చిత్తూరు జిల్లాలో నత్తనడకన రూ.591 కోట్ల ఆర్డీఎస్‌ఎస్ పనులు
2021లో ప్రారంభం… ఇప్పటికీ సగం కూడా పూర్తికాని వైనం
ఇళ్లకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటల కరెంటు హామీ కాగితాలకే పరిమితం…
ఫీడర్ల విభజన పేరుతో ఆలస్యం… నెరవేరని పథకం లక్ష్యం
(ఆంధ్రప్రభ బ్యూరో , చిత్తూరు.)
గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల, వ్యవసాయ రంగానికి 9 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలన్న మహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం (ఆర్డీఎస్‌ఎస్) చిత్తూరు జిల్లాలో మాత్రం నత్తనడక నడుస్తోంది. రూ.591 కోట్ల వ్యయంతో జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఈ కీలక పనులు 2021లో ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు సగం కూడా పూర్తికాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ మార్చి 31 నాటికి పనులు పూర్తిచేయాలని కేంద్రం గడువు నిర్దేశించినా, ప్రస్తుత పనుల వేగాన్ని చూస్తే ఆ గడువులో పూర్తి కావడం సందేహంగానే కనిపిస్తోంది. ఆర్డీఎస్‌ఎస్ పథకం కింద చిత్తూరు జిల్లాలో గృహ అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు వేర్వేరుగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంతాలకు కూడా పట్టణాలకు సమానంగా 24 గంటల విద్యుత్ అందించాలన్నది ప్రధాన లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికీ అనేక గ్రామాల్లో సింగిల్ ఫేజ్ విద్యుత్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఒక చోట అంతరాయం ఏర్పడితే మొత్తం గ్రామం చీకట్లో మునిగిపోతోంది. దీని వల్ల గృహ వినియోగదారులే కాకుండా చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, రైస్‌మిల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రైతులు సాగునీటి పంపుసెట్లు నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాలో స్థిరత్వం లేకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది.
ట్రాన్స్‌కో అధికారుల లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో ఆర్డీఎస్‌ఎస్ పథకం కింద మొత్తం 591 కోట్ల రూపాయల పనులు చేపట్టగా ఇప్పటివరకు కేవలం 108 కోట్ల రూపాయల మేర మాత్రమే వ్యయం చేశారు. అంటే సుమారు 30–35 శాతం పనులే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఇంకా ప్రారంభ దశలో లేదా మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. గృహ, వ్యవసాయ ఫీడర్ల విభజన, త్రీఫేజ్ విద్యుత్ సరఫరా, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, సబ్‌స్టేషన్ల సామర్థ్య పెంపు వంటి కీలక పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. జిల్లాలో మొత్తం 224 సబ్‌స్టేషన్లు ఉండగా పట్టణ ప్రాంతాలను మినహాయిస్తే 190 సబ్‌స్టేషన్ల పరిధిలో ఈ పథకం పనులు జరగాల్సి ఉంది. 427 ఫీడర్లలో పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నా, వాస్తవంగా పూర్తయిన ఫీడర్లు చాలా తక్కువగా ఉన్నాయి. కొత్తగా 288 వంద కేవీఏ, 381 అరవై మూడు కేవీఏ, 516 ఇరవై ఐదు కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. ఇందుకోసం కొత్తగా 30 వేల విద్యుత్ స్తంభాలు తెప్పించినా, వాటి వినియోగం పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఆర్డీఎస్‌ఎస్ పథకం కింద చిత్తూరు నియోజకవర్గానికి 44 కోట్లు, గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి 115 కోట్లు, నగరి నియోజకవర్గానికి 144 కోట్లు, పలమనేరు నియోజకవర్గానికి 77 కోట్లు, పుంగనూరు నియోజకవర్గానికి 178 కోట్లు, పూతలపట్టు నియోజకవర్గానికి 37 కోట్లు కేటాయించారు. ఆరు నియోజకవర్గాల్లో ఒకేసారి పనులు సాగాల్సి ఉండగా, చాలా మండలాల్లో పనులు అర్థాంతరంగా నిలిచిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా వ్యవసాయ ఫీడర్ల విభజన విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో సుమారు 890 వ్యవసాయ ఫీడర్లను వేరు చేయాలని నిర్ణయించి సర్వే పూర్తి చేశారు. అయితే ఇప్పటివరకు 575 ఫీడర్ల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటిలో పూర్తిగా ముగిసినవి కేవలం 291 ఫీడర్లే. మిగిలిన 285 ఫీడర్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రారంభమైన ఫీడర్లలో కూడా చాలా చోట్ల పనులు నత్తనడకనే సాగుతున్నాయి. 2021లో ప్రారంభమైన ఈ పనులు ఇప్పటికీ 50 శాతం కూడా పూర్తి కాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పనుల ఆలస్యానికి కార్మికుల కొరత కారణమని అధికారులు వివరణ ఇస్తున్నా, ఇది పూర్తిస్థాయి సమాధానం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఇదే పథకం అమలవుతున్నా, ఇతర రాష్ట్రాల్లో పనులు వేగంగా సాగుతున్న ఉదాహరణలు ఉన్నాయి. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ లోపం, పనులపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు భారీ ఊతం లభిస్తుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పిండి మిషన్లు, రైస్‌మిల్లులు నిరంతర విద్యుత్‌తో సజావుగా నడిచే అవకాశం ఉంటుంది. గృహ వినియోగదారులకు కూడా అంతరాయాలు లేకుండా 24 గంటల విద్యుత్ అందుతుంది. కానీ పనుల ఆలస్యం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. భారత ప్రభుత్వం 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరిస్తున్న ఈ పథకం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాల్సి ఉండగా, అధికారుల నిర్లక్ష్యం వల్ల అది అర్ధాంతరంగా నిలిచిపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి, నెలవారీ లక్ష్యాలు నిర్దేశించి, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆర్డీఎస్‌ఎస్ పథకం ఉద్దేశమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
ఎస్.ఈ. ఇస్మాయిల్ అహ్మద్ వివరణ
ఈ విషయమై ట్రాన్స్‌కో చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.కె. ఇస్మాయిల్ అహ్మద్ మాట్లాడుతూ…
ఆర్డీఎస్‌ఎస్ పథకం కింద జిల్లాలో భారీ స్థాయిలో పనులు చేపట్టాం. ఇప్పటివరకు సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికుల కొరత, ఒకేసారి దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు కావడం వల్ల కొంత జాప్యం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన గడువు మేరకు మార్చి 31 నాటికి పనులు పూర్తిచేసి గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

