8, జనవరి 2026, గురువారం

చిత్తూరులో ఏనుగు భయం.. రైతాంగానికి కంటిమీద కునుకు లేదు

2025లో పెరిగిన దాడులు – 9 మంది మృతి, వేల ఎకరాల్లో పంట నష్టం

కుప్పం–పలమనేరు–పుంగనూరు అటవీ అంచుల్లో తీవ్రత

నివారణకు 36 కిలోమీటర్ల హ్యాంగింగ్ సౌర ఫెన్సింగ్‌కు ప్రతిపాదనలు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :
చిత్తూరు జిల్లా రైతాంగాన్ని ఏనుగుల భయం వణికిస్తోంది. అడవులు–వ్యవసాయ భూముల సరిహద్దుల్లో మానవ–వన్యప్రాణి సంఘర్షణ రోజురోజుకీ తీవ్రమవుతూ, 2025లో జిల్లావ్యాప్తంగా రైతుల ప్రాణాలు, పంటలు ఏనుగుల దాడుల్లో తీవ్రంగా నష్టపోయాయి. కుప్పం, పలమనేరు, పుంగనూరు, సోమల, ఐరాల మండలాల అటవీ అంచుల్లో ఏనుగుల కదలికలు పెరగడంతో రైతులకు రాత్రింబవళ్లు కాపలే తప్పనిసరిగా మారింది. అయినా, పొలాల వద్ద నిద్రిస్తున్న వేళల్లో, పంటలకు కాపలా కాస్తున్న సమయంలో జరిగిన ఆకస్మిక దాడుల్లో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

అటవీ శాఖ గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో ఏనుగుల దాడుల్లో 9 మంది మృతి, 6 మంది తీవ్రంగా గాయాలు, సుమారు 1,500 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. మామిడి తోటలు, వరి, టమోటా, రాగి, ఆకుకూరలు నాశనం కావడంతో రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. మృతి చెందినవారిలో ఎక్కువమంది రైతులు, పశువుల కాపరులే కావడం గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళనను పెంచింది.

కౌండిన్య అభయారణ్యం పరిసరాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అడవుల్లో ఆహారం, నీటి వనరుల కొరత, ఏనుగుల కారిడార్ల తెగిపోవడం, వ్యవసాయ భూముల విస్తరణ, వాతావరణ మార్పుల ప్రభావంతో ఏనుగులు గ్రామాల వైపు దూసుకొస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా కుప్పం, పలమనేరు, పుంగనూరు, బంగారుపాళ్యం, గంగవరం, రామకుప్పం, వి.కోట, సదుం మండలాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.

2025లో చోటుచేసుకున్న ఘటనలు జిల్లాను కుదిపేశాయి. నవంబర్‌లో కుప్పం మండలం కుర్మనపల్లి గ్రామంలో 65 ఏళ్ల రైతు కిట్టప్ప రాగి పంటకు కాపలా కాస్తూ పొలంలో నిద్రిస్తున్న సమయంలో ఒంటరి ఏనుగు దాడిలో మృతి చెందాడు. జూలైలో సోమల మండలం కోటూరు గ్రామంలో రాత్రి వేళ పొలానికి వెళ్లిన 55 ఏళ్ల రైతు రామకృష్ణ రాజుపై 16 ఏనుగుల గుంపు దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జూన్‌లో ఐరాల మండలం నాగమండ్లపల్లిలో 60 ఏళ్ల రైతు ఎస్. గణపతి మృతి చెందగా, సెప్టెంబర్‌లో పలమనేరు ప్రాంతంలో ఏనుగు జనావాసాల్లోకి చొరబడి అటవీ అధికారి, ట్రాకర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ వరుస ఘటనలు మానవ–ఏనుగు సంఘర్షణ తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అటవీ శాఖ, పోలీస్ శాఖలు అప్రమత్తమయ్యాయి. ఏనుగుల కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ బృందాలు, కెమెరా ట్రాప్‌లు, సెన్సార్లతో కూడిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అమల్లోకి తెచ్చారు. అయినప్పటికీ రైతులు కోరుకుంటున్నది శాశ్వత పరిష్కారమే.

అందుకే పలమనేరు అటవీ పరిధిలో 36 కిలోమీటర్ల అదనపు హ్యాంగింగ్ సౌర విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే పలమనేరు బీట్‌లో 4 కి.మీ., కలువపల్లి బీట్‌లో 3 కి.మీ., నెల్లిపట్ల బీట్‌లో 1.20 కి.మీ., కలువపల్లి బీట్‌లో మరో 5.50 కి.మీ., ఎం.కోటూరు బీట్‌లో 5 కి.మీ. మేర ఫెన్సింగ్ పనులు పూర్తయ్యాయి. వీటి వల్ల గ్రామాల్లోకి వన్యప్రాణుల రాక గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో మరో 4 కి.మీ. పనులకు ఈ-టెండర్ ద్వారా త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. మొత్తం 36 కి.మీ. పనులకు ఆమోదం లభించగానే వేగంగా పూర్తి చేసి, సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సౌరశక్తితో పనిచేసే తక్కువ వోల్టేజీ విద్యుత్ కంచె. గాల్వనైజ్డ్ ఇనుముతో తయారయ్యే ఈ వ్యవస్థ సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చి, ‘సోలార్ జట్కా మెషిన్’ ద్వారా కంచె తీగలకు పంపిస్తుంది. ఏనుగు లేదా ఇతర జంతువు తగిలినప్పుడు సుమారు 10,000 వోల్ట్ తక్కువ శక్తి షాక్ ఇస్తూ భయపెడుతుంది; ప్రాణాపాయం ఉండదు. కోతులు, పందులు, ఏనుగుల నుంచి పంటలను కాపాడడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తోంది. బయటి విద్యుత్ అవసరం లేకపోవడం, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడం, పర్యావరణానికి హానికరం కాకపోవడం దీని ప్రత్యేకత.

ఏనుగుల దాడుల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించినా, ప్రాణనష్టం తిరిగి పూడ్చలేనిదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో ఆహారం, నీటి వనరులు పెంచడం, ఏనుగుల కారిడార్ల పునరుద్ధరణ, వ్యవసాయ–అటవీ సరిహద్దుల్లో విస్తృతంగా ఫెన్సింగ్ ఏర్పాటు వంటి చర్యలు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు.

ఒకవైపు పంట నష్టం, మరోవైపు ప్రాణభయం… చిత్తూరు రైతాంగాన్ని వెంటాడుతున్న ఈ సంక్షోభానికి ప్రతిపాదిత హ్యాంగింగ్ సౌర ఫెన్సింగ్ పనులు వేగంగా పూర్తై శాశ్వత ఉపశమనం కలిగిస్తాయన్న ఆశతో జిల్లా మొత్తం ఎదురుచూస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *