28, జనవరి 2026, బుధవారం

కుప్పం చేరిన కృష్ణమ్మ చిత్తూరుకు వచ్చేనా ?

హంద్రీ నీవా నత్తనడక ఆవిరి అవుతున్న రైతుల ఆశలు 

హంద్రీ నీవా కాల్వలు ఉన్నాయ్ నీటి జడ లేదు

ఎన్టీఆర్ మానస పుత్రికగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టు 

ప్రపంచంలోనే అతి పొడవైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకం

చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల ఎకరాలకి సాగునీరు లక్ష్యం 

33 లక్షల మందికి తాగునీరు అందించాలన్న ప్రణాళిక 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

రాయలసీమ నుండి కరవును శాశ్వతంగా పారద్రోలాలన్న లక్ష్యంతో ప్రారంభించిన హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు చిత్తూరు జిల్లాకు ఇప్పటికీ పూర్తిస్థాయి ఫలితం ఇవ్వలేకపోతోంది. దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయలు ఖర్చయినా, ప్రధాన కాలువలు, బ్రాంచ్ కాలువలు తవ్వినా, రైతు పొలాలకు కృష్ణా నీరు చేరని పరిస్థితి కొనసాగుతోంది. శ్రీశైలం నీరు చిత్తూరు చేరాలన్న నినాదం నేటికీ రైతుల ఆశగానే మిగిలిపోయింది. ఈ ప్రాజెక్టుకు బీజం వేసింది ఎన్టీఆర్. ఆయన హయాంలో ఆయన మానస పుత్రికగా ప్రారంభమైంది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా దీన్ని వేగవంతం చేశారు. అంతకుముందే 1996–1999 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో సర్వేలు, సాంకేతిక అనుమతులు, ప్రణాళికలు సిద్ధమయ్యాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను కర్నూలు, అనంతపురం, కడప మీదుగా చిత్తూరు జిల్లాకు తరలించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రపంచంలోనే అతి పొడవైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టు, రాయలసీమ నాలుగు జిల్లాల్లో మొత్తం 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూపుదిద్దుకుంది. ఇందులో చిత్తూరు జిల్లాకు సుమారు 1.10 లక్షల ఎకరాల సాగునీటి వాటా ఉంది.

ప్రధాన కాలువ తవ్వకం దాదాపు 90 శాతం పూర్తయింది. శ్రీశైలం నుంచి కర్నూలు, అనంతపురం మీదుగా చిత్తూరు జిల్లా సరిహద్దుల వరకు ప్రధాన కాలువ సుమారు 430 కిలోమీటర్ల మేర తవ్వారు. చిత్తూరు జిల్లాలోనే సుమారు 110 నుంచి 120 కిలోమీటర్ల మేర మెయిన్ కెనాల్, బ్రాంచ్ కెనాళ్లు, ఫీడర్ ఛానెల్స్ పనులు పూర్తయ్యాయి. 2019 నాటికి చంద్రబాబు హయాంలో కుప్పం వరకు ప్రయోగాత్మకంగా నీటిని తీసుకువచ్చారు. అయితే ఈ నీరు ప్రధానంగా పరీక్షా ప్రయోగాలకే ఉపయోగపడింది. రైతు పొలాలకు నిరంతర సాగునీటి సరఫరా మాత్రం జరగలేదు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ నీవా ప్రాజెక్టుపై మొదట పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో బ్రాంచ్ కాలువలు, రిజర్వాయర్ల పనులు కొనసాగాయి. అధికారిక లెక్కల ప్రకారం 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర కాల్వల తవ్వకం, లైనింగ్ పనులు జరిగాయి. కుప్పం, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో కొన్ని బ్రాంచ్ కెనాళ్లను పూర్తి చేశారు. అలాగే, కొన్ని చెరువులకు హంద్రీ నీవా నీటిని పరీక్షాత్మకంగా మళ్లించారు. దీని వల్ల కొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు కొంత మేర మెరుగయ్యాయి. అయితే ఇది స్థిరమైన సాగునీటి పరిష్కారంగా మారలేదు.

సప్లై చానల్స్ నిర్మాణం ఎప్పుడు?

ఈ కాల్వలు ఇప్పటివరకు ప్రధానంగా చెరువులను నింపడానికి, కొన్ని ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు, భూగర్భ జలాల పెంపుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయానికి నిరంతర నీటి సరఫరా చేసే స్థాయికి మాత్రం వ్యవస్థ చేరలేదు. కారణం స్పష్టమే. అసలు కీలకమైన పిల్ల కాలువలు ఇంకా పూర్తికాలేదు. మెయిన్ కెనాల్ నుంచి రైతు పొలాల వరకు నీరు తీసుకెళ్లే డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, ఫీల్డ్ ఛానెల్స్ 40 నుంచి 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ప్రాజెక్టు ప్రారంభంలో 2005–06లో మొత్తం వ్యయం రూ. 6,850 కోట్లుగా అంచనా వేశారు. కాలక్రమేణా అంచనాలు పెరిగి ఇప్పుడు రూ. 16,000 కోట్లకు పైగా చేరాయి. ఇప్పటివరకు నాలుగు జిల్లాలకు కలిపి సుమారు రూ. 12,000 కోట్లకు పైగా ఖర్చయింది. ఇందులో చిత్తూరు జిల్లాకే వేల కోట్ల రూపాయలు వెచ్చించారు. కానీ ఇంత డబ్బు ఖర్చయినా రైతు పొలాలకు నీరు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. పనులు మందగించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి భూసేకరణ సమస్య. రిజర్వాయర్లు, పిల్ల కాలువల కోసం అవసరమైన భూముల సేకరణలో తీవ్ర జాప్యం జరిగింది. రైతుల నుంచి వ్యతిరేకత, కోర్టు కేసులు, పరిహారం విషయంలో వివాదాలు పనులను ఆపేశాయి. జగన్ పరిపాలనలో భూసేకరణకు సంబంధించి సుమారు రూ. 1,200 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పలమనేరు, పుంగనూరు, కుప్పం, నగరి నియోజకవర్గాల్లో వేలాది రైతులకు భూములు తీసుకున్నందుకు పరిహారం ఇచ్చారు. అయితే ఇంకా కొన్ని గ్రామాల్లో రైతులకు పూర్తిస్థాయి నష్టపరిహారం అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వాయర్ల కోసం భూములు ఇచ్చిన రైతులు, చెరువుల విస్తరణ వల్ల భూములు కోల్పోయిన రైతులు ఇంకా బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు.

