కుప్పం తో సమానంగా నగిరి నియోజకవర్గ అభివృద్ధి
నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కు అండగా ఉంటా
నగిరి పుత్తూరు మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తా
రెండేళ్లలో నగరికి కృష్ణా జలాలను తీసుకుని వస్తాం
వలసల నివారణకు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా
నగిరి ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హామీ
నగరి, జనవరి 24 (ఆంధ్రప్రభ) కుప్పం మాదిరిగానే నగరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్‌కు పూర్తి అండగా ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమం, పరిశుభ్రత మూడు సమన్వయంగా సాగితేనే రాష్ట్రానికి స్థిరమైన భవిష్యత్ ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని మున్సిపాలిటీలను మౌలిక సదుపాయాల పరంగా సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డ్రైనేజీ సమస్యలు, తాగునీటి కొరత వంటి ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని స్పష్టం చేశారు. పట్టణాలు అభివృద్ధి చెందితే గ్రామాలకూ మేలు జరుగుతుందని, పట్టణ, గ్రామ సమన్వయ అభివృద్ధే ప్రభుత్వ ఆలోచనగా ఉందని చెప్పారు. రానున్న రెండేళ్లలో కృష్ణా జలాలను నగరి నియోజకవర్గానికి తీసుకువచ్చి సాగునీరు, తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నీటే జీవనాధారమని, నీరు లేకుండా వ్యవసాయం, పరిశ్రమలు, జీవనం ఏదీ ముందుకు సాగదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల ద్వారా నగరి ప్రాంత వ్యవసాయ భూములకు నీరు అందితే రైతుల జీవితాల్లో మార్పు వస్తుందని, తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. నగరి నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుందని, ఉపాధి ఉంటే వలసలు ఆగుతాయని, వలసలు ఆగితే కుటుంబాలు బలపడతాయని వివరించారు. నగరి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన తన చివరి శ్వాస వరకూ ప్రజల కోసం అంకితభావంతో పనిచేశారని అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో ప్రజా జీవితంలోకి వచ్చిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని ప్రశంసించారు. ప్రజా ప్రతినిధులు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆయన చేసిన సేవలు ఒక ఆదర్శమని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మాట్లాడుతూ, ఏడాది క్రితం దీన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించామని, నేడు అది ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేక థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవలో కార్యక్రమం ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి వెంటనే పరిష్కారాలు చూపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించగలుగుతున్నారని, ఇది మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, ఇది అక్కచెల్లెళ్ల సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.33 వేల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. దేశంలో పెన్షన్ల కోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని ఆయన గర్వంగా తెలిపారు. పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీరు కాలుష్య రహితంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి అన్నారు. పరిశుభ్రత లేకుండా ఆరోగ్యం ఉండదని, ఆరోగ్యం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పారు..స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలుపై విపులంగా వివరిస్తూ, రూ.573 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ల ఏర్పాటుకు రూ.510 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. కంపోస్ట్ తయారీ కోసం డస్ట్‌బిన్‌లు అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలు, ట్రైసైకిళ్లు, పుష్‌కార్టులు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణాల్లో వదిలివెళ్లడంతో భూమి, భూగర్భజలాలు, వాయు కాలుష్యం పెరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇప్పుడు ఆ వ్యర్థాలన్నింటిని తొలగించి మళ్లీ పరిశుభ్రమైన పరిస్థితులు తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తొలగించి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే నాలుగు యూనిట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయని, రాజమండ్రి, విజయవాడల్లో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్లాస్టిక్, ఈ-వేస్ట్ సేకరణకు 130 స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేశామని, 2026 మార్చి నాటికి 660 స్వచ్ఛ రథాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకువస్తామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల పరిశుభ్రత కోసం ముస్తాబు అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, దీని వల్ల విద్యార్థుల్లో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. నగరాల్లో భారీ స్వీపింగ్ యంత్రాల వినియోగంతో పరిశుభ్రత మరింత మెరుగుపడుతోందని పేర్కొన్నారు.
గత పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి, నేరగాళ్లు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని భయాందోళన వాతావరణంలోకి నెట్టారని అన్నారు. అప్పట్లో ప్రజలకు మాట్లాడటానికి, నవ్వటానికి కూడా భయం ఉండేదని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిల్ చట్టం ద్వారా భూములను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం జరిగిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు. పట్టాదారు పాస్‌బుక్స్‌పై ఫోటోలు తొలగించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
రానున్న ఐదు సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. నగరి నియోజకవర్గంలో రూ.573 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని, ఈ నిధులు ప్రజల జీవన ప్రమాణాలను మార్చేలా ఉపయోగపడతాయని అన్నారు.
ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట్లాడుతూ, కృష్ణా జలాలను నియోజకవర్గానికి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం చారిత్రకమని అన్నారు. నగరి రెండు రాజధానులు, రెండు విమానాశ్రయాలు, రెండు పోర్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతమని, పారిశ్రామిక అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ముఖ్యమంత్రి మీద ఆశలతో ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారని, వారి ఆశలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు పార్లమెంటు సభ్యుడు జగ్గు మల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర వంటి కార్యక్రమాలకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండీ రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.వి.థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే నాని, పుంగునూరు టిడిపి ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

