14, జనవరి 2026, బుధవారం

పశువులను పూజించే పండుగే కనుమ

గోవర్ధన గిరిధారి లీలతో మొదలైన గోపూజ సంప్రదాయం
చిట్లకుప్ప చుట్టూ ప్రదక్షిణలు.. పశువులపై బలి అన్నం
జల్లికట్టు జోరు.. యువకుల పౌరుష ప్రదర్శన
యంత్రాల యుగంలో కనుమరుగవుతున్న ఎద్దులు
పాడి పరిశ్రమగా మారిన ఆవులు – రైతుకు కొత్త జీవనాధారంగా మారుతున్న ఆవుల పెంపకం
రేపు కనుమ పండుగ 


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)


సంవత్సరం పొడవునా రైతుల వ్యవసాయానికి తోడ్పడుతూ జీవనాధారంగా మారిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ వాటిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజించే పండుగే కనుమ పండుగ. గోవర్ధన గిరిధారి లీలతో మొదలైన గోపూజ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. కనుమ రోజు గ్రామ పొలిమేరల్లో చిట్లకుప్ప మంటల చుట్టూ అలంకరించిన పశువులతో ప్రదక్షిణలు, బలి ఇచ్చిన పొట్టేలు రక్తంతో కలిపిన అన్నాన్ని పశువులపై చల్లే ఆచారం చాలా గ్రామాల్లో ఉంది. పశువుల ఊరేగింపు, పశువులను తరమడం, జల్లికట్టు పోటీల్లో యువకుల పౌరుష ప్రదర్శన సర్వసాధారణం. యంత్రాల యుగంలో ఎద్దులు, కోడెదూడలు కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలో పాడి ఆవులు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. కలిసిన రైతు జీవితానికి ప్రతిబింబమే ‘కనుమ’. వాటికి రైతన్న కృతజ్ఞతను వ్యక్తం చేసే ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు.


సంక్రాంతి సంబరాల్లో మూడో రోజు వచ్చే ‘కనుమ’ పండుగ రైతు జీవితానికి అద్దం పడుతుంది. మనిషి, ప్రకృతి, పశువు మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ఇది ప్రతీక. ఏడాది పొడవునా తనతో పాటు కష్టపడి పొలం దున్నిన ఎద్దులకు, పాలిచ్చే ఆవులకు కృతజ్ఞతలు తెలిపే రోజు కనుమ. కనుమ నాడు మినుము తినాలనే సామెతలోనే ఈ పండుగ ప్రాముఖ్యత దాగి ఉంది. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో గోకులవాసులు పంటలు బాగా పండాలని ఇంద్రుడిని పూజించేవారు. అయితే శ్రీకృష్ణుడు మనకు గడ్డి, నీరు ఇచ్చే గోవర్ధన గిరినే పూజించాలని వారికి బోధించాడు. దీనితో ఆగ్రహించిన ఇంద్రుడు కుండపోత వర్షం కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తి గోపాలులను, గోవులను రక్షించాడు. ఈ సంఘటన కనుమ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున గోపూజకు విశేష ప్రాధాన్యం ఉంది.

భక్తిశ్రద్ధలతో కనుమ పండుగ

చిత్తూరు జిల్లాలో కనుమ పండుగను రైతులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. తెల్లవారుజామునే పశువులను చెరువులకు తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. కొమ్ములకు రంగులు వేసి, గజ్జెలు, పూలదండలు కడతారు. కొట్టాలను శుభ్రం చేసి ముగ్గులు వేసి, ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. సాయంత్రం వేళ గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి, పశువుల చుట్టూ కుటుంబ సభ్యులు ప్రదక్షిణలు చేస్తారు. గ్రామ పొలిమేరల్లో చిట్లాకుప్ప వేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఎండు పుల్లలు, పిడకలతో మంటలు వేసి, అలంకరించిన పశువులను ఆ మంటల చుట్టూ తిప్పుతారు. ఇలా చేస్తే దిష్టి, రోగాలు, దుష్టశక్తులు దహించుకుపోతాయని రైతుల నమ్మకం. అనంతరం పొట్టేలును బలి ఇచ్చి, ఆ రక్తంతో కలిపిన అన్నాన్ని పశువులపై చల్లుతారు. ఇది పశువులకు రక్షణ కవచంలా ఉంటుందని భావిస్తారు.

జల్లికట్టు ప్రత్యేక ఆకర్షణ

జిల్లాలోని చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో కనుమ రోజున పశువుల పండుగ పేరుతో మినీ జల్లికట్టు నిర్వహిస్తారు. పశువుల కొమ్ములకు బహుమతులు లేదా పలకలు కట్టి వీధుల్లోకి వదులుతారు. యువకులు వాటిని పట్టుకునేందుకు పోటీ పడతారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేటలో జరిగే పశువుల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది గ్రామీణ పౌరుషానికి ప్రతీకగా నిలుస్తోంది. సంక్రాంతి రోజు శాకాహారంతో గడిపిన జనం, కనుమ రోజున మాంసాహారంపై దృష్టి పెడతారు. నాటు కోడి పులుసు, మటన్ కూర, రాగి ముద్దతో ఇళ్లు ఘుమఘుమలాడుతాయి. కనుమ నాడు కాకి కూడా కదలదన్న నానుడి జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది. ఆరోగ్య పరంగా చూస్తే కనుమ రోజున గారెలు తినడం ఆనవాయితీ. మినుముల్లో ఉండే ప్రోటీన్లు శరీరానికి బలాన్ని ఇస్తాయి. చలికాలంలో శక్తినిచ్చే ఆహారంగా పెద్దలు దీనిని ఎంతో విలువగా భావిస్తారు.

కనుమరుగవుతున్న కోడెదూడలు

ఒకప్పుడు వ్యవసాయం అంటే ఎద్దులే ఆధారం. పొలం దున్నాలన్నా, బండి లాగాలన్నా ఎద్దులే ప్రధాన పాత్ర పోషించేవి. కానీ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రావడంతో ఎద్దుల అవసరం తగ్గింది. దీంతో జిల్లాలో ఎద్దుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినా, పశువుల పట్ల రైతన్నకు ఉన్న కృతజ్ఞతాభావం మాత్రం కనుమ పండుగ రూపంలో తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. మొత్తానికి, పశువుల అరుపులు, డప్పుల మోతలు, మాంసాహార విందులు, వినోదాలతో చిత్తూరు జిల్లాలో కనుమ పండుగ రైతు జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతిగా నిలుస్తోంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *