20, జనవరి 2026, మంగళవారం

పేద బాలికలకు వెలుగులు కస్తూరిబా విద్యాలయలు

8 విద్యాలయాలలో 2,177 మంది విద్యార్థులు 
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల బాలికలకు ఉచిత విద్య, వసతి
రూ.15 కోట్ల అభివృద్ధితో మారుతున్న రూపురేఖలు

 (ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఒకప్పుడు పేదరికం, సామాజిక అడ్డంకులు, కుటుంబ భాద్యతల కారణంగా చదువు మానేసిన బాలికలు… ఈరోజు ధైర్యంగా భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు. ఆ మార్పుకు బాట వేసినవి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో బాలికల అక్షరాస్యతను పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రారంభించిన ఈ పథకం, చిత్తూరు జిల్లాలో బాలికల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎనిమిది కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2,177 మంది విద్యార్థినులు ఉచితంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఈ విద్యాలయాలు సంపూర్ణ వసతులతో బాలికలను తీర్చిదిద్దుతున్నాయి. వీటి  రూపురేఖలు మార్చడానికి 15 కోట్ల రూపాయల అంచనాలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

చదువు మానేసిన బాలికలను తిరిగి బడిలో చేర్పించడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ప్రాధాన్యం ఇవ్వడం, లింగ వివక్షను తగ్గించడం కస్తూరిబా విద్యాలయాల ప్రధాన లక్ష్యాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించి, మిగిలిన సీట్లను పేద కుటుంబాల బాలికలకు అందిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ పరీక్షలు లేకుండా, బడి మానేసిన వారిని గుర్తించి జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తారు. అవసరమైతే లాటరీ పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు. ఈ విద్యాలయాల్లో చేరిన బాలికలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, భోజనం, హాస్టల్ వసతి, వైద్య సదుపాయాలు అన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. చదువుతో పాటు జీవన నైపుణ్యాలు, వృత్తి విద్యా శిక్షణ కూడా ఇస్తూ, భవిష్యత్తులో స్వయం ఆధారితంగా నిలబడేలా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఎక్కువ మంది మహిళా సిబ్బందితో ఈ విద్యాలయాలు నిర్వహించబడుతున్నాయి.

రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులు

చిత్తూరు జిల్లాలోని కస్తూరిబా విద్యాలయాల మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. మొత్తం రూ.15.18 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సివిల్ వర్క్స్ నిమిత్తం రూ.458.32 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయగా, అందులో ఇప్పటివరకు రూ.344.13 లక్షలు విడుదలయ్యాయి. ఇప్పటికే రూ.164.18 లక్షలను ఖర్చు చేశారు. ఈ నిధులతో కంప్యూటర్ గదులు, కాంపౌండ్ వాల్స్, లైబ్రరీ రూములు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గదులు, ప్రధాన మరమ్మతులు వంటి పనులు చేపడుతున్నారు. చదువు మాత్రమే కాదు, బాలికలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణం కూడా అందించాలనే లక్ష్యంతో ఈ పనులు సాగుతున్నాయి. ఇక కస్తూరిబా జూనియర్ కళాశాలల వసతులను మెరుగుపరచడానికి మరో భారీ ప్రణాళిక సిద్ధమైంది. రొంపిచర్ల, పుంగనూరు, శాంతిపురం, కుప్పం, గుడిపల్లి ప్రాంతాల్లోని కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో వసతుల అభివృద్ధి కోసం రూ.1,060 లక్షల ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ఇప్పటివరకు రూ.375 లక్షలు విడుదల కాగా, రూ.195 లక్షలు ఖర్చు చేశారు. హాస్టల్ గదులు, తరగతి గదులు, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా పనులు జరుగుతున్నాయి.

నిరుపేదల ఆశాజ్యోతి 

ఒకప్పుడు చదువు మానేసిన బాలికలు, ఇప్పుడు డిగ్రీలు, ఇంటర్మీడియట్ చదువుతూ, ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. కుటుంబాలకు ఆశాజ్యోతిగా మారుతున్నారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు కేవలం పాఠశాలలు మాత్రమే కాదు… పేద బాలికల జీవితాల్లో మార్పుకు చిహ్నాలు. చదువు ద్వారా సమాజాన్ని మార్చగల శక్తి బాలికల్లో ఉందని చాటిచెబుతున్నాయి. మీ చుట్టుపక్కల చదువు మానేసిన బాలికలు ఉంటే, వారిని సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో చేర్పించేందుకు ప్రోత్సహించండి. ఒక బాలిక చదివితే… ఒక కుటుంబం కాదు, ఒక తరమే మారుతుంది.


-


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *