విశ్వవిజేత వివేకానందుడు.. యువతకు నిత్య స్ఫూర్తి
నేడు స్వామి వివేకానంద జయంతి
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
భారతదేశం యువ దేశం. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ వేగంగా ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది. ఏ దేశమైనా దాని భవిష్యత్తు యువత ఆలోచనలు, ఆశయాలు, వారి కార్యాచరణపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కీలక సమయంలో యువతకు ఒక దిక్సూచి, ఒక ప్రేరణ అవసరం. ఆ దిక్సూచి, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణకు ప్రతిరూపమే స్వామి వివేకానందుడు. శతాబ్దాల క్రితం ఆయన వెలిగించిన జ్ఞాన జ్యోతి నేటికీ దేశ యువతకు మార్గదర్శకంగా వెలుగుతోంది. నేడు స్వామి వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
1893లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో అమెరికా దేశపు సోదర సోదరీమణులారా! అంటూ వివేకానందుడు చేసిన ప్రసంగం భారతీయ ఆత్మగౌరవానికి చిహ్నంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆయన మాటలు రెండు నిమిషాల పాటు సభను కరతాళ ధ్వనులతో మార్మోగేలా చేశాయి. అప్పటివరకు పాశ్చాత్య దేశాల్లో భారతదేశాన్ని పేదరికం, అజ్ఞానం దేశంగా చూసిన దృక్పథం ఒక్క ప్రసంగంతోనే మారిపోయింది. హైందవ ధర్మం గొప్పతనాన్ని, భారతీయ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన తొలి యువ సన్యాసిగా వివేకానందుడు గుర్తింపు పొందారు. ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చని ఆయన జీవితం ద్వారా నిరూపించారు.
నేటి సమాజంలో యువత నిరుద్యోగం, పోటీ ప్రపంచం, మానసిక ఒత్తిళ్లతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చిన్న వైఫల్యాలకే నిరాశలో కూరుకుపోయే పరిస్థితులు పెరుగుతున్నాయి. కొందరు యువకులు జీవితంపైనే విరక్తి చెంది తీవ్ర నిర్ణయాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వేళ వివేకానందుడి మాటలు యువతకు సంజీవనిలా పనిచేస్తాయి. నీపై నీకు నమ్మకం లేకపోతే, భగవంతుడిని నమ్మినా ప్రయోజనం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని, మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయని ఆయన స్పష్టంగా వివరించారు. “బలమే జీవనం.. బలహీనతే మరణం” అన్న ఆయన సూక్తి యువత గుండెల్లో నాటుకోవాల్సిన సందేశం. ప్రస్తుత విద్యా విధానం ఎక్కువగా మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలకే పరిమితమై ఉంది. కానీ వివేకానందుడి దృష్టిలో విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు. విద్య అంటే మెదడులో కుక్కిన సమాచార రాశి కాదు. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే నిజమైన విద్య అని ఆయన చెప్పారు. నేటి సమాజంలో డిగ్రీలు ఉన్నా విలువలు, విచక్షణ, సామాజిక బాధ్యత లేని పరిస్థితి కనిపిస్తోంది. యువత కేవలం చదువుతోనే కాకుండా క్రీడలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన ద్వారా సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన బోధించారు. నాకు వందమంది యువకులను ఇవ్వండి.. ఈ దేశ రూపురేఖలను మార్చేస్తానన్న మాట ఆయనకు యువశక్తిపై ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనం.
స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల యుగంలో యువత ఏకాగ్రత కోల్పోతోంది. గమ్యంపై పూర్తి దృష్టి పెట్టలేక దారి తప్పుతోంది. దీనికి వివేకానందుడు చాలా ఏళ్ల క్రితమే పరిష్కారం చెప్పారు. ఒక లక్ష్యాన్ని తీసుకోండి. దానినే మీ జీవితం చేసుకోండి. మీ ఆలోచనలు, కలలు, శ్రమ అన్నీ దానికే అంకితం చేయండి. విజయానికి ఇదే మార్గం అని ఆయన యువతకు మార్గనిర్దేశం చేశారు. చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, క్రీడల్లోనైనా, వ్యాపారంలోనైనా ఏక లక్ష్యం ఉంటేనే విజయం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. వివేకానందుడు కేవలం వ్యక్తిగత మోక్షం కోసం ప్రయత్నించిన సన్యాసి కాదు. పేదల సేవలోనే దైవాన్ని చూసిన మహానుభావుడు. లక్షలాది ప్రజలు ఆకలితో, అజ్ఞానంతో బాధపడుతుంటే, వారి ఖర్చుతో చదువుకుని వారిని పట్టించుకోని ప్రతి విద్యావంతుడు ద్రోహి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతే నిజమైన దేశాభివృద్ధి అని ఆయన విశ్వసించారు. నేటి యువత తమ జ్ఞానాన్ని, శక్తిని, సంపదను సమాజ హితం కోసం వినియోగించాలని ఆయన సందేశం స్పష్టంగా చెబుతోంది.
లేవండి! మేల్కొనండి! గమ్యం చేరేవరకూ విశ్రమించకండి! అన్న వివేకానందుడి పిలుపు నేటికీ దేశ యువతను ఉత్తేజపరుస్తోంది. భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చే శక్తి యువతలోనే ఉందని ఆయన నమ్మకం. ఆ శక్తిని వెలికి తీయడమే స్వామి వివేకానందుడికి మనం అర్పించే నిజమైన నివాళి. ఆయన జయంతి నాడు పూలమాలలతో సరిపెట్టకుండా, ఆయన బోధించిన ధైర్యం, దేశభక్తి, సేవాభావాన్ని మన జీవితాల్లో అమలు చేయడమే అసలైన ఘనత. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగితేనే దేశానికి నిజమైన బలం చేకూరుతుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువతగా ఎదిగినప్పుడే వివేకానందుడు కలలు కన్న భవ్య భారతం సాకారమవుతుంది.

