేస్తుండగా, వాటిలో 3,42,435 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సామాజిక పెట్టుబడి కింద రూ.13 కోట్లు అందజేయనున్నారు. వ్యవసాయం, చేపల పెంపకం, ఉద్యానవనాలు, కోళ్ల పెంపకం, సెరికల్చర్, తయారీ రంగాలు, సేవల రంగం, వ్యాపారం, భూముల కొనుగోలు, జిల్లా నిర్మాణం కోసం రూ.3,690 కోట్లు కేటాయించనున్నారు. గృహోపకరణాలు, వివాహాలు, విద్య అవసరాల కోసం రూ.5,430 కోట్లు మంజూరు చేయనున్నారు. బ్యాంకు లింకేజీ కింద జిల్లాలోని 1,531 సంఘాలకు రూ.1,998 కోట్లు అందజేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు చలామణి అవుతున్న నేపథ్యంలో, కొన్నిచోట్ల అక్రమాలు, అవకతవకలు, రికార్డు లోపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఎక్కడో ఒకచోట నిధుల గోల్‌మాల్ జరుగుతున్నా, రికవరీ తక్కువగా ఉండడం, కేసులు నమోదు కాకపోవడం వంటి సమస్యలు డ్వాక్రా వ్యవస్థను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితులకే చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా డ్వాక్రా సభ్యులు తమ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ను నేరుగా ఫోన్‌లోనే చూడవచ్చు. ఇకపై సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది లేదా బ్యాంకర్లపై ఆధారపడాల్సిన పని కూడా ఉండదు. ఒక్క క్లిక్‌తో సంఘం పేరు, సంఘం ఐడీ, సభ్యుల సంఖ్య, సభ్యుల పేర్లు, సభ్యురాలి పేరు, గుర్తింపు సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. సభ్యురాలు చేసిన పొదుపు, సంఘం మొత్తం పొదుపు వివరాలు కూడా యాప్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.
అలాగే సభ్యురాలు తీసుకున్న బ్యాంకు రుణం, స్త్రీనిధి రుణం, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సిఐఎఫ్), ఉన్నతి రుణం, అంతర్గత అప్పులు (డ్వాక్రా, వీవో) వంటి అన్ని రుణాల వివరాలు, తీసుకున్న తేదీతో సహా ఈ యాప్‌లో లభిస్తాయి. గత నెలలో ఎంత వాయిదా చెల్లించారు, ఇప్పటివరకు ఎన్ని వాయిదాలు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని వాయిదాలు మిగిలి ఉన్నాయి, మొత్తం ఎంత బాకీ ఉంది, నెలకు ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు అన్న సమాచారం కూడా స్పష్టంగా చూపిస్తుంది. చదువు లేని మహిళలు కూడా సులభంగా ఉపయోగించుకునేలా నోటితో అడిగితే సమాధానం వచ్చే విధంగా ఏఐ సాయంతో ఈ యాప్ రూపొందించబడింది. ఏవైనా తేడాలు, అనుమానాలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది. వచ్చిన ఫిర్యాదులను రాష్ట్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించి, వారం రోజుల్లోనే పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యాప్ వాడకంపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి సంఘంలో ఒక ‘ఈ-నారీ’ ప్రతినిధిని నియమించి డిజిటల్ అవగాహన కల్పించనున్నారు. డిజిటల్ పాలన దిశగా ఈ యాప్ ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు రెవెన్యూ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వ సేవలు ఇంటి గడపకే చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఆ దిశలోనే మన డబ్బులు–మన లెక్కలు యాప్ ఒక కీలక అడుగుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఈ లెక్కలన్నీ మాన్యువల్ విధానంలో నిర్వహించేవారు. ఇకపై మన డబ్బులు మన లెక్కలు ఏఐ యాప్‌తో డ్వాక్రా మహిళలు తమ ఆర్థిక లావాదేవీలన్నింటినీ డిజిటల్‌గా, పారదర్శకంగా, భద్రంగా నిర్వహించనున్నారు. డ్వాక్రా సంఘాల్లో జరుగుతున్న అవినీతి, అవకతవకలు, నిధుల స్వాహాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళా సాధికారతకు, డిజిటల్ పాలనకు ఒక బలమైన పునాది వేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పారదర్శకతను పెంపొందించడానికి : డిఆర్డిఎ పిడి
డ్వాక్రా సంఘాల ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతలు పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మన డబ్బులు మన లెక్కలు పేరుతో ఏఐ ఆధారిత యాప్ ని తీసుకుని వచ్చిందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీదేవి తెలిపారు. ఈ యాప్ కారణంగా లావాదేవీలన్నీ డిజిటల్ గా చేసుకోవచ్చన్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటివరకు ఎంత కట్టాము, ఇంకా ఎంత కట్టాలి అనే విషయాలను స్పష్టంగా యాప్ తెలుసుకోవచ్చని
పేర్కొన్నారు. ఈ యాప్ ను ప్రయోగ్రాత్మకంగా యాదమరి, తవణంపల్లి మండలాల్లో 10 గ్రామ సమాఖ్యలో అమలు చేశామన్నారు. జనవరి నెల నుంచి మరో 19 మండలాల్లో మూడవ వంతు గ్రామ సమైక్యాలలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో జిల్లాలోని అన్ని గ్రామసభకు విస్తరించడం జరుగుతుందని వివరించారు. ఈ యాప్ వినియోగం గురించి డ్వాక్రా మహిళలకు సిఆర్పిలు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఇందు నిమిత్తం ప్రతి 10 సంఘాలకు ఒక సిఆర్పిని ప్రత్యేకంగా నియమించనున్నట్లు చెప్పారు. మీరు, సంఘమిత్ర సమన్వయము చేసుకొని గ్రామ సమాఖ్య పరిధిలో సమర్థవంతంగా యాప్ వినియోగించుకోవడంలో సహకరిస్తారని డిఆర్డిఏ పిడి శ్రీదేవి వివరించారు.

