పితృ దర్పణాలకు అనువైన రోజు
సూర్య దేవుని ఆరాధనకు శ్రేష్టమైన రోజు
అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
సంక్రాంతి పండుగ కోలాహలం ముగిసిన వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పర్వదినంగా భావించే మౌని అమావాస్య రాబోతోంది. ఈ ఏడాది జనవరి 18వ తేదీ ఆదివారం రోజున వచ్చే ఈ పవిత్ర అమావాస్యను పుష్య అమావాస్యగా, ఉత్తరాదిలో మాఘీ అమావాస్యగా పిలుస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తరువాత వచ్చే తొలి అమావాస్య కావడంతో దీనికి హిందూ ధర్మంలోనే కాకుండా ఖగోళ శాస్త్ర పరంగానూ విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. పితృత తర్పణాలకు అన్నవైన రోజు విభావిస్తారు. పవిత్ర స్నానాలు ఆచరించి సూర్యదేవుని ఆరాధిస్తారు.
పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుని మానస పుత్రుడు మనువు జన్మించిన రోజు ఇదేనని విశ్వాసం. అందుకే దీనిని మౌని అమావాస్యగా పిలుస్తారు. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించినప్పుడు అమృతం ఉద్భవించిన రోజుగా కూడా ఈ అమావాస్య ప్రసిద్ధి. ఈ కారణంగా ఈ రోజున చేసే నదీ స్నానాన్ని అమృత స్నానం అని పిలుస్తారు. కుంభమేళా, మాఘమేళా వంటి మహా క్రతువులలో ఋషులు, మునులు మౌన వ్రతం ఆచరించి తమ తపశ్శక్తిని పునరుద్ధరించుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మౌనం ద్వారా మనస్సు స్థిరత్వాన్ని పొందుతుందని, ఆత్మశక్తి పెరుగుతుందని శాస్త్రవచనం చెబుతోంది. ఆధ్యాత్మిక నమ్మకాలతో పాటు శాస్త్రీయంగానూ ఈ రోజుకు ప్రత్యేకత ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి రావడంతో గురుత్వాకర్షణ ప్రభావం గరిష్టంగా ఉంటుంది. సముద్రంలో ఆటుపోట్లు వచ్చినట్లే, 70 శాతం నీటితో కూడిన మానవ శరీరంపై కూడా ఈ ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ముఖ్యంగా మెదడులోని రసాయనాలు, రక్తప్రసరణ, భావోద్వేగాలపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మనిషి ఆందోళనకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, మౌనం, ఉపవాసం, ధ్యానం వంటి ఆచారాలు మానసిక సమతుల్యతకు మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఆదివారం వచ్చే అరుదైన అమావాస్య
ఆదివారం నాడు వచ్చే ఈ అమావాస్య పితృ దేవతలకు, సూర్యారాధనకు ఎంతో శ్రేష్ఠమైన రోజుగా భావిస్తారు. ఉదయం పూట సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండటం వల్ల మనసు అదుపులోకి వస్తుందని పెద్దల నమ్మకం. నదీ స్నానం కుదరని వారు ఇంట్లోనే పసుపు, నల్ల నువ్వులు, గంగాజలం కలిపిన నీటితో తలస్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. పుష్య అమావాస్య కావడంతో శని దేవుడికి ఇష్టమైన నువ్వులు, బెల్లం, నువ్వుల నూనె, అలాగే చలికాలంలో పేదలకు దుప్పట్లు దానం చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్వీకులను స్మరించుకుని తర్పణాలు వదలడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ఈ రోజున చేసే దానధర్మాలు జీవితంలో శుభఫలితాలను తీసుకువస్తాయని పెద్దలు అంటున్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉండనుంది. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో గణపతి హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, కొత్త వాహనాల పూజలు జరుగనున్నాయి. మొగిలీశ్వర ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. అక్కడ రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ఘనంగా నిర్వహించనున్నారు. బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, అలంకరణలు చేపడతారు. కోరిన కోరికలు తీరాలని భక్తులు పొంగలి నైవేద్యాలు సమర్పిస్తారు. జిల్లాలోని ఇతర శివాలయాలు, అమ్మవారి గుళ్లలో కూడా శివాభిషేకాలు, పితృ తర్పణాలు, అన్నదాన కార్యక్రమాలు, నిమ్మకాయ దీపాల ఏర్పాటు జరుగనున్నాయి. భక్తుల రాకతో ఆలయాల పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోనున్నాయి.
మౌనమే మహారక్ష
ఉరుకుల పరుగుల జీవనంలో మనిషికి దొరకనిది ప్రశాంతత. మౌని అమావాస్య మనకు నేర్పే పాఠం అదే. మాట తగ్గించి, మనసును అంతర్ముఖంగా మార్చుకుని, ధ్యానంలో లీనమైతే ఆత్మశాంతి లభిస్తుందని పెద్దలు చెబుతారు. సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని ఆధ్యాత్మిక చింతనతో ముగించడం ద్వారా రాబోయే ఏడాది కాలం పాటు మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ, ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరించడం వల్ల మనిషి జీవితంలో సమతుల్యత, శాంతి, శుభం నిలిచిపోతాయని పెద్దలు హితవు పలుకుతున్నారు.

