చిత్తూరు జిల్లాలో రూ. 6830 కోట్లతో వాటర్ గ్రిడ్…
సర్వే పూర్తి, ఆమోదానికి ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు
గండికోట నుంచి నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు
కండలేరు నుంచి ఐదు నియోజకవర్గాలకు కృష్ణా జలాలు
చిత్తూరు జిల్లా దాహార్తికి శాశ్వత పరిష్కారం!
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి ఏడాది వేసవి వస్తే జిల్లా అంతటా తాగునీటి కష్టాలు తలెత్తడం పరిపాటిగా మారింది. జీవనదులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేని ఈ ప్రాంతం చిన్న జలాశయాలు, బోర్లపైనే ఆధారపడుతూ వస్తోంది. ఫలితంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బోర్లు ఎండిపోవడం, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 6830 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జల జీవన్ మిషన్ కింద 172.18 కోట్ల రూపాయలతో తాగునీటి సరఫరా పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకం కింద కవర్ గాని గ్రామాలకు, పట్టణాలకు వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వత తాగునీటి పరిష్కారం చూపనున్నారు.
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం సబ్ అనే సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించారు. గత ఆరు నెలలుగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా సర్వే నిర్వహించిన ఈ సంస్థ తాజాగా సర్వేను పూర్తి చేసింది. సమగ్రమైన నివేదికలు, తుది అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాకు కూడా కృష్ణా జలాల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న 30 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి రూపకల్పన జరిగింది. గండికోట రిజర్వాయర్ నుంచి పుంగనూరు, పలమనేరు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాలకు తాగునీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అలాగే కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, చంద్రగిరి మున్సిపాలిటీలకూ నీటి సరఫరా చేయనున్నారు. ఈ ప్రాంతాల్లోని సుమారు 10.05 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు రూ. 2930 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. కండలేరు రిజర్వాయర్ నుంచి నగరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాలకు తాగునీరు అందించనున్నారు. అలాగే చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు మండలాలకు కూడా సరఫరా చేయనున్నారు. ఈ ప్రాంతాల్లోని 16.18 లక్షల జనాభాకు నీటిని అందించేందుకు రూ. 3900 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
57 మండలాలు – 8769 గ్రామాలకు నీటి సరఫరా
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని 57 మండలాలు, 8769 గ్రామాలు, మొత్తం 26.34 లక్షల జనాభాకు తాగునీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 94.88 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.గండికోట రిజర్వాయర్ నుంచి 26 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్ నుంచి 68.23 టీఎంసీలు నీళ్లను పైపులైన్ల ద్వారా తెచ్చిన నీటిని శుద్ధి చేసి, ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్ ట్యాంకులు, సంపులకు అనుసంధానించి కుళాయిల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తారు. ఇప్పటికే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రూ. 275 కోట్లతో కృష్ణా జలాలను చిత్తూరు మున్సిపాలిటీకి తీసుకురావడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తిరుపతి పబ్లిక్ హెల్త్ అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఇప్పటికే 2.67 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 50,456 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఖర్చు ఎక్కువైనా గ్రామాలకు సమీపంలోని జలాశయాల నుంచి సంవత్సరం పొడవునా నీరు అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రపంచ బ్యాంకు సహకారం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇటీవల సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్‌లో ఇప్పటివరకు జరిగిన పనులు, మిగిలిన పనులపై చర్చలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో గత ఐదేళ్లలో 5041 తాగునీటి పనులను ప్రతిపాదించగా, ఇప్పటివరకు 2,432 పనులు మాత్రమే పూర్తయ్యాయి. అంచనా వ్యయం రూ. 431.45 కోట్లు కాగా, ఖర్చు చేసిన మొత్తం రూ. 101.21 కోట్లు మాత్రమే.గ్రామాల్లోని 3,17,818 కుటుంబాల్లో 2,67,272 కుటుంబాలకు మాత్రమే నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 50,456 కుటుంబాలు తాగునీటి కోసం ఎదురుచూస్తున్నాయి. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించనున్నారు. తిరిగి ఎన్నికలకు వెళ్లే నాటికి జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రెండు, మూడు సంవత్సరాల్లో చిత్తూరు జిల్లా ప్రజలు కృష్ణాజలాలను తాగనున్నారు. వేసవిలో కూడా నీటి కష్టాలు ఉండవని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

