2, జనవరి 2026, శుక్రవారం

నకిలీ ఐటీసీ మోసాలపై క్రిమినల్ కేసులకు శ్రీకారం

ఆంధ్రప్రభ వార్తల ఎఫెక్ట్
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
పోలీసులకు ఫిర్యాదు చేసిన వాణిజ్య పన్నుల శాఖ
పూర్తి వివరాలు సమర్పించాలన్న పోలీస్ అధికారులు 


(ఆంధ్రప్రభ బ్యూరో,చిత్తూరు.)

చిత్తూరు జిల్లాలో నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించిన పన్ను మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో పాల్గొన్న నకిలీ, అసలుకాని పన్ను చెల్లింపుదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. చిత్తూరు–I సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ (స్టేట్ టాక్స్)  పి. మహేష్ కుమార్, చిత్తూరు–I టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు 2025 డిసెంబర్ 29న అధికారిక లేఖ ద్వారా ఫిర్యాదు సమర్పించారు. ఏపీ జీఎస్టీ చట్టం 2017 కింద నమోదైన ఈ పన్ను మోసాలపై నేర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అయితే జిఎస్టి మోసాలకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా పోలీసు అధికారులు జిఎస్టి అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఫిర్యాదు రూపంలో జిఎస్టి అధికారులు రూపొందిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరో మరో పోలీస్ అధికారులను కలిసి ఫిర్యాదు దాఖలు చేయనున్నారు.

చిత్తూరు కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నకిలీ ఐటీసీలతో సుమారు 1000 కోట్ల జిఎస్టి నిధుల కుంభకోణం జరిగినట్లు ఆంధ్రప్రభ దినపత్రికల్లో వరుస కథనాలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే.
ఈ విషయమై స్పందించిన జీఎస్టీ కమిషనర్ అహ్మద్ బాబు అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కలిసి క్రిమినల్ కేసులను నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇందులో భాగంగా చిత్తూరు జాయింట్ కమిషనర్ (స్టేట్ టాక్స్) ఆదేశాల మేరకు, ఏపీ జీఎస్టీ చట్టం–2017లోని సెక్షన్ 67(1) ప్రకారం చిత్తూరు డివిజన్ పరిధిలోని పలు పన్ను చెల్లింపుదారుల వ్యాపార ప్రాంగణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులపై ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు చిత్తూరు వన్ టౌన్ లో ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిర్వహించిన విచారణలో, కొంతమంది పన్ను చెల్లింపుదారులు తప్పుడు లావాదేవీలు, నకిలీ పత్రాల ఆధారంగా అక్రమంగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ నకిలీ ఐటీసీని తమ అవుట్‌వర్డ్ సరఫరాలకు సర్దుబాటు చేసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను తప్పించుకోవడం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయ నష్టం కలిగించినట్లు చాము గుర్తించడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడే ఉద్దేశంతో క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ స్పష్టంగా కోరింది. అలాగే, ఈ పన్ను మోసాల వ్యవహారంపై తదుపరి పర్యవేక్షణ కోసం చిత్తూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు, చిత్తూరు జాయింట్ కమిషనర్ (స్టేట్ టాక్స్)కు కూడా ఫిర్యాదుల ప్రతులను అందచేశారు. నకిలీ ఐటీసీ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలను ఏమాత్రం సహించబోమని, రాష్ట్ర ఖజానా పరిరక్షణే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటామని వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేసింది.
అయితే, జిఎస్టి శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు అసంపూర్తిగా ఉందని జిల్లా పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. నకిలీ ఎల్టీసీలతో ఎలా జీఎస్టీ నిధులను స్వాహా చేశారు, ఎప్పటినుండి జరుగుతుంది, ఇందుకు బాధ్యులు ఎవరు, మొత్తం వ్యవహారాన్ని ఎవరు నడుపుతున్నారు, జీఎస్టీ అధికారులు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తించారు, వారు తీసుకున్న చర్యలు తదితర వివరాలతో సమగ్రమైన ఫిర్యాదును నవ్వ చేయాల్సిందిగా పోలీసు అధికారులు కోరారు. దీంతో నకిలీ ఎల్టీసీల తో జరిగిన జిఎస్టి కుంభకోణానికి సంబంధించి సమగ్రమైన నివేదికతో ఫిర్యాదు చేయడానికి జీఎస్టీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరోసారి పోలీస్ అధికారులను కలిసి తమ ఫిర్యాదులు అందజేయనున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *