24, జనవరి 2026, శనివారం

భూమికి ఆకాశానికి మధ్య నిలిచిన ఒక అద్భుతం…

ప్రకృతి చేత చెక్కబడిన శివలింగం…
ప్రతి అడుగూ భక్తికి, సాహసానికి పరీక్ష…
అదే చిత్తూరు జిల్లాకు తలమానికంగా నిలిచిన పులిగుండు.

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పవిత్ర ప్రాంతాల్లో పులిగుండు ఒకటి. చిత్తూరు నగరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో, తిరుపతికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం భూమి మట్టం నుంచి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో వెలసి, ఆధ్యాత్మికతకు-ప్రకృతిసౌందర్యానికి అద్భుతమైన సంగమంగా నిలుస్తోంది. లింగాకారంలో దర్శనమిచ్చే రెండు భారీ రాతి గుండ్లు, ఈ జంట శిలలను చూస్తే శివ, పార్వతుల స్వరూపాలుగా భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

ఈ రెండు గుండ్లను చూస్తే రెండు కళ్ళు చాలవు అన్న భావన కలుగుతుంది. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు… అన్నీ కలిసి పులిగుండును ఒక సహజ అద్భుతంగా తీర్చిదిద్దాయి. ప్రతి మెట్టు ఎక్కుతున్నప్పుడు ఒళ్ళంతా గగుర్పొడిచే అనుభూతి కలుగుతుంది. ఒకవైపు భయం, మరోవైపు భక్తి… ఈ రెండింటి మధ్య సాగేది పులిగుండు యాత్ర. పులిగుండు అనే పేరు ఎలా వచ్చింది అన్నదానికీ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం పులులు సంచరించే అటవీ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. కొండ గుహల్లో పులులు తలదాచుకునేవని స్థానికులు చెబుతారు. పులి గాండ్రిస్తే చుట్టుపక్కల కొండల్లో మేతకు వెళ్లిన పశువులు చెల్లాచెదురయ్యేవని పెద్దలు గుర్తుచేస్తారు. ఆ కారణంగానే ఈ ప్రాంతానికి పులిగుండు అనే పేరు స్థిరపడింది.

నేటికి నాలుగు దశాబ్దాల క్రితం వరకు పులిగుండు పైకి ఎక్కేందుకు సరైన మార్గమే లేదు. తాళ్లు, నిచ్చెనల సహాయంతో, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భక్తులు కొండపైకి చేరేవారు. ఆ సమయంలోనే ఈ ప్రాంత మహిమను, ప్రాశస్తిని గుర్తించిన జ్ఞానేందర్ రెడ్డి తొలిసారిగా త్రాడుల సాయంతో గుండుపైకి ఎక్కి అక్కడున్న అద్భుతాలను ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పం చేసుకున్నారు. అదే సంకల్పం ఈనాడు పులిగుండును ఒక ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చింది. మాజీ పార్లమెంటు సభ్యుడు, వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సో సలహాదారుగా పనిచేసిన మహాసముద్ర జ్ఞానేందర్ రెడ్డి రెడ్డి, ఆయన సోదరుడు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాసాగర్ రెడ్డి చొరవతో, పూర్తిగా సొంత నిధులతో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో గుండుపైకి చేరుకునేలా రాతి మెట్ల మార్గం, ఇనుప మెట్ల దారి ఏర్పాటు చేశారు. భూమి లోతుల నుంచి లావాలా పొంగి వచ్చినట్లుగా కనిపించే రెండు లింగాకార రాళ్ల మధ్య ఇనుప మెట్లను ఏర్పాటు చేసి, శివ-పార్వతుల దర్శనాన్ని సులభతరం చేశారు. రెండు గుండ్ల పైభాగం విస్తీర్ణం సుమారు రెండు ఎకరాల మేర ఉండటం విశేషం.

పులిగుండు పైకి చేరితే అక్కడి నుంచి కనిపించే దృశ్యం మరిచిపోలేనిది. వందల సంఖ్యలో గ్రామాలు కంటపడుతూ, ప్రకృతి వైభవం మనసును హత్తుకుంటుంది. పైభాగంలో శివ-పార్వతులతో పాటు సాయిబాబా, వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, నవగ్రహాల ఆలయాలు దర్శనమిస్తాయి. కొండ మధ్య భాగంలో విఘ్నేశ్వరుడు, శ్రీ వేంకటేశ్వరుడు, లక్ష్మీదేవి ఆలయాలు ఉండగా, అడుగున మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి స్వామి దర్శనం సంప్రదాయంగా ముందుగా చేస్తారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరుగుతుంటాయి. సంక్రాంతి పండుగ ముగిసిన నాల్గవ రోజు జరిగే జాతర సమయంలో ఇసుక వేస్తే కింద పడనంతగా భక్తులు గుమిగూడుతారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పులిగుండేశ్వర స్వామి దర్శనానికి తరలివస్తుంటారు. పెళ్లిళ్లు చేసుకునేందుకు కళ్యాణ సత్రాలు కూడా ఏర్పాటు చేయడం విశేషం. తక్కువ అద్దెతో ఇచ్చే ఈ సత్రాల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నారు.

పులిగుండు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ఒక చారిత్రక కేంద్రం కూడా. కార్వేటినగరం రాజుల పాలన కాలంలో కల్లూరు, పాకాల, పాళ్యం, మొగరాల, పులిచెర్ల, రొంపిచెర్ల, నర్గతి, తుంబ వంటి ప్రాంతాల పాలెగాళ్లు బ్రిటీష్ పాలకులకు ఎదురు నిలిచినప్పుడు, ప్రాణరక్షణ కోసం పులిగుండులోని గుహలను ఆశ్రయించినట్లు చరిత్ర చెబుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ కొండలు వారికి సహజ రక్షణగా నిలిచాయి. నేటికీ ఇక్కడ కనిపించే రాతి నిర్మాణాలు, శిల్పసౌందర్యం ఆ కాలపు ఆనవాళ్లను స్పష్టంగా గుర్తు చేస్తాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత విశ్రాంతి భవనం, వసతి గదులు, రెస్టారెంట్, కళ్యాణమండపాలు ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో పనిచేసే వారు మైండ్ రిలీఫ్ కోసం రోడ్డు మార్గాన వచ్చి పులిగుండు ప్రదక్షిణ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారో, అలానే పులిగుండు వద్ద కూడా చేయాలన్న ఆలోచనకు రూపకల్పన జరుగుతోంది.

మహాసముద్రం నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి కుటుంబీకులు సహా పులికెళ్లు గ్రామస్తులు ఈ క్షేత్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. వారి సేవా భావన వల్లే పులిగుండు నేడు జిల్లాకే వన్నె తెచ్చే స్థాయికి ఎదిగింది. ప్రభుత్వం మరింత చొరవ చూపితే, ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక-ఆధ్యాత్మిక కేంద్రంగా మారే అన్ని అవకాశాలూ ఉన్నాయని దయాసాగర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. మార్చి 6వ తేదీన పులిగుండేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన టిటిడి వేద పండితుల చేతుల మీదుగా జరగనుండటం మరో విశేషం. తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయక స్వామి ఆలయాల్లాగే పులిగుండు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఒక మహా పుణ్యక్షేత్రంగా నిలవాలని భక్తుల ఆకాంక్ష. ప్రకృతి నిర్మించి ఇచ్చిన భారీ శివలింగంలా కనిపించే పులిగుండు, ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి మూడింటినీ కలబోసుకున్న అరుదైన క్షేత్రం. శివపార్వతుల కృపతో, ప్రజల సహకారంతో, ఐక్యమత్యంతో పులిగుండు మరింత వెలుగులు ప్రసరించాలన్నదే భక్తుల ఆకాంక్ష.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *