16, జనవరి 2026, శుక్రవారం

సంక్రాంతి పండుగ ముగింపే ముక్కనుమ

గ్రామీణ ప్రాంతాల్లో దూడల పండుగ 
పట్టణ వ్యాపారస్తులకు గోట్ 
కొనసాగనున్న జల్లికట్టు 
నేడే ముక్కనుమ పండగ

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

సంక్రాంతి సంబరాల్లో భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత మొక్కను మా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ఇలా జరుపుకోవాలని ఇదిమిద్దమైన ఆచార వ్యవహారాలు ఏమీ లేవు. గ్రామీణ ప్రాంతాల్లో దూడల పండుగగా జరుపుకుంటారు. ఈరోజు ఆవుల నుండి పాలన తీయరు. దూడలు కడుపు నిండా తాగడానికి వదిలిపెడతారు. పట్టణాలలో గోట్ గా ఈ పండుగను జరుపుకుంటారు. సంవత్సరం పొడవున్న వ్యాపారంతో బిజీగా ఉన్న వ్యాపారస్తుల కుటుంబాలు వనభోజనాలను చేసుకుంటారు. దుకాణాలన్నీ ఈరోజు ఉన్నత పడతాయి. పల్లెల్లో పశువులను తరమడం, జల్లికట్టు కొనసాగుతాయి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు కూడా మాంసాహారంతో విందు భోజనాలు చేసుకుంటారు.


ముక్కనుమను చిత్తూరు జిల్లాలో రైతులు దూడల పండుగ”గా పిలుచుకుంటారు. సాధారణ రోజుల్లో మన కోసం పాలిచ్చే గోమాతకు ఈ రోజు పూర్తిస్థాయి విశ్రాంతి ఇస్తారు. ముక్కనుమ రోజు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఆవుల నుంచి పాలను తీయరు. పొదుగులోని పాలన్నీ దూడలకే వదిలేస్తారు. తల్లి పాలతో కడుపునిండా తాగి దూడలు గంతులేయడాన్ని చూసి రైతులు మురిసిపోతారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని చాలా పాల డైరీలు, పాల సేకరణ కేంద్రాలు రేపు సెలవు ప్రకటించాయి. రైతులు కూడా స్వచ్ఛందంగా పాలను సరఫరా చేయడం మానేస్తారు. ఇది పశువుల పట్ల రైతుల కృతజ్ఞతకు ప్రతీకగా భావిస్తారు. వెటర్నరీ నిపుణుల ప్రకారం, దూడలకు ఇలా కడుపునిండా తల్లి పాలు ఇవ్వడం వల్ల కొలెస్ట్రమ్ ద్వారా సంపూర్ణ పోషకాలు అందుతాయి. ఇది దూడల రోగనిరోధక శక్తిని పెంచి, భవిష్యత్తులో అవి ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. అంటే ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాకుండా, శాస్త్రీయంగా కూడా ప్రయోజనకరమైన ఆచారమేనని స్పష్టం అవుతోంది. గత మూడు రోజులుగా భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా మాంసాహారానికి దూరంగా ఉన్న భోజన ప్రియులు, ముక్కనుమ విందు భోజనాలు చేసుకుంటారు. ఇప్పటికే నాటుకోళ్లు, పొట్టేళ్ల బుకింగ్స్ పూర్తయ్యాయి. చిత్తూరు టౌన్‌లోని  సంతపేట, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లి ప్రాంతాల్లోని మాంసం దుకాణాలు  ఉదయం నాలుగు గంటల నుంచే కిటకిటలాడుతాయి. జిల్లా ఫేమస్ డిష్ నాటుకోడి పులుసు, గారెలను అందరూ చేసుకుని ఆరగిస్తారు. కొత్త అల్లుళ్లకు, బంధువులకు అసలైన విందు భోజనం వడ్డించడం ముక్కనుమ ప్రత్యేకతగా కొనసాగుతోంది.

వ్యాపారస్తులకు ఆటవిడుపు 

సంవత్సరమంతా వ్యాపారాలతో బిజీగా ఉండే చిత్తూరు పట్టణ వ్యాపారులు, ముఖ్యంగా ఆర్యవైశ్యులు తమ దుకాణాలకు సంక్రాంతి సెలవును ప్రకటిస్తారు. చిత్తూరు పట్టణంలోని దాదాపు దుకాణాలన్నీ మూతబడుతాయి. ముక్కనుమను పట్టణాల్లో సరదాగా గోట్ అని పిలుస్తారు. ఉదయం నుంచే బోడికొండ, జింకల పార్కు, అటవీ ప్రాంతాల వైపు కుటుంబాలతో చేరుకుంటారు. అక్కడే వంటావార్పు చేసుకుని, ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో సాయంత్రం వరకు గడపడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. పిల్లలకు ఆటలు, మహిళలకు వంట పోటీలు, యువతకు క్రీడా కార్యక్రమాలతో ముక్కనుమ రోజంతా ఉత్సాహంగా సాగనుంది.

పశువులకు ఉప్పు చెక్క

ముక్కనుమ రోజు రైతులు అడవికి వెళ్లి నల్లేరు, మోదుగ పూలు వంటి ఔషధ గుణాలున్న వనమూలికలను సేకరిస్తారు. వీటిని ఉప్పుతో కలిపి దంచి ఉప్పు చెక్క తయారు చేస్తారు.  ఈ మిశ్రమాన్ని పశువులకు తినిపించడం ఆనవాయితీ. వర్షాకాలం, చలికాలంలో పచ్చిగడ్డి తినడం వల్ల పశువుల కడుపులో చేరే నులిపురుగులను చంపడానికి ఇది ఒక సహజమైన డీ-వార్మింగ్ మందుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ మిశ్రమం ఉపయోగపడుతుందని వారు వివరిస్తున్నారు. చంద్రగిరి, రంగంపేట, పాకాల, కుప్పం, ప్రాంతాల్లో పశువుల పండుగ (జల్లికట్టు తరహా కార్యక్రమాలు) జరగనున్నాయి. ఇప్పటికే కోడెగిత్తలను రంగులతో, పూలతో అలంకరించారు. యువకులు తమ పౌరుషాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఎద్దుల పరుగులు, వాటిని నిలువరించే పోటీలు గ్రామీణ యువతలో ధైర్యాన్ని, ఐక్యతను పెంచుతాయని పెద్దలు చెబుతున్నారు.

గ్రామదేవతలకు పూజలు

ముక్కనుమ రోజు జిల్లాలోని అనేక గ్రామాల్లో గంగమ్మ, కాటమరాజు, ఎల్లమ్మ వంటి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల కోళ్లు, పొట్టేళ్ల బలులు ఇచ్చే సంప్రదాయం కూడా కొనసాగుతోంది. గ్రామ రక్షణ, పంటల శుభఫలితాల కోసం ఈ ఆచారాలు నిర్వహిస్తారు. నగరి పట్టణంలో దేశమ్మ దేవత కొండచుట్టు ఉత్సవం ఘనంగా జరగనుంది. వేలాది మంది భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. మొత్తం మీద ముక్కనుమ సంప్రదాయం, సైన్స్, విందు, వినోదం కలగలిసిన ఒక మహా ఉత్సవం. ముక్కనుమతో సంక్రాంతి సంబరాలకు ఘనంగా తెరపడనుంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *