5, జనవరి 2026, సోమవారం

రేపు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు

నూతన ఉపాధి హామీ చట్టంపై అవగాహన కోసం 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో భారత పార్లమెంటు కొత్తగా ఆమోదించిన వికసిత్ భారత్ రోజ్ గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం – 2025పై గ్రామీణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు జనవరి 5, 2026న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక గ్రామసభల ప్రధాన ఉద్దేశ్యం కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టంలోని నిబంధనలు, లక్ష్యాలను గ్రామస్థాయిలో ప్రజలకు స్పష్టంగా వివరించడం. ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఉపాధి కూలీలు, మేట్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల ప్రజలు విరివిగా పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.

ఈ నూతన చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భద్రత, స్థిరమైన జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టం కింద సంవత్సరానికి 100 రోజుల ఉపాధి ఉండగా, కొత్త చట్టం కింద ఈ పని దినాలను 125 రోజులకు పెంచారు. దీని ద్వారా గ్రామీణ కుటుంబాలకు అదనంగా 25 రోజుల ఉపాధి లభించనుంది. నిరుద్యోగ భృతి విషయంలో కీలక మార్పులు చేశారు. గతంలో ఉన్న కఠినమైన షరతులను పూర్తిగా తొలగించి, పని కోరిన తరువాత ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి స్వయంచాలకంగా శ్రామికుని ఖాతాలో జమ అయ్యే విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే వేతనాల చెల్లింపులో ఆలస్యం జరిగితే, ఆలస్యం అయిన ప్రతి రోజుకు తగిన పరిహారం కూడా కలిపి చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. ఈ చట్టం కింద చేపట్టే పనులను నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించారు. అవి నీటి భద్రత, నీటి సంరక్షణ పనులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల కార్యక్రమాలు, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే పనులు. గ్రామ అవసరాలకు అనుగుణంగా ఏ పనులు చేపట్టాలన్నది గ్రామసభలోనే నిర్ణయించనున్నారు. వ్యవసాయ రంగానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విత్తనాలు వేయడం, కోత కోయడం వంటి ప్రధాన వ్యవసాయ పనుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల ప్రత్యేక వ్యవధిని కేటాయించవచ్చు. ఆ కాలంలో ఈ చట్టం కింద పనులు జరగవు. దీనివల్ల వ్యవసాయ కూలీల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.

పథకం అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పరిపాలనా వ్యయ పరిమితిని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచారు. గ్రామసభల్లో తీసుకునే నిర్ణయాలు, వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసి, సంబంధిత మొబైల్ అనువర్తనాల ద్వారా అప్లోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, గ్రామంలో చేపట్టే పనుల ప్రణాళికను గ్రామసభలోనే రూపొందించనున్నారు. దీనిని వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాత ఉపాధి హామీ పనులు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రణాళిక ప్రకారం పూర్తిచేయనున్నారు. అవి పూర్తైన తరువాత మాత్రమే కొత్త చట్టం కింద పనులు ప్రారంభమవుతాయి. కొత్త చట్టంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించింది. పోస్టర్లు, పాంప్లెట్లు తదితర ప్రచార సామగ్రి తయారీ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 2000లను పరిపాలనా వ్యయం కింద కేటాయించారు. మొత్తంగా వికసిత్ భారత్ రోజ్ గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి వ్యవస్థను బలోపేతం చేసి, గ్రామాలను స్వావలంబన దిశగా ముందుకు నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *