గ్రామ స్వరాజ్యానికి జీవనాడి ఫైనాన్స్ కమిషన్ నిధులు
ఒకటిన్నర ఏడాదిలో రూ. 88.24 కోట్లు విడుదల
తాజాగా రూ. 28.52 కోట్ల నిధుల విడుదల
పారిశుద్ధ్య కార్యక్రమాలకే వినియోగించాలని డిపిఓ ఆదేశం
(చిత్తూరు – ఆంధ్రప్రభ బ్యూరో)
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. ఆ గ్రామాల అభివృద్ధికి ప్రాణవాయువులా పనిచేసేవి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు. పంచాయతీలకు నేరుగా కేంద్రం నుంచి వచ్చే ఈ నిధుల వల్లే పల్లెల్లో త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, చిన్న రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు జిల్లాకు మొత్తం 88.24 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం గ్రామాభివృద్ధికి ఊతమిచ్చే పరిణామంగా మారింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 59.72 కోట్ల రూపాయలు, 2025 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా 28.52 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులను పూర్తిగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ అన్ని గ్రామపంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సంఘం కేంద్రం వసూలు చేసే పన్నుల్లో కొంత వాటాను రాష్ట్రాలకు, అక్కడి నుంచి స్థానిక సంస్థలకు కేటాయించాలని సిఫార్సు చేస్తుంది. ప్రస్తుతం 2021 నుంచి 2026 వరకూ అమల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు విడుదల అవుతున్నాయి. కేంద్ర పన్నుల ఆదాయంలో నుంచి నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి ఈ నిధులు జమ అవుతున్నాయి. గ్రామాల జనాభాకు 90 శాతం, విస్తీర్ణానికి 10 శాతం వెయిటేజీ ఇచ్చి నిధుల పంపిణీ జరుగుతోంది. రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా 1992లో పంచాయతీలకు రాజ్యాంగ హోదా లభించినప్పటి నుంచి గ్రామాలకు నిధుల ప్రవాహం క్రమంగా పెరిగింది. 10వ, 11వ ఆర్థిక సంఘాల కాలం నుంచే పంచాయతీలకు నిధులు వస్తున్నప్పటికీ, 14వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా భారీ మొత్తంలో నిధులు గ్రామాల ఖాతాల్లోకి రావడం మొదలైంది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం ద్వారా ఈ వ్యవస్థ మరింత బలోపేతమైంది.
గ్రామసభ ఆమోదముతోనే పనులు
పంచాయతీలకు వచ్చే నిధులు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి షరతులతో కూడిన నిధులు, రెండవది సాధారణ నిధులు. మొత్తం నిధుల్లో సుమారు 60 శాతం షరతులతో కూడిన నిధుల కింద వస్తాయి. వీటిని కేవలం త్రాగునీరు, పారిశుధ్యానికి సంబంధించిన పనులకే వినియోగించాలి. నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, పైపులైన్ల మరమ్మతులు, ట్యాంకుల శుభ్రత, మురుగు కాలువల నిర్మాణం, చెత్త సేకరణ, డంపింగ్ కేంద్రాల నిర్వహణ, బహిరంగ మలవిసర్జన లేకుండా గ్రామాలను నిలుపుకోవడం వంటి పనులకే ఈ డబ్బు ఖర్చు చేయాలి. ఈ నిధులను జీతాలు లేదా ఇతర పరిపాలనా ఖర్చులకు వినియోగించడానికి అనుమతి లేదు. మిగిలిన 40 శాతం సాధారణ నిధులుగా వస్తాయి. ఇవి గ్రామ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పంచాయతీ భవనాల మరమ్మతులు, కార్యాలయ సామగ్రి ఖర్చులు, చిన్న సిసి రోడ్ల మరమ్మతులు, పారిశుధ్య కార్మికుల వేతనాల్లో కొంత భాగం వంటి అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. అయితే నిధులు వచ్చిన వెంటనే సర్పంచ్ లేదా కార్యదర్శి ఇష్టానుసారం వాటిని డ్రా చేయడానికి వీలుండదు. ముందుగా గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఏ పనులు అత్యవసరమో చర్చించాలి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో ఆ పనులను నమోదు చేయాలి. గ్రామ సభ తీర్మానం తర్వాతే నిధుల వినియోగానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం చెక్కుల వ్యవస్థ లేకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా వెండార్ల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోంది.
తాజా నిధులు పారిశుద్ధ కార్యక్రమాలకు మాత్రమే
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు జిల్లాకు విడుదలైన 88.24 కోట్ల రూపాయల నిధులను పూర్తిగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని జిల్లా పంచాయతీ శాఖ స్పష్టం చేసింది. తాగునీటి నిర్వహణ, మురుగు కాలువల శుభ్రత, చెత్త సేకరణ, డంపింగ్ కేంద్రాల నిర్వహణ వంటి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్ని గ్రామపంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిధుల మళ్లింపు జరగకుండా పర్యవేక్షణ పెంచుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు గుండెకాయ లాంటివి. ఈ నిధులను పక్కదారి పట్టించకుండా, రాజకీయాలకు అతీతంగా నీరు, పారిశుధ్యం వంటి మౌలిక అవసరాలపై సక్రమంగా వినియోగిస్తేనే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. గ్రామాల అభివృద్ధికి నిధులు మాత్రమే కాదు, వాటిని నిజాయితీగా వినియోగించే సంకల్పం కూడా అవసరం.

