31, జనవరి 2026, శనివారం

పారిశ్రామికీకరణలో కొత్త ఉరవడి సృష్టిస్తున్న కుప్పం

రూ. 8,500 కోట్లకు పైగా పెట్టుబడులు
సుమారు 65,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి 
ఐఫోన్ల నుండి విమానాల విడిభాగాల వరకు
చంద్రబాబు ప్రత్యేక దృష్టితో ఇండస్ట్రియల్ హబ్ గా

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక దిశను కొత్త మలుపు తిప్పుతున్న నియోజకవర్గంగా కుప్పం వేగంగా ఎదుగుతోంది. ఎన్నాళ్లుగానో వ్యవసాయం, పశుపోషణ ఆధారంగా జీవించిన ఈ నేల ఇప్పుడు భారీ పరిశ్రమలు, ఆధునిక తయారీ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలు, విద్యుత్ వాహన తయారీ కర్మాగారాలతో కొత్త పారిశ్రామిక పటంలో ప్రముఖ స్థానం సంపాదిస్తోంది. ప్రజాప్రతినిధిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చొరవతో కుప్పంలో పారిశ్రామిక వాతావరణాన్ని బలపరచేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రకటించిన, అమలులోకి వస్తున్న ప్రాజెక్టులను కలిపి చూస్తే రూ. 8,500 కోట్లకు మించిన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 65,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని అంచనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఉపాధి కోసం యువత ఇతర పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఉద్యోగాలే కుప్పంకు వస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

తోలు రహిత పాదరక్షల తయారీలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హౌసాంగ్  సంస్థ కుప్పం పరిసరాల్లో విశాల విస్తీర్ణంలో మెగా పాదరక్షల తయారీ పార్కును నెలకొల్పుతోంది. సుమారు వందకు పైగా ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్న ఈ యూనిట్‌లో ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో చెప్పుల జతలు తయారవుతాయి. వేలాదిమందికి ఉపాధి లభించనుంది. ముఖ్యంగా మహిళలకు విస్తృత ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా గొలుసులో కుప్పాన్ని చేర్చే కీలక ప్రాజెక్టుగా ఇందాల్కో ఇండస్ట్రీస్ సంస్థ స్థాపిస్తున్న అల్యూమినియం భాగాల తయారీ యూనిట్ నిలుస్తోంది. ఇది ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ ఫోన్లకు అవసరమైన లోహ కవచ భాగాలను తయారు చేయనుంది. ఈ యూనిట్ ప్రారంభమైతే కుప్పం పేరు ప్రపంచ తయారీ పటంలో స్పష్టంగా వినిపిస్తుంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చే విధంగా పాలు, సోయా, పండ్ల ప్రాసెసింగ్ రంగాల్లో కూడా పెద్ద ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ పాల ప్రోటీన్ సముదాయం ఏర్పాటుచేస్తోంది. ఇది వేలాది పాల ఉత్పత్తిదారులకు స్థిరమైన మార్కెట్‌ను కల్పిస్తుంది. ఎస్వీఎఫ్ సోయా ప్రాసెసింగ్ యూనిట్ రైతుల పంటలకు విలువ పెంచుతుంది. శ్రీజ డెయిరీ, మదర్ డెయిరీ వంటి సంస్థలు పాల, పండ్ల ఆధారిత ఆహార పదార్థాల తయారీలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీనివల్ల పాడి రైతులు, తోటల రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలకు లాభం చేకూరనుంది.

పర్యావరణ హిత రవాణా దిశగా అడుగులు వేస్తూ ఈ రాయిస్ మోటార్స్ సంస్థ విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. ఇప్పటికే కుప్పం పట్టణంలో విద్యుత్ ఆటోలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక అడుగు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కోసం ఆలిప్ ఆధ్వర్యంలో ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటవుతోంది. ఇక్కడ ఆహార పదార్థాల తయారీ, వస్త్ర తయారీ యూనిట్లు స్థాపించబోతున్నారు. ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని సమకూర్చడంలో ఏపీఐఐసీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే వేల ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంది. రైతులతో భూసేకరణలో నష్టపరిహారం, అభివృద్ధి చేసిన ప్రదేశాల్లో స్థలాలు ఇవ్వడం వంటి విధానాలు అమలు చేస్తున్నారు. పరిశ్రమల నీటి అవసరాల కోసం హంద్రీ–నీవా నీటిపథకం నుంచి ప్రత్యేక పైప్‌లైన్లు వేస్తున్నారు. రహదారి సదుపాయాలను విస్తరించి నాలుగు మార్గాల రహదారులుగా మారుస్తున్నారు. సరుకు రవాణా సౌలభ్యం కోసం రామకుప్పం ప్రాంతంలో కొత్త విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. లోహ పనులు, విద్యుత్ పనులు, యంత్రాల నిర్వహణ వంటి కోర్సులు అందిస్తున్నారు. స్థానిక యువతే పరిశ్రమల్లో పనిచేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమగ్ర అభివృద్ధి చర్యల వల్ల కుప్పం ఇక సాధారణ నియోజకవర్గం కాదు; అది పారిశ్రామికంగా స్వయం సమృద్ధిగా ఎదుగుతున్న ఆదర్శ ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. సరైన అమలు, పారదర్శకత కొనసాగితే కుప్పం త్వరలోనే రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంధనంగా మారనుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *