సంక్రాంతి సంబరాలకు ముస్తాబైన పల్లెసీమలు
జల్లికట్టు జోరు.. పితృదేవతల పూజలు.. కోడి పందేల హడావుడి!
నగరాల నుంచి ఊళ్లకు తరలిన ఉద్యోగులు, వ్యాపారులు
బంధుమిత్రులతో కళకళలాడుతున్న గ్రామాలు
వెలవెల పోతున్న పట్టణాలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
సంక్రాంతి పండుగ రాకతో చిత్తూరు జిల్లా పల్లెసీమలు సంబరాల కాంతులతో ముస్తాబయ్యాయి. జల్లికట్టు తరహా పశుపోటీలు, పితృదేవతల పూజలు, కోడి పందేల హడావుడితో గ్రామాలు జాతరను తలపిస్తున్నాయి. నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల్లో నిమగ్నమైన వేలాది మంది సొంతూళ్లకు తరలిరావడంతో పల్లెల్లో పండుగ సందడి రెట్టింపైంది. బంధుమిత్రుల కలయికతో ప్రతి ఇంటా నవ్వులు, సంభాషణలు, విందులతో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. మరోవైపు జనసంచారం తగ్గడంతో పట్టణాలు వెలవెలబోతున్నాయి. సంప్రదాయం, సంస్కృతి, కుటుంబ బంధాల మేళవింపుతో పెద్ద పండుగ చిత్తూరు జిల్లాలో ఘనంగా జరగనుంది.
హేమంత రుతువులో మంచు దుప్పట్లు కప్పుకున్న ప్రకృతికి, కొత్త వెలుగులు అద్దుతూ వచ్చేదే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం, హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. రైతుల గాదెలు నిండే ఈ కాలం, కుటుంబాల గడపల్లో ఆనందం నింపే పండుగగా నిలుస్తుంది. చిత్తూరు జిల్లాలో ఈ పండుగను కేవలం ఒక పర్వదినంగా కాదు, ఒక జీవన శైలిగా, ఒక సంస్కృతిగా, ఒక సంప్రదాయంగా భావించి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని ఇక్కడి ప్రజలు ప్రేమగా పెద్ద పండుగగా పిలుస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజుల పాటు సాగిపోయే ఈ పండుగలో ప్రతి రోజుకూ ప్రత్యేకత ఉంది. భోగి నాడు పాత వాటిని విడిచి కొత్తదానికి స్వాగతం పలుకుతారు. ఇంటి ముందర పెద్ద భోగి మంటలు వేసి, చెత్త చెదారం కాల్చి, దుష్టశక్తులను దూరం చేస్తారన్న నమ్మకంతో పల్లెలు పొగమంచుతో నిండిపోతాయి. మరుసటి రోజు సంక్రాంతి పండుగ. ఇంటింటా ముగ్గులు, రంగవల్లులు, గోబ్బిళ్లు, మామిడాకులు, పూలతో అలంకరించిన గడపలు, కొత్త బట్టల సందడి కనిపిస్తుంది. ఆపై వచ్చే కనుమ పశువుల పండుగ. ఎద్దులు, ఆవులను స్నానం చేయించి, పసుపు, కుంకుమతో అలంకరించి, పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు ముక్కనుమతో పండుగ ముగింపు పలుకుతుంది.
జిల్లాలో పండుగ ప్రత్యేకతలు ఎన్నో !
చిత్తూరు జిల్లా భౌగోళికంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో ఇక్కడి సంక్రాంతి సంస్కృతికి ప్రత్యేక రంగు అద్దుకుంటుంది. తెలుగు సంప్రదాయంతో పాటు పొరుగు రాష్ట్రాల ఆచారాలు మిళితమై పండుగ శోభను రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో జల్లికట్టు తరహా పశుపోటీలకు ప్రాధాన్యం ఇస్తారు. చంద్రగిరి, నగరి, కుప్పం, పలమనేరు, నగరి, పుత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో యువకులు ఎద్దులను అలంకరించి పరుగు పెట్టించడం, వాటి కొమ్ములను పట్టుకుని నిలువరించేందుకు ప్రయత్నించడం చూస్తే, రైతు జీవనశైలి, పశువుల పట్ల ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఆట కాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఆరుగాలం కష్టపడి పండించిన పంట గాదెల్లో చేరే సమయం ఇదే. కొత్త బియ్యం, కొత్త బెల్లం, కొత్త పంటతో చేసిన పిండివంటల రుచే వేరు. అరిసెలు, పొంగలి, బూరెలు, సకినాలు, గారెలు, పాయసం… ఇలా ఇంటింటా ఘుమఘుమలాడే వంటకాల సువాసనతో పల్లెలు పరవళ్లు తొక్కుతాయి. రైతు కష్టానికి ఫలితం దక్కిన సంతోషం ఈ పండుగలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఉత్తరాయణ పుణ్య కాలం
ఆధ్యాత్మికంగా కూడా ఉత్తరాయణ కాలానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మహాభారతంలో భీష్మాచార్యుడు అంపశయ్యపై ఉన్నప్పటికీ, ఈ పుణ్యకాలం వచ్చే వరకూ ప్రాణాలు విడిచిపెట్టలేదన్న కథ ప్రసిద్ధి. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం లభిస్తుందన్న నమ్మకం ఇప్పటికీ ప్రజల్లో బలంగా ఉంది. అలాగే సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్లే రోజుగా ఈ పండుగను భావిస్తారు. తండ్రీకొడుకుల మధ్య ఉన్న విభేదాలు తొలగి, ప్రేమానురాగాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. అందుకే సంక్రాంతి నాడు కుటుంబ కలయికకు, పెద్దల ఆశీర్వాదాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. చిత్తూరు జిల్లాలో మరో ప్రత్యేక సంప్రదాయం పితృదేవతల పూజ. కనుమ రోజు లేదా మరుసటి రోజు, గతించిన తల్లిదండ్రులు, పూర్వీకులను తలుచుకుని వారికి కొత్త బట్టలు పెడుతారు. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి, ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడతారు. పూర్వీకుల ఆశీస్సులతోనే వంశం వృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. సంక్రాంతి అంటే కేవలం పూజలు, వంటకాలే కాదు… వినోదం కూడా అంతే ముఖ్యమైన భాగం. చిత్తూరు జిల్లా పల్లెల్లో మామిడి తోపుల్లో, కొబ్బరి తోటల్లో కోడి పందేలు నిర్వహించడం పరిపాటిగా మారింది. అధికారికంగా నిషేధం ఉన్నా, సంప్రదాయం పేరుతో రహస్యంగా ఈ పందేలు కొనసాగుతూనే ఉంటాయి. పండుగ మూడు రోజులూ భారీగా నగదు చేతులు మారుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇది గ్రామీణ వినోద సంస్కృతిలో భాగంగా మారిపోయింది.
సొంతూళ్లకు బారులు తీరిన వాహనాలు
నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం స్థిరపడిన వేలాది మంది యువత సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల నుంచి బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. నిన్నటి వరకు నిశబ్దంగా ఉన్న పల్లెలు, నేడు బంధువుల రాకతో, పిల్లల ఆటపాటలతో, పలకరింపులతో కళకళలాడుతున్నాయి. పెద్దలు పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ, చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ, యువత ఆటలతో పండుగను ఆస్వాదిస్తోంది. ఆధునిక జీవనశైలి పెరుగుతున్నా, చిత్తూరు జిల్లా ప్రజలు మాత్రం తమ మూలాలను మర్చిపోకుండా సంక్రాంతిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం విశేషం. పండుగ అంటే ఖర్చు, హడావుడి మాత్రమే కాదు… కుటుంబ బంధాలు, పెద్దల గౌరవం, ప్రకృతితో అనుబంధం, రైతు కష్టానికి గౌరవం అన్న భావనను ఈ పెద్ద పండుగ ప్రతి ఇంటికి గుర్తు చేస్తోంది.

