జిల్లాలో అన్నగారి అడుగుజాడలు..
మరపురాని జ్ఞాపకాలు!
జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఎన్టీఆర్
హంద్రీనీవా, గాలేరు నగరి ఆలోచన నందమూరిదే
ఎన్టీఆర్ మానస పుత్రికే ద్రవిడ విశ్వవిద్యాలయం
అధ్యాపకుడిని మంత్రిగా, గృహిణి ఎంపీగా చేసిన ఘనత ఎన్టీఆర్ దే
నేడే నందమూరి తారక రామారావు వర్ధంతి
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేవారు కొందరే. అలాంటి అరుదైన నాయకుడే నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్). చిత్తూరు జిల్లా ప్రజలకు ఆయన కేవలం మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. కష్టసుఖాలు తెలిసిన ఆత్మీయుడు, ఆశల్ని నింపిన మార్గదర్శి. జిల్లా కేంద్రం చిత్తూరు నుంచి సరిహద్దు కుప్పం వరకు, పలమనేరు నుంచి నగరి వరకు ఆయన చేసిన పర్యటనలు, ప్రజలతో ఏర్పడిన అనుబంధం రాజకీయ చరిత్రలో చెరగని గుర్తుగా నిలిచిపోయాయి. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీకి బాధ్యుడు ఎన్టీ రామారావు. అలాగే కరువు జిల్లాకు కృష్ణా జలాలను తీసుకుని వచ్చి సస్యశ్యామలం చేయాలని హంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల ఆలోచన ఎన్టీఆర్ దే. సామాన్య అధ్యాపకుడిని విద్యాశాఖ మంత్రిని చేసిన ఒక గృహాన్ని పార్లమెంటుకు పంపిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది.
1983 ఎన్నికల సమయంలో, ఆ తర్వాత 1984 ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ సమయంలో ఎన్టీఆర్ చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. చైతన్య రథంపై ప్రజల మధ్యకు వెళ్లి, నేరుగా వారి కష్టాలను వినిపించుకునే నాయకత్వ శైలే ఆయన ప్రత్యేకత. చిత్తూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్, పీసీఆర్ సర్కిల్, గ్రీమ్స్‌పేట, చర్చి ప్రాంతాలు ఆయన ప్రసంగాలతో మార్మోగిన ప్రదేశాలే. వేలాదిగా తరలివచ్చిన జనం ఆయన మాటల్లో కొత్త ఆశను చూసేవారు. 1984లో ప్రజా చైతన్య యాత్ర చిత్తూరులోకి ప్రవేశించినప్పుడు చోటుచేసుకున్న రైల్వే అండర్ బ్రిడ్జి ఘటన జిల్లావాసుల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసింది. ఇరకాటమైన మార్గంలో చైతన్య రథం వెళ్తుండగా ప్రత్యర్థుల రాళ్లదాడి జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దాడిలో ఎన్టీఆర్ వెన్నంటి ఉన్న చిత్తూరు ఎంపీ ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి తలకు తీవ్ర గాయమైంది. రక్తం కారుతున్నా ఆమె వెనకడుగు వేయకుండా ఎన్టీఆర్ రక్షణ కోసం అక్కడే నిలబడ్డారు. తన కళ్లముందే ఒక మహిళా నాయకురాలు గాయపడటం చూసి ఎన్టీఆర్ చలించిపోయారు. ఆమెను స్వయంగా పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆడబిడ్డ రక్తం చిందిన ఈ గడ్డపైనే తెలుగుదేశం జెండా ఎప్పటికీ రెపరెపలాడుతుందిని ఆయన చేసిన మాటలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆ ఒక్క సంఘటనే చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది వేసింది. చిత్తూరు తర్వాత ఎన్టీఆర్ పలమనేరు, బంగారుపాళ్యం, పుంగనూరు, కుప్పం, నగరి వంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. పలమనేరు కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో ఉండటంతో అక్కడి సభలకు భారీ స్పందన ఉండేది. రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా రైతులు, వ్యాపారులు, యువతతో నేరుగా మాట్లాడేవారు.
ద్రవిడ యూనివర్సిటీకి ఆధ్యుడు
కుప్పం వంటి వెనుకబడిన ప్రాంతాలపై ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా మార్చాలన్న ఆలోచనతోనే ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా పూర్తిగా మెట్ట ప్రాంతం కావడంతో వ్యవసాయం బోరు బావులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితిని ఎన్టీఆర్ బాగా అర్థం చేసుకున్నారు. రైతులు కరెంట్ బిల్లుల భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి హార్స్ పవర్‌కు రూ.50 ఫ్లాట్ రేట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది చిత్తూరు రైతులకు వరంలా మారింది. వేలాది బోరు బావులు తవ్వుకునే అవకాశం కల్పించి, ఉద్యాన పంటల సాగుకు బాటలు వేసింది. మామిడి, టమాటా వంటి పంటలు విస్తరించడానికి ఈ నిర్ణయమే ప్రధాన కారణంగా నిలిచింది.
హంద్రీ నీవా, గాలేరు నగరి ఆలోచన ఎన్టీఆర్ దే
కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమకు శాశ్వత పరిష్కారం కృష్ణా జలాలేనని ఎన్టీఆర్ భావించారు. అందుకే పలమనేరు, పుంగనూరు, కుప్పం ప్రాంతాలకు నీరందించే హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు బీజం వేశారు. అలాగే నగరి వరకు సాగునీరు అందించే గాలేరు నగరి ప్రాజెక్టు ఆలోచన కూడా ఆయన మేధస్సు నుంచే పుట్టింది. సీమ కరవును తరిమికొట్టాలిన్న ఆయన సంకల్పం నేడు కాలువల రూపంలో కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రాకముందే ఎన్టీఆర్‌కు చిత్తూరుతో అనుబంధం ఉంది. అడవిరాముడు, వేటగాడు వంటి చిత్రాలు చిత్తూరు థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నప్పుడు, ఆయన విజయోత్సవ యాత్రలతో ఇక్కడికి వచ్చారు. ఆనాటి సినీ అభిమానులే తర్వాత కాలంలో ఆయన రాజకీయ సైనికులుగా మారారు. సినిమా నుంచి ప్రజాసేవ దాకా ఆయన ప్రయాణంలో చిత్తూరు కీలక పాత్ర పోషించింది.
*అధ్యాపకుడు మంత్రి, గృహిణి ఎంపీ అయ్యారు.
ఎన్టీఆర్ నాయకత్వంలో సామాన్యులు కూడా నాయకులయ్యారు. ఒక సాధారణ అధ్యాపకుడిగా ఉన్న గాలి ముద్దుకృష్ణమ నాయుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న ఝాన్సీ లక్ష్మిని పార్లమెంటుకు పంపారు. మహిళలకు, విద్యావంతులకు రాజకీయాల్లో గౌరవం కల్పించిన నాయకుడు ఎన్టీఆర్. ఈ మార్పు చిత్తూరు జిల్లాలోనే బలంగా కనిపించింది. ఈ రోజు చిత్తూరు నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జిని దాటుతున్నా, పీసీఆర్ సర్కిల్ వద్ద నిలిచినా, కుప్పంలోని విశ్వవిద్యాలయాన్ని చూసినా, హంద్రీనీవా కాలువల పనులు కనిపించినా అన్నగారి జ్ఞాపకాలు ప్రజల కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. జిల్లాల సరిహద్దులు మారవచ్చు, పాలనా వ్యవస్థ మారవచ్చు. కానీ చిత్తూరు జిల్లా ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ వేసిన ముద్ర మాత్రం చెక్కుచెదరనిది. పేదవాడికి ఇచ్చిన పక్కా ఇళ్లు, రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్, మెట్ట భూములకు తేవాలనుకున్న కృష్ణా జలాలు, సామాన్యులను నాయకులుగా మార్చిన రాజకీయ సంస్కృతి ఇవన్నీ ఆయన వారసత్వం. రక్తం చిందిన చోటే జెండా ఎగిరింది. అదే చిత్తూరు. అదే అన్నగారి చరిత్ర. అదే ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జ్ఞాపకం.

