9, జనవరి 2026, శుక్రవారం

చిత్తూరు జిల్లాలో 11 మంది ఆర్ అండ్ బి ఇంజినీర్లపై వేటుకు రంగం సిద్ధం

మూడు నియోజకవర్గాలలో నాసిరకంగా రోడ్డు పనులు 
కల్లూరు రొంపిచర్ల రోడ్డులో 16 కిలోమీటర్లకు 32 కల్వర్టులు 
ఇందులో 12 అనవసరంగా కట్టారని విజిలెన్స్ నివేదిక 
గుత్తేదారి నుంచి రూ.97 లక్షల రికవరీకి ఆదేశాలు

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

గత ప్రభుత్వ పాలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్ల నిర్మాణం పేరుతో జరిగిన అక్రమాల గుట్టును కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా విప్పుతోంది. నిబంధనలు తుంగలో తొక్కి, నాసిరకం పనులతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన 11 మంది రోడ్లు భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) ఇంజినీర్లపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, పనులు చేయకుండానే బిల్లులు పొందిన కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.97 లక్షలను రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కల్లూరు రొంపిచర్ల 16 కిలోమీటర్ల రోడ్డులో 32 అలవాటలో నిర్మించినట్లు  విజిలెన్స్ నివేదికలో వెళ్లడయింది. ఇందులో 12 కల్వర్టులు అనవసరంగా నిర్మించాలని నివేదిక తెలిపింది. ఈ రోడ్ల నిర్మాణాలను పర్యవేక్షిచిన అంతా బాగుందని  ధ్రువీకరించిన ఆర్ అండ్ బి అధికారులకు ఇప్పటికే నోటీసులను జారీ చేశారు. త్వరలోనే వారి మీద వేటు వేయడానికి రంగం సిద్ధం అవుతుంది.


పుంగనూరు, పలమనేరు, పీలేరు నియోజకవర్గాల్లో గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆరు రహదారులు, ఒక వంతెనను విస్తరించారు. ఈ పనులకు మొదట రూ.154.40 కోట్లతో అంచనాలు రూపొందించగా, టెండర్లు రూ.123.19 కోట్లకు ఖరారయ్యాయి. అయితే, క్షేత్రస్థాయిలో పనులు జరిగిన తీరు చూస్తే నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, అవసరం లేని చోట్ల కల్వర్టులు నిర్మించి వ్యయాన్ని కృత్రిమంగా పెంచారని విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ అక్రమాలకు బాధ్యులుగా ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈలు), ఇద్దరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈలు), ఏడుగురు అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈలు) గుర్తించారు. వీరిలో ఐదుగురు అధికారులు పనులు తనిఖీ చేసి అంతా నాణ్యంగానే ఉంది అంటూ ధ్రువీకరించినట్టు రికార్డుల్లో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు మంజూరు చేయడమే కాకుండా, ఖజానాకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం వారిపై ప్రధాన ఆరోపణగా నిలిచింది. ఈ రహదారులు, వంతెన పనుల టెండర్లు జగన్‌కు సన్నిహితుడు, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు దక్కాయి. కానీ వాస్తవంగా పనులు చేసింది మాత్రం వైకాపాలోని ఓ కీలక నేతకు చెందిన సంస్థ అన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం టెండర్ పొందిన సంస్థే పనులు చేయాలి. కానీ ఇక్కడ ఆ నియమాన్ని పూర్తిగా విస్మరించారు. అవసరం లేకున్నా రోడ్లు విస్తరించారని, అంచనా వ్యయాన్ని గణనీయంగా పెంచారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయినా అధికారులు వాటిని పట్టించుకోలేదు. నాణ్యత నియంత్రణ (క్యూసీ) విభాగం కూడా అంతా బాగానే ఉంది అంటూ నివేదిక ఇచ్చి, కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేయించింది.

అవసరం లేని కల్వర్టులు 

పుంగనూరు, పులిచెర్ల, చిన్నగొట్టిగల్లు మార్గంలో కల్లూరు నుంచి రొంపిచెర్ల క్రాస్ వరకు కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఏకంగా 32 కల్వర్టులు నిర్మించారు. వీటిలో కనీసం 12 కల్వర్టులు పూర్తిగా అనవసరమని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. వర్షపు నీరు ప్రవహించే సహజ మార్గాలు లేని చోట్ల కూడా కల్వర్టులు వేయడం వెనుక  అంచనాలు పెంచి నిధులు దోచుకోవడం దీని వెనుక ఉద్దేశంగా భావిస్తున్నారు. ఈ కల్వర్టుల నిర్మాణంతో వ్యయం భారీగా పెరిగి, కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు అక్రమంగా లాభపడేలా చేశారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిగితే, ఇంకా పెద్ద దోపిడీ బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

నాసిరకం పనులని క్వాలిటీ కంట్రోల్ నివేదికలో వెల్లడి

విజిలెన్స్ ఆదేశాలతో క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలన చేపట్టింది. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో తీవ్ర లోపాలున్నాయని, తారు రోడ్లలో కూడా ప్రమాణాలు పాటించలేదని స్పష్టంచేసింది. ఈ నివేదిక ఆధారంగా మొత్తం రూ.97.03 లక్షలను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిమెంట్ రోడ్ల లోపాలపై రూ.53.86 లక్షలు, తారు రోడ్ల లోపాలపై రూ.25.81 లక్షలు, సిమెంట్ సంచుల బిల్లులపై రూ.17.10 లక్షలు రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా రూ.97.03 లక్షలు కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలైంది.

పెద్దాయన చెప్పిందే వేదం 

వైకాపా పాలనలో పెద్దాయన చెప్పిందే వేదంగా మారిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి, అధికారులు నిబంధనలను పక్కన పెట్టారు. ప్రజాధనం వృథా అవుతుందని తెలిసినా మౌనం పాటించారు. ఫలితంగా నాసిరకం రోడ్లు, అవసరం లేని కల్వర్టులు, కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పాత పాపాలను తవ్వి తీస్తూ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటోంది. 11 మంది ఇంజినీర్లపై క్రమశిక్షణ చర్యలు, కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తాల రికవరీ ఆ దిశలో తీసుకున్న తొలి అడుగులుగా ప్రభుత్వం పేర్కొంటోంది. చిత్తూరు జిల్లాలో రోడ్ల నిర్మాణం పేరుతో జరిగిన ఈ అక్రమాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. నాణ్యమైన మౌలిక వసతుల కోసం ఖర్చు చేసిన డబ్బు, కొందరి జేబుల్లోకి వెళ్లిపోయిందన్నది ఇప్పుడు స్పష్టమవుతోంది. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *