పలమనేరులో టీటీడీ దివ్య వృక్షాల మహా ప్రణాళిక
టిటిడి గోశాల వద్ద 100 ఎకరాల్లో బృహత్తర ప్రణాళిక
టేకు, ఏగిశ, టెర్మినేలియా, షోరియా వంటి జాతులు
60 నుండి 80 అడుగుల ఎత్తు ఎదగేలా పర్యవేక్షణ
ఆలయాలకు ధ్వజస్తంభాల కలప నిమిత్తం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
హిందూ సంప్రదాయ పరిరక్షణలో అగ్రగామిగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య వృక్షాల పెంపకంలో చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఆధ్యాత్మిక ఆచారాలను, పర్యావరణ సంరక్షణను, భవిష్యత్ అవసరాలను సమన్వయపరిచే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఆలయ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ధ్వజస్తంభాల తయారీకి అవసరమైన అరుదైన వృక్షాలను స్వయంగా పెంచుకోవాలనే దూరదృష్టితో ఈ ప్రణాళిక రూపొందింది. పలమనేరు సమీపంలోని టీటీడీ ఎస్వీ గోశాల విస్తీర్ణంలో సుమారు 100 ఎకరాలను ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. ఇప్పటివరకు ధ్వజస్తంభాల కోసం కావాల్సిన నాణ్యమైన కలపను ఇతర రాష్ట్రాల అటవీ వనరులపై ఆధారపడి సమకూర్చాల్సి వచ్చేది. ఆ ప్రక్రియలో వ్యయభారం, నాణ్యత సమస్యలు, ఆలస్యాలు ఎదురయ్యేవి. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారంగా స్వయం సమృద్ధి లక్ష్యంతో ఈ దివ్య వనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ధ్వజస్తంభం ఒకే వృక్ష కాండంతో, ఎటువంటి అతుకులు లేకుండా తయారు కావాలి. అది ఆలయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. భక్తి, శక్తి, దైవ అనుగ్రహాల సంకేతంగా నిలిచే ఈ ధ్వజస్తంభం తయారీకి గట్టి కలప, దీర్ఘాయుష్షు, నిటారుగా పెరుగుదల ముఖ్య లక్షణాలు. అందుకే టేకు, ఏగిశ, టెర్మినేలియా, షోరియా వంటి జాతులను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచనున్నారు. చెట్లు కనీసం 60 నుండి 80 అడుగుల ఎత్తు వరకు ఎదగేలా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది.
గోశాల సమీపం ఈ ప్రాజెక్టుకు మరింత విశిష్టతను ఇస్తోంది. ఆవు పేడ, గోమూత్రం వంటి సహజ ఎరువులతో సేంద్రియ పద్ధతుల్లో సాగు జరుగుతుంది. రసాయనాల వినియోగం లేకుండా పెరిగే వృక్షాలు బలంగా, దీర్ఘకాలం నిలిచే కలపను అందిస్తాయి. వృక్షాలు పరిపక్వత సాధించిన తరువాత వాటి కలపను శాస్త్రోక్త పద్ధతిలో తైలాధివాసం చేసి, రాగి, వెండి లేదా బంగారు కవచాలతో ధ్వజస్తంభాలుగా తీర్చిదిద్దుతారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక ఆలయాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రణాళికలో ఉంది. ఈ వనం ఆ ఆలయాలన్నింటికీ అవసరమైన ధ్వజస్తంభాల కలపను సమకూర్చనుంది. దీన్ని ఒక విధంగా దివ్య కలప భద్రపేటికగా పరిగణిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగం. 100 ఎకరాల్లో అరుదైన వృక్షాలు పెరగడం వల్ల జీవ వైవిధ్యం మెరుగుపడుతుంది. అదనంగా తిరుమలలో ‘దివ్య ఔషధ వనం’ పేరిట అరుదైన మూలికా మొక్కల సంరక్షణకు ప్రత్యేక వేదిక సిద్ధమవుతోంది. ఇది ఆయుర్వేద సేవలకు తోడ్పడటమే కాకుండా, అంతరించిపోతున్న వనరులను రక్షించడంలో కీలకంగా మారుతుంది.
ఈ విషయమై టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ ప్రాజెక్టు కేవలం వృక్షారోపణ కార్యక్రమం కాదని, భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక పవిత్రతను, పచ్చని వారసత్వాన్ని అందించే దివ్య యజ్ఞమని పేర్కొన్నారు. సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రకృతిని కాపాడటం కూడా ధర్మసేవలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. ధర్మం, శాస్త్రం, ప్రకృతి ఈ మూడింటి సంగమంగా నిలుస్తున్న ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఇతర ధార్మిక సంస్థలకు ఆదర్శంగా నిలవనుంది. భవిష్యత్ ఆలయాల ఆధ్యాత్మిక శోభకు పచ్చని పునాది వేస్తున్న టీటీడీ మరోసారి తన దూరదృష్టిని చాటుతోంది.