అడ్డంకులు ఎన్నో!

కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం కూడా పనులు నిలిచిపోవడానికి కారణమైంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల బకాయిలు పెరిగాయి. వివిధ దశల్లో ప్రభుత్వం కొంత మొత్తాన్ని చెల్లించినా, ఇప్పటికీ సుమారు రూ. 400 నుంచి 600 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు సమాచారం. ఈ బకాయిల కారణంగా అనేక చోట్ల పనులు నత్తనడకన సాగాయి లేదా పూర్తిగా నిలిచిపోయాయి. అటవీ శాఖ అనుమతులు కూడా మరో అడ్డంకిగా మారాయి. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో కాల్వలు తవ్వేందుకు అనుమతులు రావడంలో ఆలస్యం జరిగింది. దీంతో కొన్ని కీలక ప్రాంతాల్లో కాల్వల తవ్వకం ఆగిపోయింది. ఈ కారణంగా నీటి ప్రవాహం పూర్తిస్థాయిలో చిత్తూరు జిల్లాలోకి చేరలేదు. సాగునీరు లేక చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు తీవ్రంగా పడిపోయాయి. 800 నుంచి 1000 అడుగుల బోర్లు వేసినా నీరు పడటం లేదు. వేరుశనగ, టమాటా, మామిడి తోటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయ కూలీలు, చిన్నకారు రైతులు ఉపాధి కోసం బెంగళూరు, చెన్నై, తిరుపతి వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. కాలువలు కనిపిస్తున్నాయి… నీరు కనిపించడంలేదన్న రైతుల మాటలు గ్రామగ్రామానా వినిపిస్తున్నాయి. ఆశలు మిగిలాయి, పంటలు ఎండిపోయాయి అన్న వేదన వారి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

జగన్ పాలనలో మందగవనం

వైఎస్ జగన్ పరిపాలనలో కొన్ని అభివృద్ధి పనులు జరిగినా, హంద్రీ నీవా ప్రాజెక్టు విషయంలో వేగం తక్కువగానే ఉందన్న విమర్శలు ఉన్నాయి. అధికారికంగా ప్రకటించినట్లుగా కొన్ని బ్రాంచ్ కెనాళ్లు, రిజర్వాయర్లు పూర్తయ్యాయి. కొన్ని చెరువులకు నీరు చేరింది. కానీ రైతులకు నిరంతర సాగునీటి సరఫరా జరిగే స్థాయికి ప్రాజెక్టు చేరలేదు. ఫలితంగా చిత్తూరు జిల్లా రైతాంగం ఇప్పటికీ వర్షాలపైనే ఆధారపడుతోంది. ప్రభుత్వాలు మారాయి. నినాదాలు మారాయి. హామీలు మారాయి. కానీ హంద్రీ నీవా సమస్య మాత్రం అలాగే ఉంది. ప్రతీ ఎన్నికల్లో నీళ్లు తెస్తామని హామీలు ఇస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక ఫైళ్లలోనే నీరు పారుతుంది. ఒకవైపు వేల కోట్ల ప్రాజెక్టు, మరోవైపు నీళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతు. ఈ విరుద్ధ దృశ్యమే చిత్తూరు జిల్లా పరిస్థితికి అద్దం పడుతోంది.

కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 

ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ నీవా ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా కుప్పం, పలమనేరు బ్రాంచ్ కెనాల్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనుల, లైనింగ్ పనులను పూర్తి చేసి కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకొచ్చారు. పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలలో ఈ నీటితో చెరువులను నింపుతున్నారు. కాంట్రాక్టర్ల బకాయిలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. భూసేకరణ సమస్యలు పరిష్కరించి, పిల్ల కాలువల పనులను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి చిత్తూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి నీరు అందించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీశైలం నీరు చిత్తూరు గడప చేరాలన్నది కేవలం రాజకీయ నినాదం కాదు. అది లక్షలాది రైతుల జీవితాల ప్రశ్న. భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి. రైతులకు మిగిలిన నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలి. కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే తీర్చాలి. పిల్ల కాలువల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. అప్పుడే హంద్రీ నీవా నిజంగా చిత్తూరు జిల్లాకు జీవనాధారంగా మారుతుంది. లేదంటే ఈ ప్రాజెక్టు మరో దశాబ్దం పాటు ఫైళ్లలోనే పారే నదిగా మిగిలిపోతుంది.


(రేపటి సంచికలో ..

వేగంగా జరుగుతున్న చిత్తూరు తాగునీటి పథకం పనులు)


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *