8, జనవరి 2026, గురువారం

చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్..

మధ్యాహ్నం 1.15కి పేలుడు హెచ్చరిక.. 
కోర్టు కాంప్లెక్స్‌లో భారీ తనిఖీలు
 మానవ బాంబు బెదిరింపుతో చిత్తూరులో కలకలం.. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
ఐదు గంటలపాటు కోర్టు ప్రాంగణం జల్లెడ..  తనిఖీ తర్వాత ఊపిరి పీల్చుకున్న చిత్తూరు



(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం వేళ వచ్చిన ఈ బెదిరింపు సమాచారం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే భద్రతా చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల 20 నిమిషాలకు చిత్తూరు జిల్లా కోర్టు సూపరింటెండెంట్ అధికారిక ఈ-మెయిల్ చిరునామాకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో చిత్తూరు కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామని, పేలుడు పదార్థాలతో కోర్టును ధ్వంసం చేస్తామని, అందరూ వెంటనే బయటకు వెళ్లాలని, మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు పేలుడు జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో కోర్టు కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విషయాన్ని చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర జిల్లా పోలీస్ అధికారి తుషార్ డూడికి వెంటనే తెలియజేశారు. జిల్లా పోలీస్ అధికారి ఆదేశాల మేరకు అదనపు పోలీస్ అధికారి దేవదాస్‌కు, చిత్తూరు ఉప విభాగ పోలీస్ అధికారి టి. సాయినాథ్‌కు, జిల్లా అగ్నిమాపక అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి తక్షణమే సమాచారం అందించారు. ఆదేశాలు అందిన వెంటనే పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది.

కోర్టు ఖాళీ.. నాలుగు బృందాలతో తనిఖీలు

అదనపు పోలీస్ అధికారి దేవదాస్, ఉప విభాగ పోలీస్ అధికారి సాయినాథ్, బాంబు నిర్వీర్య బృందం, అగ్నిమాపక సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ముందుగా కోర్టులో ఉన్న న్యాయవాదులు, కేసుల నిమిత్తం వచ్చిన ప్రజలు, కోర్టు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం కోర్టు ప్రాంగణాన్ని నాలుగు బృందాలుగా విభజించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనంలోని ప్రతి గది, కారిడార్లు, న్యాయస్థాన హాళ్లు, రికార్డు గదులు, కార్యాలయ విభాగాలు, కంప్యూటర్ విభాగం, పార్కింగ్ ప్రాంతాలు, పరిసర ప్రాంతాలను అణువణువూ పరిశీలించారు. బాంబు నిర్వీర్య బృందం, శునక దళం సహకారంతో ప్రతి మూలను జల్లెడ పట్టారు. కోర్టు కాంప్లెక్స్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి అనుమతించలేదు.

ఐదు గంటల తనిఖీ.. పేలుడు పదార్థాలు లేవు

ఈ భద్రతా తనిఖీలు సుమారు ఐదు గంటల పాటు కొనసాగాయి. ఈ సమయంలో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విస్తృతంగా నిర్వహించిన తనిఖీల అనంతరం కోర్టు ప్రాంగణంలో ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు నిర్ధారించారు. పరిస్థితి పూర్తిగా సురక్షితమని కోర్టు అధికారులకు తెలియజేశారు. ఈ ఘటన అనంతరం అదనపు పోలీస్ అధికారి (ఆపరేషన్స్) మరియు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు స్వయంగా కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కోర్టు పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

ఇదిలా ఉండగా, బాంబు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ఈ-మెయిల్ చిరునామా, డిజిటల్ వివరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఎలాంటి అవాంఛనీయ వార్తలను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని చిత్తూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *