28, జనవరి 2026, బుధవారం

చిత్తూరుకు కేంద్రీయ విద్యాలయం మంజూరు

మంగసముద్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం 
వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం 
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల కృషి ఫలితం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర విద్యాలయ సంస్థ (కేంద్రీయ విద్యాలయ సంఘటన్) దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యాలయాల జాబితాలో ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం తో పాటు చిత్తూరు జిల్లా కేంద్రానికి కూడా ఒక కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు కృషి ఫలితంగా కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం జిల్లాకు శుభపరిణామం. ఈ విద్యాలయం మంగసముద్రం కేంద్రంగా ఏర్పాటుకానుండటంతో జిల్లాలో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర విద్యాలయ సంఘటన్ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి విడుదలైన ఉత్తర్వుల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 


2024 సాధారణ ఎన్నికల సమయంలో కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గురజాల జగన్మోహన్  చిత్తూరు నియోజకవర్గ కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆ హామీని అమలు దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన సంబంధిత కేంద్ర, రాష్ట్ర అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ పరిపాలనా అనుమతులు సాధించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. విద్యార్థులు త్వరగా లబ్ధి పొందేలా తరగతులు ప్రారంభం కావడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరంలో ఈ కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక ప్రాంగణంలో ప్రారంభం కానుంది. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక వసతుల్లోనే తరగతులు నిర్వహించనున్నారు. చిత్తూరు నగర పరిధిలోని ఇరువారం ప్రాంతంలో ఉన్న సెంట్రల్ సిల్క్ బోర్డు ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించేందుకు పరిపాలన అనుమతులు లభించినట్లు సమాచారం. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థులకు అనుకూల వాతావరణంలో బోధన ప్రారంభించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మొదటి దశలో బాలవాటిక 1 నుంచి 3 తరగతులు, అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధన నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. చిన్నారుల ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రారంభ దశను ప్రాథమిక స్థాయిలోనే ప్రారంభించనున్నారు. 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

మంగసముద్రంలో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. భూమి కేటాయింపు, నిర్మాణ ప్రణాళిక ఆమోదం వంటి ప్రక్రియలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి భవనం సిద్ధమైన తర్వాత ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా మైదానం వంటి సదుపాయాలతో విద్యాలయం అభివృద్ధి చెందనుంది. ఇది కేవలం ఒక పాఠశాల ప్రారంభం మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాల విద్యా ప్రమాణాలను పెంచే దిశగా పెద్ద అడుగుగా భావిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయినప్పటికీ స్థానిక విద్యార్థులకు కూడా సీట్ల పరిమితి మేరకు అవకాశాలు లభిస్తాయి. సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికలో చదవాలనుకునే చిత్తూరు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఇది ఒక ముఖ్యమైన అవకాశం కానుంది. పోటీ పరీక్షలు, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ విద్యా విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాల్లో బోధన, సమగ్ర పాఠ్య ప్రణాళిక, శాస్త్రీయ విద్యా విధానాలు కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకతలుగా గుర్తింపు పొందాయి.

చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పలు విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, కేంద్ర స్థాయి విద్య అందించే పాఠశాలల సంఖ్య పరిమితంగానే ఉంది. ఈ కొత్త కేంద్రీయ విద్యాలయం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న విద్యా అంతరాన్ని తగ్గించే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు. భూమి బదిలీ, మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్మాణ పనుల్లో సంబంధిత శాఖలు వేగంగా చర్యలు తీసుకుంటే విద్యాలయం కార్యకలాపాలు అనుకున్న సమయానికి ప్రారంభమై చిత్తూరు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడనుంది. మంగసముద్రం కేంద్రంగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కావడం చిత్తూరు విద్యా చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలవనుంది.

గంగ 2 కేంద్రీయ విద్యాలయం 
గంగ 3 చిత్తూరు ఎమ్మెల్యే

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *