చిత్తూరు రైతాంగానికి పగటి పూట సోలార్ వెలుగులు
ఫీడర్ లెవల్ సోలరైజేషన్‌తో సాగుకు చారిత్రక మలుపు
జిల్లాలో 42 సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు
చిత్తూరు కుప్పం డివిజన్లో 221 మెగావాట్ల ఉత్పత్తి
49 వేలకుపైగా పంపుసెట్లకు పగటిపూట నిరంతర ఉచిత విద్యుత్
(ఆంధ్రప్రభ బ్యూరో , చిత్తూరు.)
చిత్తూరు జిల్లా వ్యవసాయ రంగంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మార్పుకు ఇప్పుడు స్పష్టమైన రూపం దక్కింది. రాత్రి విద్యుత్‌పై ఆధారపడుతూ, అడవులు–పొలాల మధ్య చీకట్లో సాగు చేయాల్సిన పరిస్థితికి తెరదించుతూ, పగటిపూట నాణ్యమైన, నిరంతర ఉచిత విద్యుత్‌ను రైతులకు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం–కుసుమ్ పథకం జిల్లాలో కీలక దశకు చేరుకుంది. ఈ పథకం కింద ఫీడర్ లెవల్ సోలరైజేషన్ ద్వారా చిత్తూరు జిల్లాలో మొత్తం 221 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని వేలాది రైతుల జీవితాల్లో పగటి వెలుగులు నిండనున్నాయి.
పీఎం కుసుమ్ పథకంలోని కాంపోనెంట్–సి కింద వ్యవసాయ ఫీడర్లను సౌర విద్యుత్‌తో అనుసంధానించే ఈ ప్రాజెక్టులను చిత్తూరు, కుప్పం డివిజన్ల పరిధిలో అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 42 సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా, దాదాపు 49 వేలకుపైగా వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఇది కేవలం విద్యుత్ సరఫరా మార్పు మాత్రమే కాకుండా, జిల్లా వ్యవసాయ రంగ భవిష్యత్తును మలుపుతిప్పే చారిత్రక చర్యగా అధికారులు భావిస్తున్నారు. చిత్తూరు డివిజన్ పరిధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా అమలు కానుంది. ఇక్కడ 80 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన అర్జున్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనుంది. మొత్తం 320 ఎకరాల విస్తీర్ణంలో, 16 సబ్ స్టేషన్ల పరిధిలో ఈ ప్లాంట్లను నెలకొల్పేందుకు అవసరమైన స్థలాలను ఇప్పటికే గుర్తించారు. ఈ సబ్ స్టేషన్ల పరిధిలోని 37 ఫీడర్ల ద్వారా 17,550 వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి వీలవుతుంది. ఇందుకోసం ఇప్పటివరకు 309.73 ఎకరాల భూమిని సేకరించగా, ప్రాజెక్టుకు సంబంధించి ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే సంస్థకు అవార్డు జారీ చేశారు. భూముల అప్పగింత పూర్తయ్యాక పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభం కానున్నాయి.
కుప్పం డివిజన్లో 141 మెగావాట్ల సామర్థ్యంతో
కుప్పం డివిజన్‌లో మరింత భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు అమలు కానుంది. కుప్పం నియోజకవర్గం పరిధిలో 141 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 570 ఎకరాల విస్తీర్ణంలో, 26 సబ్ స్టేషన్ల పరిధిలో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు రాగా, వారికి కూడా లెటర్ ఆఫ్ అవార్డును అధికారులు అందజేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 542.16 ఎకరాల భూమిని సేకరించగా, భూసేకరణ దాదాపు పూర్తయినట్టుగా అధికారులు వెల్లడించారు. కుప్పం డివిజన్‌లో అమలు కానున్న ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభమైతే 26 సబ్ స్టేషన్ల పరిధిలోని 130 ఫీడర్లకు సంబంధించిన 32,106 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పగటిపూట ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కుప్పంలో ఇప్పటికే రూరల్ ఎలక్ట్రిక్ కో–ఆపరేటివ్ సొసైటీ వ్యవస్థ ఉండటంతో, ఈ ఫీడర్ లెవల్ సోలరైజేషన్ ప్రాజెక్టు దేశంలోనే ఆదర్శవంతమైన నమూనాగా నిలిచే అవకాశముందని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు.
42 సబ్ స్టేషన్ల పరిధిలో....
ఈ రెండు డివిజన్లలో జరుగుతున్న ప్రాజెక్టులతో కలిపి చిత్తూరు జిల్లాలో మొత్తం 42 సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు జరగనుంది. వీటి ద్వారా జిల్లాలోని వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్‌ను సౌరశక్తితోనే ఉత్పత్తి చేసి, రైతులకు నేరుగా అందించాలన్నది ప్రభుత్వాల ఉద్దేశం. భూసేకరణ, టెండర్లు, అవార్డుల జారీ వంటి కీలక దశలు పూర్తికావడంతో, ప్రస్తుతం ట్రాన్స్‌కో అధికారులు సంబంధిత ఏజెన్సీలతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ, త్వరలోనే సేకరించిన భూములను సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే రైతులకు లభించే ప్రయోజనాలు విస్తృతంగా ఉండనున్నాయి. ఇప్పటివరకు రాత్రివేళల్లో విద్యుత్ రావడంతో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందడంతో సాగు పనులు సులభమవుతాయి. డీజిల్ పంపుసెట్ల వినియోగం తగ్గడంతో సాగు ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేకూరుతుంది. ఫీడర్ లెవల్ సోలరైజేషన్ వల్ల వోల్టేజీ సమస్యలు తొలగిపోవడంతో మోటార్లు కాలిపోవడం, తరచూ మరమ్మతులు చేయించుకోవడం వంటి సమస్యలు ఉండవు.
సౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, విద్యుత్ పంపిణీ వ్యవస్థపై ఉండే భారం కూడా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రయత్నాలతో అమలవుతున్న ఈ పీఎం కుసుమ్ పథకం, చిత్తూరు జిల్లా వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక భద్రతను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. సాగుకు పగటి వెలుగులు అందించే ఈ సోలార్ ప్రాజెక్టులు, చిత్తూరు జిల్లా రైతాంగానికి కొత్త ఆశలు రేకెత్తిస్తూ, వ్యవసాయ రంగంలో చారిత్రక మైలురాయిగా నిలవనున్నాయి.
గంగ 1 సోలార్ విద్యుత్ ప్లాంట్

