పెళ్లి సమస్యలపై కలికిరిపల్లి యువకుల వినూత్న నిరసన
పశువుల పండుగలో ‘వధువు కావలెను’ బ్యానర్‌తో సామాజిక సందేశం
(చిత్తూరు – ఆంధ్రప్రభ బ్యూరో)
నేటి కాలంలో యువకులకు పెళ్లిళ్లు కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామానికి చెందిన యువకులు తమ సమస్యను వినూత్న రీతిలో ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. సంక్రాంతి పండుగలో భాగంగా నిర్వహించిన పశువుల పండుగ సందర్భంగా, పెళ్లికాని యువకుల ఫోటోలతో కూడిన భారీ బ్యానర్‌ను గ్రామస్థులు ప్రదర్శించారు. ఈ బ్యానర్ ఇప్పుడు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.పశువుల పండుగలో గిత్తల పరుగు ఎంత ఉత్సాహంగా ఉంటుందో, కలికిరిపల్లి యువకుల ఈ వధువు కావలెను బ్యానర్ అంతే ఉత్సాహంగా ఇప్పుడు జిల్లా అంతటా చర్చకు దారి తీసింది. నవ్వులు పూయించడంతో పాటు, వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలపై ఆలోచించేందుకు కూడా ఈ కార్యక్రమం అవకాశం కల్పించిందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
గ్రామంలోని దాదాపు ముప్పై మందికి పైగా పెళ్లికాని యువకుల చిత్రాలను ఒకే బ్యానర్‌పై ముద్రించి,
ముఖ్య గమనిక: మా స్టార్ యువకులకు వధువు కావలెను అనే శీర్షికతో ఊరి నడిబొడ్డున భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సాధారణంగా పశువుల పండుగ అంటే గిత్తల పరుగు, ఆటపాటలు, ఉత్సవ వాతావరణమే ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈసారి కలికిరిపల్లి గ్రామంలో పండుగ సందడికి తోడు యువకుల పెళ్లి సమస్యలపై ఈ బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్లెక్సీ చూసిన గ్రామస్తులు, బంధువులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత నవ్వులు ఆపుకోలేకపోయారు. సరదాగా కనిపించిన ఈ ప్రయత్నం వెనుక మాత్రం యువకుల నిజమైన ఆవేదన దాగి ఉందని పలువురు పేర్కొన్నారు. గ్రామ యువకుల మాటల్లో చెప్పాలంటే, చదువు పూర్తయ్యి ఉద్యోగాలు ఉన్నప్పటికీ, వివాహానికి సంబంధించిన సంబంధాలు కుదరడం లేదని వారు తెలిపారు. పెళ్లి సంబంధం వచ్చిన ప్రతిసారి జీతం, ఆస్తులు, వాహనాలు, ఇల్లు వంటి ఆర్థిక అంశాలే ప్రధానంగా పరిశీలించబడుతున్నాయని, వ్యక్తిత్వం, గుణగణాలు, బాధ్యతాభావం వంటి అంశాలకు ప్రాధాన్యం తగ్గిపోయిందని వారు వాపోయారు. కొంతమంది యువకులు ఇప్పటికే ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఒక సంబంధం వచ్చినా ఏదో ఒక కారణంతో తిరస్కరణ ఎదురవుతోందని చెప్పారు.జీతం ఇంకా పెరగాలి, ఆస్తి తక్కువ, ఇల్లు లేదు, కారు లేదు వంటి కారణాలతో సంబంధాలు ఆగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల యువకుల్లో నిరాశ పెరుగుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఫ్లెక్సీలో ఉన్న యువకులంతా చదువుకున్నవారని, కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు ఇతర రంగాల్లో స్థిరపడినవారని చెప్పారు. అయినా పెళ్లి విషయంలో మాత్రం అబ్బాయికి కారు ఉందా, ఇల్లు ఉందా, ఆస్తి ఎంత అనే ప్రశ్నలతోనే సంబంధాలు మొదలవుతున్నాయని వాపోయారు. మనిషి గుణగణాల కంటే ఆస్తులకే ఎక్కువ విలువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి సంబంధాల విషయంలో కట్నం, ఆర్భాటాలు, ఖరీదైన ఏర్పాట్లు వంటి డిమాండ్లు పెరుగుతున్నాయని, ఇవి సాధారణ కుటుంబాల యువకులకు భారంగా మారుతున్నాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. పెళ్లి అంటే ఆనందంగా జరగాల్సిన ఒక సామాజిక కార్యక్రమం, కానీ ఇప్పుడు అది ఆర్థిక భారంగా మారిందని వారు వ్యాఖ్యానించారు. ఈ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే కలికిరిపల్లి యువకులు ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పండుగ వాతావరణాన్ని ఒక వేదికగా తీసుకుని, తమ సమస్యను సరదాగా కానీ స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్‌ను ప్రదర్శించారు. కేవలం అమ్మాయిల తల్లిదండ్రులకే కాదు, అధిక కట్నాలు ఆశించే అబ్బాయిల తల్లిదండ్రులకు కూడా ఈ బ్యానర్ ఒక హెచ్చరికగా మారింది. పెళ్లి కూతురుపై కోటి ఆశలు, సవాలక్ష షరతులు విధిస్తే, భవిష్యత్తులో తమ ఫోటోలు కూడా ఇలాగే బ్యానర్లలో కనిపించే పరిస్థితి రావచ్చని యువకులు చురకలు అంటించారు.
ఇక్కడే సర్దుకుపోకపోతే, రేపు వేరే రాష్ట్రాలకు వెళ్లి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అంటూ బ్యాచిలర్స్ పంపుతున్న సందేశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గ్రామ పెద్దలు మరో విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. పెళ్లి సంబంధాల్లో కేవలం డబ్బు, ఆస్తులకే ప్రాధాన్యం ఇవ్వకుండా, వ్యక్తిత్వం, కుటుంబ విలువలు, బాధ్యతాభావం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పెళ్లిని వ్యాపారంలా కాకుండా, జీవిత భాగస్వామ్యంగా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కనుమ పండుగ సందర్భంగా ప్రదర్శించిన ఈ బ్యానర్ సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందింది. పలువురు యువకులు మా ఊర్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలి అంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఇది సరదా మాత్రమే కాదు, ఒక సామాజిక సమస్యను చూపించే ప్రయత్నం అంటూ ప్రశంసలు తెలిపారు. నేటి సమాజంలో పెళ్లి వయసు దాటిపోతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. తగిన జోడీ దొరకడం కష్టమవుతోంది. దొరికినా అనేక షరతులు, డిమాండ్లు, ఆశలు అడ్డంకులుగా మారుతున్నాయి. ఈ సమస్యను ప్రశ్నించేందుకే కలికిరిపల్లి గ్రామస్తులు ఈ వినూత్న ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు.

