జిల్లాలో 42 ప్రభుత్వ పాటశాలల్లో పిఎం శ్రీ స్కూల్ పధకం అమలు
రూ. 847 లక్షలతో 134 అభివృద్ధి పనులు ప్రారంభం
12 పాఠశాలల్లో రసాయన శాస్త్ర ప్రయోగశాలలు
28 పాఠశాలల్లో ఆటస్థలాల అభివృద్ధికి నిధులు
16 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లకు కంచె ఏర్పాటు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
దేశవ్యాప్తంగా 14,500కు పైగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, వినూత్న బోధనా విధానాలతో ఆదర్శ పాఠశాలలుగా మార్చడం ద్వారా సమగ్ర, నాణ్యమైన, సమ్మిళిత విద్యను అందించడమే ఈ కేంద్ర ప్రాయోజిత పథకం ప్రధాన లక్ష్యం. పీఎం శ్రీ పథకం కింద అభివృద్ధి చేస్తున్న పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదులు, కంప్యూటర్ ప్రయోగశాలలు, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూల విధానాలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు, సౌరశక్తి వినియోగం, వ్యర్థాల పునర్వినియోగం వంటి చర్యల ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందిస్తున్నారు. ప్రయోగాత్మక అభ్యాసం, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలపై దృష్టి సారిస్తూ విద్యను జీవన నైపుణ్యాలతో ముడిపెడుతున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు కేవలం పరీక్షలకే కాకుండా జీవితం ఎదుర్కొనేలా సిద్ధమవుతున్నారు. ఈ పథకం 2022–23 నుండి 2026–27 వరకు అమలులో ఉండగా, సాధారణ రాష్ట్రాల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను సమకూరుస్తోంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచే ఛాలెంజ్ మోడ్లో ఎంపిక చేయడం ద్వారా పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడింది. తమ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్న యాజమాన్యాలకు ఈ పథకం ఒక అవకాశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం విద్యార్థులకు నిజంగా శుభవార్తగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 935 పాఠశాలలు పీఎం శ్రీ పథకం కింద ఎంపిక కావడం ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఇందులో చిత్తూరు జిల్లా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన స్థాయిలో ముందంజలో ఉంది. జిల్లాలో మొత్తం 42 పీఎం శ్రీ పాఠశాలలు పథకం కింద మొత్తం రూ. 847.61 లక్షలతో 134 అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే 98 పనులు పూర్తయ్యాయి. 31 పనులు ఇంకా కొనసాగుతుండగా, 6 పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 724.11 లక్షలు విడుదల చేయగా, అందులో రూ. 453.46 లక్షలను వ్యయం చేశారు. మిగిలిన రూ. 270.65 లక్షలు తదుపరి దశల అభివృద్ధికి వినియోగించనున్నారు. మొదటి దశలో చేపట్టిన పనులను పరిశీలిస్తే విద్యార్థుల మౌలిక అవసరాలు, పాఠశాల వసతుల మెరుగుదలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 12 పాఠశాలల్లో రసాయన శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేయగా, 28 పాఠశాలల్లో ఆటస్థలాల అభివృద్ధి చేపట్టారు. విద్యతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యమనే ఆలోచన దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చదువుపై ఆసక్తిని పెంచుతుండగా, 16 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లకు కంచె ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి, వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. 22 పాఠశాలల్లో వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు ఏర్పాటు చేయడం పర్యావరణ పరిరక్షణకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. అలాగే 12 పాఠశాలల్లో బాలుర మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా పరిశుభ్రత, ఆరోగ్య అంశాలకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు. రెండో దశలో విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచే దిశగా శాస్త్ర, సాంకేతిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒక జీవ శాస్త్ర గది, ఒక రసాయన శాస్త్ర ప్రయోగశాల, 4 కంప్యూటర్ గదులు, 3 సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తూ మొత్తం 6 అభివృద్ధి పనులు అమలవుతున్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం కల్పించి, భవిష్యత్ పోటీ ప్రపంచానికి సిద్ధం చేసే కీలక అడుగుగా మారనున్నాయి.
మొత్తం మీద పీఎం శ్రీ పథకం ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి గౌరవాన్ని తీసుకొస్తోంది. ఒకప్పుడు మౌలిక వసతుల లేమితో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఆదర్శ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయి. సంప్రదాయ విలువలను కాపాడుకుంటూనే ఆధునిక అవసరాలకు అనుగుణమైన విద్యను అందించాలన్న దృక్పథం ఈ పథకంలో స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో 42 పాఠశాలల్లో దాదాపు రూ. 848 లక్షలతో సాగుతున్న అభివృద్ధి పనులు రాబోయే తరాలకు గట్టి పునాదిగా నిలవనున్నాయి. విద్యే దేశ భవిష్యత్తుకు మూలాధారం అన్న సాంప్రదాయ ఆలోచనకు పీఎం శ్రీ స్కూల్స్ పథకం సాక్ష్యంగా నిలుస్తోంది.

