28, జనవరి 2026, బుధవారం

టిడిపి శ్రేణులలో చైతన్యం నింపిన యువగళం

పాదయాత్ర స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికలలో విజయ విహారం 
అడుగడుగున పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు 
40 రోజుల పాటు, 512.4 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర 
లోకేష్ యువగళం  పాదయాత్రకు మూడేళ్లు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

కుప్పం నేలపై వేసిన ఒక అడుగు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ వాతావరణాన్ని సమూలంగా మార్చివేసింది. పార్టీ క్యాడర్లో చైతన్యాన్ని నింపింది. ఆస్ఫూర్తితో అనంతరం జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేడర్ విజయ విహారం చేసింది. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, అడ్డంకులతో సాగిన యువగలం పాదయాత్ర నారా లోకేష్ ను రాటు తేదీన రాజకీయ నాయకుడిగా తీర్చి దిద్దింది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2023 జనవరి 27న ప్రారంభమై సుమారు 40 రోజుల పాటు, 512.4 కిలోమీటర్లు జిల్లాలో సాగి, ప్రజా సమస్యలు, రాజకీయ ప్రతిస్పందనలు, పోలీసు ఆంక్షలు, హామీల చర్చలతో నిండిన దీర్ఘ ప్రయాణంగా మారింది. చిత్తూరు జిల్లా, కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర మూడు సంవత్సరాలను పూర్తి చసుకుంది. ఈ యాత్ర కేవలం పార్టీ కార్యక్రమం కాదనే భావనను కలిగించేలా, ప్రతి గ్రామం, ప్రతి వర్గం సమస్యలను వేదికపైకి తెచ్చే ప్రయత్నంగా రూపుదిద్దుకుంది. 

యాత్ర ప్రారంభానికి ముందు కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం మొదలైంది. ముహూర్త సమయమైన ఉదయం 11:03 గంటలకు లోకేష్ తొలి అడుగు వేయడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది. ప్రారంభోత్సవం సాధారణ సభలా కాకుండా, భారీ బహిరంగ సభను తలపించేలా జరిగింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పసుపు జెండాలతో కిలోమీటర్ల మేర బారులు తీరగా, కుప్పం పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుని నందమూరి బాలకృష్ణ బైక్‌పై సభా ప్రాంగణానికి చేరుకోవడం అప్పట్లో విశేష చర్చకు దారితీసింది. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పూజల్లో పాల్గొని లోకేష్‌కు తిలకం దిద్ది యాత్రకు సాగనంపడం కుటుంబ మద్దతును స్పష్టంగా చూపించింది. చిన్న దేవాన్ష్ కూడా అక్కడ ఉండడం కార్యక్రమానికి భావోద్వేగ రంగు జోడించింది. యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దాదాపు 14 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగింది. కుప్పం నుంచి శాంతిపురం, పలమనేరు, చిత్తూరు నగరం, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగరి, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు వంటి ప్రాంతాల్లో యాత్ర సాగింది. ప్రతి చోట స్థానిక సమస్యలను వినిపించుకునే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. గ్రామాల్లో రైతులు సాగునీటి కష్టాలు, పట్టణాల్లో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల కొరత, చేనేత కార్మికులు విద్యుత్ చార్జీల భారంపై తమ బాధలను వెల్లడించారు. యాత్రలో భాగంగా లోకేష్ నేరుగా ప్రజలతో మాట్లాడి వినిపించుకోవడం ద్వారా నాయకత్వం ప్రజల మధ్యకే వస్తుందనే సందేశాన్ని ఇవ్వాలనే ప్రయత్నం కనిపించింది.

సమస్యలే  ప్రచార అస్త్రాలుగా ...

ఈ పాదయాత్రలో ప్రధానంగా నిరుద్యోగం, సాగునీరు, మౌలిక వసతులు, చేనేత రంగం సమస్యలు ప్రధాన అజెండాగా నిలిచాయి. బంగారుపాళ్యంలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కీలక హామీగా మారింది. తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేంద్రం ప్రారంభమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరి ప్రాంతాల్లో హ్యాండ్‌లూమ్ క్లస్టర్ల అభివృద్ధి, చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీలు కల్పించాలనే హామీలు కూడా యాత్రలో వినిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం నిరుద్యోగ యువతలో చర్చకు దారితీసింది. కుప్పం, చిత్తూరు పశ్చిమ మండలాలకు హంద్రీ–నీవా జలాలు పూర్తిస్థాయిలో అందిస్తామని చేసిన ప్రకటన రైతుల్లో ఆశలను రేకెత్తించింది. యాత్రకు రాష్ట్ర, జిల్లా స్థాయి టీడీపీ నాయకులు పలు దశల్లో మద్దతుగా నడిచారు. అచ్చెన్నాయుడు, అమరనాథ్ రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు పలు ప్రాంతాల్లో యాత్రలో పాల్గొన్నారు. స్థానిక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు భారీగా జనసమీకరణకు కృషి చేశారు. ఎన్ఆర్ఐ ప్రతినిధులు కూడా పాల్గొనడం ద్వారా యాత్రకు విస్తృత ప్రచారం లభించింది.

అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

అయితే యాత్ర మొత్తం కాలంలో పోలీసు ఆంక్షలు ప్రధాన వివాదాంశంగా నిలిచాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని సంసిరెడ్డిపల్లి వద్ద లోకేష్ ప్రసంగిస్తుండగా ఆయన చేతిలోని మైకును పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రసంగించడానికి ఉపయోగించిన చిన్న స్టూల్‌ను కూడా తొలగించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ లేకపోయినా లోకేష్ గొంతు పెంచి ప్రసంగించడం, రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ పోలీసులను ప్రశ్నించడం అప్పట్లో విస్తృతంగా ప్రచారం పొందింది. పలమనేరు, బంగారుపాళ్యంలో ప్రచార వాహనాలు, సౌండ్ సిస్టమ్‌లను నిబంధనల ఉల్లంఘన పేరుతో సీజ్ చేయడం యాత్ర నిర్వహణలో అంతరాయాన్ని కలిగించింది. కొన్ని చోట్ల భవనాలపై నుంచి ప్రసంగాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాత్ర కాలంలో చిత్తూరు జిల్లాలోనే సుమారు 22కి పైగా కేసులు నమోదయ్యాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు, అమరనాథ్ రెడ్డి, పులివర్తి నాని వంటి నేతలపై కూడా కేసులు నమోదు అయినట్లు సమాచారం. కొన్ని చోట్ల తోపులాటలు, బారికేడ్లు, రోప్‌లు కట్టి జనసందోహాన్ని నియంత్రించే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. కార్యకర్తలకు గాయాలైన ఘటనలు కూడా నమోదయ్యాయి. టీడీపీ దీనిని రాజకీయ ప్రతీకార చర్యలుగా అభివర్ణించగా, పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసం మాత్రమే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

40 రోజులు.. 512 కిలోమీటర్లు 

చిత్తూరు జిల్లాలో 40 రోజుల పాటు, 512.4 కిలోమీటర్లు జిల్లాలో సాగిన యువగళం పాదయాత్ర 13 మార్చి 2023న ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దులను దాటి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించడంతో జిల్లా దశ ముగిసింది. అయినప్పటికీ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కలిగించిన రాజకీయ చర్చలు, హామీలపై చర్చలు, పోలీసు ఆంక్షలపై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో సమస్యలను నేరుగా వినిపించుకునే కార్యక్రమంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన యాత్రగా, అదే సమయంలో రాజకీయ ఉద్రిక్తతలను పెంచిన ఘట్టంగా ఈ పాదయాత్ర గుర్తింపు పొందింది. కుప్పం నుంచి మొదలైన అడుగులు చిత్తూరు రాజకీయాల్లో దీర్ఘకాల ప్రభావం చూపాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గంగ 1 యువగళం పాదయాత్ర ఫైల్ పోటోలు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *