నానాటికీ చిక్కిపోతున్న చిత్తూరు జిల్లా
ఒక నాడు దేశంలోనే అతిపెద్ద జిల్లాగా వెలుగొందిన చిత్తూరు
66 మండలాలు, 15 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు
నేడు 28 మండలాలు, 7 నియోజక వర్గాలు, ఒక పార్లమెంట్
చరిత్రలో కలిసిన న్యూట్రిన్, చిత్తూరు డెయిరీ, చక్కర ఫ్యాక్టరీలు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పరిపాలనా, ఆధ్యాత్మిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన జిల్లా చిత్తూరు. ఒకప్పుడు రాష్ట్రానికే దిశానిర్దేశం చేసిన ఈ జిల్లా నేడు పరిమాణంలో చిన్నదై, గత వైభవాన్ని తలుచుకుంటూ నిలిచిన దీనస్థితి. బ్రిటీష్ పాలన కాలంలోనే ఏర్పడిన చిత్తూరు జిల్లా, స్వాతంత్య్రానంతర కాలంలో విస్తీర్ణం, జనాభా, రాజకీయ బలం పరంగా దేశంలోనే అతిపెద్ద జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే 2022లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు ముక్కలై, నేడు కేవలం 28 మండలాలకు పరిమితమైంది. ఇది కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాకుండా, తరతరాలుగా నిర్మితమైన చిత్తూరు గుర్తింపుకు వచ్చిన పెద్ద మలుపుగా చరిత్రలో నిలిచిపోనుంది. చిత్తూరు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన చిత్తూరు పాల డెయిరీ, న్యూట్రిన్ ఫ్యాక్టరీ, సహకార చక్కెర ఫ్యాక్టరీలు కాలగర్భంలో కలిసిపోయాయి.
చిత్తూరు జిల్లా 1911 ఏప్రిల్ 1న ఆవిర్భవించింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో పరిపాలన సౌలభ్యం కోసం కడప, నెల్లూరు, ఉత్తర ఆర్కాట్ జిల్లాల పరిధిలోని ప్రాంతాలను వేరు చేసి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. కడప జిల్లా నుంచి మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు, ఉత్తర ఆర్కాట్ జిల్లా నుంచి చిత్తూరు, పలమనేరు, చంద్రగిరి తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి పుంగనూరు, కాళహస్తి వంటి జమీందారీ ప్రాంతాలు చిత్తూరు జిల్లాలో భాగమయ్యాయి. తొలినాళ్లలో పరిపాలన మొత్తం తాలూకా వ్యవస్థ ఆధారంగా సాగింది. చిత్తూరు, చంద్రగిరి, మదనపల్లె, వాయల్పాడు, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, తిరుత్తణి, కాళహస్తి, సత్యవేడు వంటి ప్రధాన తాలూకాలతో జిల్లా విస్తరించి ఉండేది. 1960లో పటాస్కర్ కమిషన్ నివేదిక మేరకు తిరుత్తణి తమిళనాడులో కలవగా, తమిళనాడు నుంచి సత్యవేడు ఆంధ్రప్రదేశ్‌లోకి రావడం చిత్తూరు జిల్లా భౌగోళిక రూపంలో కీలక మార్పుగా నిలిచింది. స్వాతంత్య్రానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, నియోజకవర్గాల పునర్విభజనలతో చిత్తూరు జిల్లా రాజకీయంగా మరింత బలపడింది. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల నాటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. కాలక్రమేణా ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగినా, 2022 విభజనకు ముందు వరకు జిల్లా పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు మరియు తిరుపతి అనే రెండు పార్లమెంటరీ స్థానాలు ఉండేవి. ఒక దశలో చిత్తూరు జిల్లా అంటే రాష్ట్ర రాజకీయాలకు కీలక కేంద్రమనే భావన ఏర్పడింది.
1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన మండల వ్యవస్థ చిత్తూరు జిల్లా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. పాత తాలూకా వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు పాలన మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో మండలాల వ్యవస్థను తీసుకురావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొలుత 66 మండలాలు ఏర్పాటు చేశారు. దాదాపు 15,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా చిత్తూరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మూడు రెవెన్యూ డివిజన్లు, మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ స్థానాలు, 66 మండలాలు కలిగిన జిల్లా అంటే పరిపాలనా శక్తి ఏ స్థాయిలో ఉండేదో చెప్పకనే చెబుతుంది. కాలం మారింది. పాలన విధానాలు మారాయి. 2022లో అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ పేరుతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నిర్ణయం చిత్తూరు జిల్లా చరిత్రలో అత్యంత కీలక మలుపుగా మారింది. ఏప్రిల్ 4, 2022న ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయింది. తిరుపతి కేంద్రంగా తిరుపతి జిల్లా, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, మిగిలిన భాగంగా చిత్తూరు జిల్లా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా ఏర్పాటుతో శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు వంటి ప్రాంతాలు అక్కడికి వెళ్లాయి. మదనపల్లె రెవెన్యూ డివిజన్ మొత్తం అన్నమయ్య జిల్లాలో కలిసిపోయింది. దీంతో ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద జిల్లాగా వెలిగిన చిత్తూరు జిల్లా ఒక్కసారిగా చిన్నదైంది.
విభజన తర్వాత చిత్తూరు జిల్లాలో మొదట 32 మండలాలు మాత్రమే మిగిలాయి. ఆ తరువాత భౌగోళిక పరిస్థితులు, ప్రజల విజ్ఞప్తుల పేరుతో మరికొన్ని మార్పులు జరిగాయి. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలు అన్నమయ్య జిల్లాలో విలీనమవడంతో నేడు చిత్తూరు జిల్లాలో కేవలం 28 మండలాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా పరిధిలో చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పూర్తిగా ఉండగా, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు, నగరి నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు మాత్రం మిగిలాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒకే ఒక్క చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం మాత్రమే మిగిలాయి. ఒకనాడు మూడు పార్లమెంటరీ స్థానాలు ఉన్న జిల్లా నేడు ఒక్క లోక్‌సభ స్థానానికి పరిమితమవడం చరిత్రలో అరుదైన పరిణామంగా చెప్పవచ్చు. చిత్తూరు జిల్లా అంటే పరిపాలన మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వైభవం, సాంస్కృతిక సంపద, చారిత్రక కీర్తి అన్నీ కలసిన పేరు. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు, కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన వినాయకుడు, ఆంధ్ర ఊటీగా పేరొందిన హార్స్లీ హిల్స్, పుంగనూరు రాజమందిరం, కుప్పం కోట, చంద్రగిరి లోని రాజమహల్ … ఇవన్నీ చిత్తూరు జిల్లా చరిత్రకు ప్రతీకలు. ఈ పవిత్ర, చారిత్రక ప్రదేశాలు ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకే గర్వకారణం.
మరోవైపు ఒకప్పుడు జిల్లా ఆర్థికానికి ప్రాణంగా నిలిచిన పరిశ్రమలు నేడు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. చిత్తూరు సహకార పాల డైరీ, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ, గాజులమండెంలోని ఎస్వి చక్ర ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ, చిత్తూరులోని న్యూట్రిన్ చాక్లెట్ ఫ్యాక్టరీ వంటి పరిశ్రమలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇవి మూతపడడంతో వేలాది కార్మికుల జీవనాధారం దెబ్బతింది. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పరంగా ఒకప్పుడు ముందంజలో ఉన్న జిల్లా నేడు ఆ దిశగా వెనుకబడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద జిల్లాగా వెలిగిన చిత్తూరు నేడు పరిమాణంలో అతి చిన్న జిల్లాల్లో ఒకటిగా మారింది. వైశాల్యం తగ్గినా చరిత్ర తగ్గలేదు. రాజకీయ బలం తగ్గినా సంప్రదాయం తగ్గలేదు. అయినప్పటికీ, చిత్తూరు జిల్లా తిరిగి తన పూర్వ వైభవాన్ని సాధించాలంటే కేవలం భౌగోళిక మార్పులు కాదు, ఆర్థిక పునరుజ్జీవనం, పరిశ్రమల పునరుద్ధానం, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. చరిత్ర గొప్పగా ఉన్న జిల్లాకు భవిష్యత్తు కూడా అంతే గొప్పగా ఉండాలన్నదే చిత్తూరు ప్రజల ఆకాంక్ష.

